టెన్నిస్ కోర్టులో... కొత్త మెరుపు మిరా
ABN , Publish Date - Jun 10 , 2026 | 03:03 AM
ఒక విజయం... దాని వెనుక ఒడుదొడుకులు... జీర్ణించుకోలేని ఓటములు... కఠోర పరిశ్రమ... మానసిక సంఘర్షణలు... రష్యా యువ టెన్నిస్ సంచలనం మిరా ఆండ్రీవా గెలుపు బాటలో...
విజేత
ఒక విజయం... దాని వెనుక ఒడుదొడుకులు... జీర్ణించుకోలేని ఓటములు... కఠోర పరిశ్రమ... మానసిక సంఘర్షణలు... రష్యా యువ టెన్నిస్ సంచలనం మిరా ఆండ్రీవా గెలుపు బాటలో ఇలాంటివెన్నో. కానీ... సడలని సంకల్పం... పట్టు వదలని ప్రయత్నంతో అన్నిటినీ అధిగమించింది. మోనికా సెలెస్ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అతిపిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ‘ఇంత కష్టపడి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు నాకు నేనే ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను’ అంటున్న అండ్రీవా గ్రాండ్‌స్లామ్ జర్నీ ఇది.
మరియా షరపోవా... ఒకప్పటి అగ్రశ్రేణి క్రీడాకారిణి. ఆమె తరువాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి రష్యా క్రీడాకారిణి... ఆండ్రీవా. ఆరేళ్లప్పుడు రాకెట్ పట్టిన ఈ 19 ఏళ్ల సంచలనం... పుట్టింది సెర్బియాలో. ఆమె అక్క ఎరికా ఆండ్రీవా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. ఎరికా గర్భంలో ఉన్నప్పుడే తన పిల్లలను టెన్నిస్ స్టార్లను చేయాలని తల్లి రైసా కలలు కన్నారు. ‘‘అక్క కడుపులో ఉన్నప్పుడు అమ్మ రాత్రిపూట లేచి టెన్నిస్, వాలీబాల్ మ్యాచ్‌లు చూసేదట. ఆ సమయంలోనే పుట్టబోయే పిల్లలను క్రీడాకారులుగా ఉన్నత స్థానంలో చూడాలనుకున్నానని అమ్మ మాతో చెప్పేది. నేనైతే రెండేళ్లప్పటి నుంచీ టెన్నిస్ కోర్టుల చుట్టూ తిరుగుతుండేదాన్నిట. నాలుగేళ్లప్పుడు ఆడటానికి ప్రయత్నించినప్పుడు టెన్నిస్ రాకెట్‌ను పట్టుకోవడానికి నా చిన్న చేతులు సరిపోలేదు’’ అంటూ చిన్ననాటి రోజులు గుర్తు చేసుకున్న ఆండ్రీవా... టెన్నిస్ ఆడాలన్న కోరిక తనది కాదంటుంది. ‘అది నా ఇష్టం కాదు. అమ్మానాన్నలే నన్ను బలవంతం చేశార’ంటుంది నవ్వుతూ.
కుటుంబం త్యాగాలు...
ఆండ్రీవాను ఉన్నత స్థానంలో చూడాలన్న తపనతో ఆమె కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది. అత్యున్నత స్థాయి టెన్నిస్ శిక్షణ కోసం సెర్బియా నుంచి రష్యాకు నివాసం మార్చుకుంది. కుమార్తెలు ఇద్దరూ కెరీర్‌లో దూసుకుపోవడం చూసి, వారి నైపుణ్యానికి మరింత పదును పెట్టాలని రైసా భావించారు. దాంతో నాలుగేళ్ల కింద ఆ పిల్లలు మాస్కో నుంచి ఫ్రాన్స్‌లోని కేన్స్‌కు వెళ్లారు. అక్కడి ‘ఎలైట్ టెన్నిస్ సెంటర్’లో శిక్షణ తీసుకున్నారు. రష్యా టెన్నిస్ స్టార్, మాజీ ప్రపంచ నెంబర్‌వన్ డానిల్ మెద్వెదేవ్ కూడా ఇదే సెంటర్‌లో మ్యాచ్‌లకు ముందు సన్నద్ధమయ్యేవాడు. అయితే తన భార్యా, పిల్లలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చూసుకొనేందుకు ఆండ్రీవా తండ్రి అలెగ్జాండర్ కుటుంబానికి దూరంగా మాస్కోలోనే ఉండిపోయారు.
