Share News

తుపాకి నీడన.. ఆశల చిగురు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:44 AM

దశాబ్దాలుగా మణిపూర్‌లో అలముకున్న హింస కేవలం ప్రాణాలను బలితీసుకోవడమే కాదు, వేల కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. ఆ చీకటి నుంచి కుటుంబాన్ని వెలుగులోకి....

తుపాకి నీడన.. ఆశల చిగురు

దశాబ్దాలుగా మణిపూర్‌లో అలముకున్న హింస కేవలం ప్రాణాలను బలితీసుకోవడమే కాదు, వేల కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. ఆ చీకటి నుంచి కుటుంబాన్ని వెలుగులోకి నడిపించే బాధ్యతను అక్కడి మహిళలు తమ భుజాన వేసుకున్నారు. ఆ అజేయ మహిళా శక్తికి అండగా నిలుస్తోంది మణిపూర్‌ విమెన్‌ గన్‌ సర్వైవర్స్‌ నెట్‌వర్క్‌ (ఎండబ్ల్యూజీఎ్‌సఎన్‌).

మణిపూర్‌ సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాలను చూస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. అక్కడ హింస అనేది ఒకానొక క్షణంలో జరిగిపోయే భౌతిక దాడి మాత్రమే కాదు, అది ఆగిపోయిన తర్వాత కూడా ఆర్థిక ఇబ్బందుల రూపంలో, అనాథలైన పిల్లల భవిష్యత్తు రూపంలో, తీరని మానసిక వేదన రూపంలో ఏళ్ల తరబడి నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తల్లులుగా, భార్యలుగా, కూతుళ్లుగా మహిళలే ఇంటికి ఏకైక పెద్ద దిక్కుగా మారుతున్నారు. తమ వారిని కోల్పోయిన దుఃఖాన్ని గుండెల్లోనే అదిమిపెట్టి, జీవన పోరాటాన్ని మొదలుపెడుతున్నారు.

విషాదం నుంచి...

‘మణిపూర్‌ విమెన్‌ గన్‌ సర్వైవర్స్‌ నెట్‌వర్క్‌’ (ఎండబ్ల్యూజీఎ్‌సఎన్‌.) ఈ నెట్‌వర్క్‌ ప్రస్థానం వెనుక ఒక విషాదకరమైన నేపథ్యం ఉంది. 2004 డిసెంబర్‌ 24న తౌబాల్‌ జిల్లాలో బుద్ధి మొయిరాంగ్‌థెం అనే 27 ఏళ్ల వ్యక్తిని కాల్చి చంపిన ఘటన.. సామాజిక కార్యకర్త బినలక్ష్మి నేప్రామ్‌ను తీవ్రంగా కలచివేసింది. తర్వాత ఆ ఇంటి పరిస్థితిని చూసినప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది... హింస వల్ల భర్తలను, కుమారులను కోల్పోయిన మహిళలకు తక్షణ సాయం అందుతుందేమో కానీ, వారి జీవితాంతం తోడుగా నిలిచే దీర్ఘకాలిక భరోసా వ్యవస్థ లేదని! ఆ ఆలోచన నుంచే ఎండబ్ల్యూజీఎ్‌సఎన్‌. ఉద్భవించింది. మొదట్లో రెబికా అఖం అనే మహిళకు ఒక కుట్టుమిషన్‌ ఇచ్చి ఉపాధి కల్పించడం ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం.. నేడు మణిపూర్‌ వ్యాప్తంగా వేలమంది మహిళల పాలిట కల్పవృక్షంగా మారింది.


ఉపాధి మార్గమే ఊపిరిగా...

కేవలం సానుభూతి చూపిస్తే ఆకలి తీరదు. ఓదార్పు ఇస్తే బతుకుబండి నడవదు అని ఎండబ్ల్యూజీఎస్‌ఎన్‌ నమ్మింది. మహిళలకు వారి కాళ్ల మీద వారు నిలబడేలా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా మహిళలు ఇక్కడ శిక్షణ పొందారు. స్థానికంగా డిమాండ్‌ ఉన్న రంగాలను ఎంచుకుని వారికి టైలరింగ్‌, చేనేత, చిన్న తరహా గృహ పరిశ్రమలపై నైపుణ్యాన్ని అందిస్తున్నారు. చిన్నపాటి రుణాలు ఇస్తూ వారు ఆర్థికంగా స్థిరపడేలా చేస్తున్నారు. ‘‘మొదట్లో చిన్న ఆదాయంతో, ఎంతో భయంగా మొదలైన మా ప్రయాణం ఇప్పుడు మమ్మల్ని మేము పోషించుకుంటూ మా పిల్లలను చదివించుకునే స్థాయికి చేరింద’’ని అక్కడి మహిళలు గర్వంగా చెబుతారు.

