Share News

రేపటి పౌరులకు ఆమె భరోసా

ABN , Publish Date - Feb 23 , 2026 | 06:15 AM

‘ప్రపంచంలో ఏ మార్పును నువ్వు కోరుకుంటావో... ఆ మార్పు నువ్వే కావాలి’ అనే మహాత్మా గాంధీ మాటలు మొనీషా బాలమురుగన్‌లో పేద ప్రజలకు తన వంతుగా ఏదైనా చేయాలనే తపనను పెంచాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, మెడికల్‌, సైకియాట్రిక్‌...

రేపటి పౌరులకు ఆమె భరోసా

‘‘అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి లక్షలకు లక్షలు విరాళాలే అవసరం లేదు... తమకు ఉన్నదానిలో కాస్త పంచుకోవాలనే ఆలోచన ప్రజల్లో కలిగిస్తే చాలు’’ అని చెప్పడమే కాదు... ఆ దిశగా కృషి చేసి మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు మొనీషా బాలమురుగన్‌. చెన్నైలో ఏడేళ్ళ క్రితం ఆమె ప్రారంభించిన సంస్థ అట్టడుగు వర్గాలకు చెందిన వందలమంది పిల్లల ఆహార, విద్యా అవసరాలను తీరుస్తోంది. మహిళల్లో నైపుణ్యాలను మెరుగుపరిచి... వారి ఆర్థిక సుస్థిరతకు దోహదం చేస్తోంది.

‘ప్రపంచంలో ఏ మార్పును నువ్వు కోరుకుంటావో... ఆ మార్పు నువ్వే కావాలి’ అనే మహాత్మా గాంధీ మాటలు మొనీషా బాలమురుగన్‌లో పేద ప్రజలకు తన వంతుగా ఏదైనా చేయాలనే తపనను పెంచాయి. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, మెడికల్‌, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్క్‌లో స్పెషలైజేషన్‌ చేసిన మొనీషా... తన కోర్సులో భాగంగా క్షేత్రస్థాయి సందర్శనలకు, ముఖ్యంగా గ్రామీణ బాలల కోసం నిర్వహించే శిబిరాలకు వెళ్ళేవారు. ‘‘అక్కడ నేను చూసిన సామాజిక సమస్యలు నా దృక్పథాన్ని పూర్తిగా మార్చాయి. సమాజంలో వ్యత్యాసాల తాలూకు వాస్తవికత... నేను డిప్లమా పూర్తి చేయకుండానే సామాజిక సేవలోకి తీసుకొచ్చింది’’ అని గుర్తు చేసుకున్నారు మొనీషా.


విద్యార్థులు భాగస్వాములుగా...

అయితే ఇది అంత సులువుగా ప్రారంభం కాలేదు. ఆమె చెన్నైకి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్‌. ‘‘నాకు త్వరగా వివాహం చేయాలని కుటుంబ సభ్యులు భావించేవారు. కానీ మా నాన్న నాకు నచ్చిన దారిలో వెళ్ళాలని ప్రోత్సహించారు. అనాథలు, నిరాశ్రయులు, పేదరికం కారణంగా కుటుంబానికి భారమైన, ఎవరూ పట్టించుకోని పిల్లలు ఎంతోమంది వీధుల్లో, సముద్ర తీరంలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆకలి తీర్చడం, బడికి దూరమైన ఆ పిల్లలకు చదువు నేర్పించడం, వారి మానసిక ఆరోగ్యానికి దోహదం చేయడం లక్ష్యంగా 2019లో ‘నామ్‌ విధైకాలమ్‌’ అనే సంస్థను ప్రారంభించాను’’ అని చెప్పారు మొనీషా. చెన్నై కేంద్రంగా పలు ప్రాంతాల్లో ఈ సంస్థ కాల్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనికోసం వివిధ ప్రాజెక్టులకు మొనీషా రూపకల్పన చేశారు. వాటిలో విద్యార్థులను ప్రధాన భాగస్వాములుగా చేశారు. వీటిలో బాగా విజయవంతమైన వాటిలో ‘63 ప్రాజెక్ట్‌’ ఒకటి. దీనికోసం పాఠశాల విద్యార్థులు తమకు ఇచ్చే పాకెట్‌ మనీ నుంచి నెలకు 63 రూపాయలు కేటాయిస్తే... నిరాశ్రయులైన వారికి ఆహారాన్ని అందజేస్తారు. కొవిడ్‌ తరువాత చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు వేలాదిమంది ఆకలి తీరుస్తోంది. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా దీనిలో పాలుపంచుకుంటున్నారు.


77-Navya.jpg

సేవలతో పాటు జీవన భద్రత

ఈ సంస్థ ఆధ్వర్యంలో ఒక కమ్యూనిటీ ట్యూషన్‌ సెంటర్‌ రోజూ నడుస్తోంది. తమ బడుల్లో పొందని నైపుణ్యాలను, విద్యాపరమైన అంశాలను పిల్లలు అందులో నేర్చుకుంటారు. స్థానిక మహిళల కోసం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ వారికి న్యాయపరమైన, ఆర్థికపరమైన, వ్యక్తిగతమైన సమస్యలకు సలహాలు, పరిష్కారాలు, సహాయం అందిస్తారు. ‘నామ్‌ విధైకాలమ్‌’ కార్యక్రమాల్లో ఇప్పుడు ఎన్నో సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ‘‘మానసిక ఆరోగ్యంపై నేను శిక్షణ తీసుకున్నాను. మురికివాడల్లో దాని గురించి ఎవరూ పట్టించుకోరు. యువత తరచూ ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంది. వారికోసం తరచుగా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాను. దీనివల్ల దాదాపు రెండువేలమంది ప్రయోజనం పొందారు. పర్యావరణ పరిరక్షణపై పౌరుల్లో అవగాహన కల్పించడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం. సంప్రదాయకమైన జానపద కళారూపాలను వీధుల్లో ప్రదర్శిస్తూ... ప్లాస్టిక్‌ రహితమైన జీవనం, పచ్చదనాన్ని పెంచడం గురించి ప్రచారం చేస్తున్నాం. మహిళలకు సబ్బులు, కొవ్వొత్తులు, కాగితపు సంచుల తయారీలాంటి అంశాల్లో ఇస్తున్న శిక్షణ వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పడుతోంది. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. కేవలం సేవలు కాదు... పేద పిల్లలు, మహిళల జీవితాలకు భద్రత కల్పించడం మా లక్ష్యం. చిన్న స్థాయిలో వ్యవస్థాగతమైన మార్పుల కోసం మేము చేస్తున్న కృషి... దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలను ఇస్తుందని మా ఆశ’’ అంటున్నారు మొనీషా.

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

కొందరు జర్నలిస్టులు మా మాటలను వక్రీకరిస్తున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 06:16 AM