సంచలనాలకు కేరాఫ్...
శిక్షణలో అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్న ఆండ్రీవా... 2022లో ప్రొఫెషనల్ టెన్ని్‌సలోకి అడుగు పెట్టింది. ఆ మరుసటి ఏడాదే ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా అవతరించింది. ఆస్ర్టేలియన్ ఓపెన్ బాలికల సింగిల్స్ రన్నర్‌పగా నిలిచింది. పదిహేడేళ్లకే డబ్ల్యూటీఏ 1000 చాంపియన్ అయింది. చిన్న వయసులోనే ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్ 10లోకి ప్రవేశించింది. అంతేకాదు... ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్‌లో అరంగేట్రం చేసింది. ఆ టోర్నీలో మూడో రౌండ్ వరకు వెళ్లిన ఆమె... ఆ తరువాత వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. 2024 ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ వరకు వచ్చి తన సత్తా ఏమిటో చూపించింది. గత ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. అయితే మరింత పట్టుదలతో ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభించిన ఆండ్రీవా... టాప్ సీడ్‌లను మట్టికరిపించి, విజేతగా నిలిచింది. ఫైనల్లో ఒక్కో రౌండ్‌లో షాకిస్తూ అంతిమ సమరానికి దూసుకువచ్చిన పోలెండ్ సంచలనం చ్వాలిన్‌స్కాను వరుస సెట్లలో ఓడించింది. కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న ఆండ్రీవా... కోర్టులో ప్రశాంతంగా ఉండటంలో రోజర్ ఫెడరర్ తనకు స్ఫూర్తి అని, తరచూ అతని ఆట చూస్తుంటానని వెల్లడించింది.
మార్టినెజ్ మంత్రం...
ఇటీవల కాలంలో ఆండ్రీవా అద్భుత విజయాల్లో కోచ్, ఒకప్పటి గ్రాండ్‌స్లామ్ విన్నర్ కొంచిటా మార్టినెజ్ పాత్ర వెల కట్టలేనిది. రెండేళ్ల కిందట ఫ్రాన్స్‌లోని రుయెన్‌లో ఓ డబ్ల్యూటీఏ టూర్ టోర్నీ కోసం సాధన చేస్తున్న సందర్భంగా మార్టినెజ్‌తో ఆమెకు పరిచయమైంది. అప్పటి ఆమె మార్గదర్శకత్వంలో ఆండ్రీవా ముందుకు వెళుతోంది. కోర్టులో పాదరసంలా కదలడమే కాదు, క్లిష్ట సమయంలో ఒత్తిడిని జయించి లక్ష్యాన్ని చేరడంలో కూడా మార్టినెజ్ తర్ఫీదునిచ్చారు. ఒక పూర్తి స్థాయి ప్రొఫెషనల్ క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. ఆమెపై తనకు అపారమైన నమ్మకం. ‘అన్ని విషయాల్లో మార్టినెజ్‌ను నేను పూర్తిగా నమ్ముతాను. నా జీవితంలో ఏం జరుగుతుందో ఆమెకు తెలుసని అనుకొంటాను’ అంటూ ఓ సందర్భంలో ఈ స్టార్ వెల్లడించింది. ‘కోర్టు బయట ఆండ్రీవా చాలా మంచి అమ్మాయి. కానీ ప్రాక్టీ్‌సలో కొన్నిసార్లు ఆమెకు ఏదైనా చెబితే వినడానికి సిద్ధంగా ఉండదు. అయితే ఒక్కసారి చెవికి ఎక్కించుకొంటే మాత్రం... దానిపైనే దృష్టి పెట్టి, కష్టపడుతుంది. ఎంతగా అంటే... పూర్తి స్థాయి పట్టు సాధించేంతవరకు వదిలిపెట్టదు’ అంటూ తన శిష్యురాలి గురించి గొప్పగా చెబుతారు మార్టినెజ్.

