Share News

కలల సారథి

ABN , Publish Date - May 30 , 2026 | 01:15 AM

ప్రభుత్వ పాఠశాలలు అంటే మనకు గుర్తొచ్చేది వసతుల లేమి.. బ్లాక్‌బోర్డులు. కానీ బెంగళూరులోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నిరుపేద పిల్లలు...

కలల సారథి

ప్రభుత్వ పాఠశాలలు అంటే మనకు గుర్తొచ్చేది వసతుల లేమి.. బ్లాక్‌బోర్డులు. కానీ బెంగళూరులోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా నిరుపేద పిల్లలు ల్యాప్‌టా్‌పల ముందు కూర్చుని ఉత్సాహంగా కోడింగ్‌ చేస్తున్నారు. స్ర్కీన్లపై వినూత్న ప్రాజెక్టులను డిజైన్‌ చేస్తున్నారు. పేద పిల్లల జీవితాల్లో కనిపిస్తున్న ఈ ఊహించని విప్లవాత్మక మార్పు వెనుక ఉన్న మహిళా శక్తి... నేహా చావ్లా. ఐటీ రంగంలో దశాబ్దకాలంపాటు అనుభవించిన లగ్జరీ లైఫ్‌ను వదిలి.. వేలమంది పేద పిల్లల భవిష్యత్తును మారుస్తున్న ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం.

నేహా చావ్లా ప్రయాణం టాటా సంస్థల పురిటిగడ్డగా పేరొందిన ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచే సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే సేవా దృక్పథాన్ని కుటుంబం నుంచి ఆమె అలవర్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు, ఎడ్‌టెక్‌ స్టార్ట్‌పలలో హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌ విభాగాలలో దాదాపు పదేళ్లపాటు పనిచేశారు. కెరీర్‌లో ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ.. ఆమె మనసులో ఎప్పుడూ ఒక అసంతృప్తి ఉండేది. సమాజానికి ఉపయోగపడే పనిచేయాలనే తపన నిరంతరం వెంటాడేది. అదే సమయంలో దేశంలో టెక్నాలజీ శరవేగంగా దూసుకుపోతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు కనీస కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా అందకపోవడాన్ని ఆమె గమనించారు. ‘ధనవంతుల పిల్లలకు మాత్రమే లభించే 21వ శతాబ్దపు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు.. రూపాయి ఫీజు కూడా కట్టలేని ప్రభుత్వ స్కూల్‌ పిల్లలకు ఎందుకు అందకూడదు?’ అనే ప్రశ్న ఆమెను సుఖవంతమైన కార్పొరేట్‌ ఉద్యోగానికి రాజీనామా చేసేలా చేసింది.


అడ్డంకులను అధిగమిస్తూ..

ఉద్యోగాన్ని వదిలిపెట్టిన నేహా చావ్లా.. తన ఆలోచనకు ఒక పటిష్టమైన రూపాన్ని ఇచ్చేందుకు ఐఐఎం బెంగళూరును ఆశ్రయించారు. అక్కడ ‘విమెన్‌ స్టార్టప్‌ ప్రోగ్రాం’లో స్థానం సంపాదించి ఒక సామాజిక ఆలోచనను ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేసే ఒక బిజినెస్‌ మోడల్‌గా మార్చడానికి శిక్షణ పొందారు. అలా ‘ప్రాజెక్ట్‌ శిక్ష’ ఫౌండేషన్‌కు పునాది పడింది. కానీ క్షేత్రస్థాయిలో సవాళ్లు స్వాగతం పలికాయి. అధికారుల నుంచి అనుమతులు పొందడం, మౌలిక వసతులు లేని స్కూళ్లలో కంప్యూటర్లు అమర్చడం, అన్నింటికీ మించి ల్యాప్‌టాప్‌ అంటేనే భయపడే పిల్లలకు టెక్నాలజీపై ఆసక్తి కలిగించడం పెద్ద సవాలుగా మారింది. అయితే నేహ వెనకడుగు వేయలేదు. విద్యాశాఖ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ స్కూళ్లలోనే ‘డిజిటల్‌ శిక్ష ల్యాబ్స్‌’ను విజయవంతంగా ఏర్పాటు చేశారు.