2-Navya.jpg

గాయపడిన గుండెకు సాంత్వన

ఆర్థిక అండ ఎంత ముఖ్యమో, గాయపడిన మనసులకు చికిత్స చేయడం కూడా అంతే ముఖ్యం. మణిపూర్‌ వంటి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం చాలా అరుదు. ప్రియమైన వారిని కోల్పోయిన బాధను వెళ్లగక్కే అవకాశం లేక చాలామంది మహిళలు కుమిలిపోతుంటారు. దీనిని గుర్తించిన ఎండబ్ల్యూజీఎ్‌సఎన్‌ బాధితుల కోసం ప్రత్యేకంగా గ్రూప్‌ సెషన్లను నిర్వహిస్తోంది. తమలాగే బాధపడుతున్న ఇతర మహిళలతో కలిసి కూర్చుని తమ మనసులోని బాధను పంచుకునే వేదికను కల్పిస్తోంది. ఈ సంస్థలో కనిపిస్తున్న అత్యంత స్ఫూర్తిదాయకమైన మార్పు ఏమిటంటే.. పాత్రల మార్పు. ఒకప్పుడు సాయం కోసం, ఆశ్రయం కోసం నెట్‌వర్క్‌లోకి వచ్చిన మహిళలే ఇప్పుడు శిక్షకులుగా, కమ్యూనిటీ లీడర్లుగా, ఇతర బాధిత మహిళలకు కౌన్సెలర్లుగా మారుతున్నారు. తమ చేదు అనుభవాలను ఆయుధాలుగా మార్చుకుని కొత్తగా బాధితులైన వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

సామాజిక చట్రం

మణిపూర్‌ సమాజం అంటేనే మహిళల క్రియాశీలక పాత్రకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతిపెద్ద మహిళా మార్కెట్‌ ‘ఇమా కీథెల్‌’ నుంచి చారిత్రాత్మక ‘నుపిలాన్‌’ ఉద్యమం, శాంతి కోసం పోరాడే ‘మీరా పైబీ’ వరకు.. మహిళలు అక్కడ ఎప్పుడూ సామాజిక పోరాటాల్లో ముందున్నారు. అయితే ఈ బలం రాజకీయాల్లో లేదా అధికార నిర్ణయాల్లో కనిపించదు. వ్యవస్థాగతమైన నిర్ణయాధికారం ఇప్పటికీ పురుషుల చేతుల్లోనే ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆర్థిక వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను నిలబెడుతున్నది మాత్రం మహిళలే. ముఖ్యంగా ఘర్షణలు తలెత్తినప్పుడు ఎక్కువ నష్టపోయేది మహిళలు, పిల్లలే. ఒకవైపు ప్రాణనష్టం అయితే, మరోవైపు నిరాశ్రయులు కావడం, ఉపాధి కోల్పోవడం వారిపై మోయలేని భారంగా మారుతున్నాయి.


కొత్త జీవితాన్ని నిర్మించుకునేలా...

ఎండబ్ల్యూజీఎ్‌సఎన్‌ వంటి సంస్థలు కేవలం విపత్తు సమయంలో సాయం చేసే కేంద్రాలు మాత్రమే కావు. అవి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్న మహిళల జీవితాలకు ఆశాదీపాలు. ఇవి జరిగిన నష్టాన్ని చెరిపివేయలేవు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేవు. కానీ, ఆ చేదు జ్ఞాపకాల మధ్యే కొత్త జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో నేర్పిస్తున్నాయి. ఆత్మగౌరవంతో బతకడం ఎలాగో చూపిస్తున్నాయి. మణిపూర్‌లోని అనేక కుటుంబాలకు ఈ నెట్‌వర్క్‌ ఒక ఆసరా మాత్రమే కాదు, అల్లకల్లోల పరిస్థితుల్లో వారిని నిలబెడుతున్న ఒక బలమైన లంగరు. అక్కడ పోరాటం ఇంకా ముగియలేదు. పునర్నిర్మాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ప్రయాణంలో ఈ మహిళా శక్తి అప్రతిహతంగా సాగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 12:45 AM