ఒత్తిడిని తట్టుకొని...
టెన్నిస్ రాకెట్ సరిపడని చిన్నారి చేతుల నుంచి చాంపియన్‌గా ఎదిగిన క్షణం వరకు... ఆండ్రీవా ప్రయాణంలో కఠోర శ్రమతోపాటు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. కుటుంబ త్యాగాలు ఉన్నాయి. ‘‘టెన్నిస్ కోర్టులోనే కాదు, నేను చేసే పనిపట్ల నిబద్ధతతో ఉంటాను. ఆరంభంలో నాకు చాలా కష్టం అనిపించేది. ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. అందరూ నన్ను ‘ఇంకా పసిపిల్లవే’ అనేవారు. క్రమంగా ఆటలో నైపుణ్యంతో పాటు మానసికంగానూ పరిణతి చెందాను. ఎలా కష్టపడాలో, ఏకాగ్రత ఎలా సాధించాలో తెలుసుకున్నాను. అయితే ఒక్కోసారి ఈ జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక పసిపిల్లలాగా అనిపిస్తుంది’’... ఓ ఇంటర్వ్యూలో ఆండ్రీవా మాటలివి.
‘ఈ క్షణాన్ని ఆస్వాదిస్తాను...’
గ్రాండ్‌స్లామ్ గెలిచాక అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అభిమానులు, మీడియా ప్రతి టోర్నీలో ఆ స్థాయి ప్రదర్శన ఆశిస్తుంటారు. అయితే ఆ అంచనాలను అందుకోవడం అంత సులువు కాదంటోంది ఆండ్రీవా. ‘నేను నెంబర్ వన్ అవుతానని, ఆ స్థాయికి చేరాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే వాస్తవానికి టెన్ని్‌సలో భవిష్యత్తు అనిశ్చితిగా ఉంటుంది. అందుకే ఈ అంచనాలపై దృష్టి పెట్టడం కంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతాను’ అంటుంది ఆమె.
ప్రతి సాధనా విలువైనదే...
‘కొత్తగా టెన్ని్‌సలోకి వచ్చే బాలికలకు నేను చెప్పేది ఒక్కటే... ఇది చేయగలను అని మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతిరోజూ దాని కోసం కష్టపడి పని చేయండి. ఎందుకంటే ప్రతి రోజూ, ప్రతి సాధనా విలువైనదే. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు ఎదురైనా సరే... ప్రయత్నం ఆపకండి. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆలస్యంగానైనా అనుకున్న ఫలితాలు వస్తాయి’... అంటూ ఆండ్రీవా ఔత్సాహిక క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతోంది.
నన్ను నేను నమ్మినందుకు...
‘క్లిష్ట సమయాల్లో కూడా నూటికి నూరు శాతం నావంతు కృషి చేసినందుకు... ఒక వ్యక్తిగా, ఒక క్రీడాకారిణిగా మెరుగవ్వడానికి ప్రతిరోజూ ప్రయత్నించినందుకు... నేను ఇది చేయగలనని నమ్మినందుకు... నాలోని ఎన్నో అంతర్గత సంఘర్షణలతో పోరాడినందుకు... నాకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలని అనుకొంటున్నాను. ఎందుకంటే ఈ ప్రయాణంలో నేను ఎంత కష్టపడ్డానో, ఎంత ఆందోళన చెందానో నాకు మాత్రమే తెలుసు.’
కఠినమైన వ్యక్తిని...
‘కొన్నిసార్లు నేను చాలా కఠినంగా ఉంటాను. ఒక్కోసారి నాతో సర్దుకుపోవడం కష్టం. వాటన్నిటినీ అధిగమించి నాకు అండగా ఉంది నా బృందం. నా పరిమితులు పరీక్షించేలా నన్ను ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు. ఎప్పుడూ నాపై నమ్మకంతో నాకు మద్దతునిస్తూ, అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.’
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News