10 వేల మంది జీవితాల్లో మార్పు

ఈ రోజు ‘ప్రాజెక్ట్‌ శిక్ష’ కేవలం కంప్యూటర్‌ కేంద్రంగానే కాకుండా పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లోని 32 కంటే ఎక్కువ పాఠశాలల్లో ఈ ల్యాబ్స్‌ నడుస్తున్నాయి. వీటి ద్వారా దాదాపు 10 వేల మందికిపైగా వెనుకబడిన విద్యార్థులకు సంపూర్ణ ఉచిత డిజిటల్‌ నైపుణ్యాలను అందిస్తున్నారు. ఇక్కడ కేవలం టైపింగ్‌ మాత్రమే నేర్పించరు. 21వ శతాబ్దానికి అవసరమైన క్రిటికల్‌ థింకింగ్‌, కోడింగ్‌, లైఫ్‌ స్కిల్స్‌ వంటి అత్యాధునిక సబ్జెక్టులను బోధిస్తున్నారు. నిన్నటి వరకు స్మార్ట్‌ఫోన్‌ కూడా వాడటం తెలియని పిల్లలు.. నేడు సొంతంగా చిన్నచిన్న గేమింగ్‌ యాప్స్‌ తయారుచేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

ఎన్జీవో స్టోరీ...

నేహ కేవలం విద్యారంగానికే పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా పనిచేస్తున్న చిన్నచిన్న స్వచ్ఛంద సంస్థలకు సరైన మార్కెటింగ్‌ నైపుణ్యాలు లేకపోవడం వల్ల వారి పనులు ప్రపంచానికి తెలియడం లేదని ఆమె గ్రహించారు. దీనికి పరిష్కారంగా ఆమె ‘ఎన్జీవో స్టోరీ’ అనే మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 2,500కుపైగా గ్రామీణ ఎన్జీవోల సక్సెస్‌ స్టోరీలను ప్రపంచానికి పరిచయం చేసివారికి దాతలనుంచి అవసరమైన ఆర్థికసాయం అందేలా వారధిగా నిలిచారు.


లభించిన గౌరవాలు

సామాజిక చేంజ్‌మేకర్‌గా, రచయిత్రిగా నేహా చావ్లా చేస్తున్న బహుముఖ కృషికి ఎన్నో పురస్కారాలు ప్రశంసలు అందాయి. సమాజంలో ఆమె తెచ్చిన ఈ నిశ్శబ్ద విప్లవానికి గాను ఇటీవల బెంగళూరులో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘సౌత్‌ ఇండియా విమెన్‌ అచీవర్స్‌’ అవార్డ్స్‌ వేడుకలో ఆమెకు ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ సర్వీస్‌’ అవార్డు లభించింది. ‘‘సమాజంలో మార్పు అనేది ఎవరో ఇస్తే రాదు.. ఆ మార్పు మనతోనే ప్రారంభం కావాలి’’ అని నమ్మడమే కాకుండా దానిని ఆచరించి చూపించారు నేహ. సొంత కెరీర్‌ను, లగ్జరీ జీవితాన్ని పణంగా పెట్టి వేలాదిమంది పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఆమె ప్రయాణం అద్భుతం. ‘‘ఒక చేతిలో ల్యాప్‌టాప్‌, మనసులో సేవాభావం ఉంటే ఏ బిడ్డ భవిష్యత్తు అయినా మారిపోతుంది’’ అని చాటిచెబుతున్న నేహ నిజంగానే నవభారత నిర్మాణంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి.

ఈ వార్తలు కూడా చదవండి..

మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

For More AP News And Telugu News

Updated Date - May 30 , 2026 | 01:15 AM