మట్టి బంధంతో విజయపథం
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:59 AM
బాల్యంలో మట్టితో ఏర్పడిన బంధాన్ని అభిరుచిగా, జీవితాశయంగా మార్చుకున్నారు బిదుల బైజునాథ్.వివిధ ప్రయోగాలు చేస్తూ ఎన్నో కళాకృతులు సృష్టించి ప్రముఖుల...
బాల్యంలో మట్టితో ఏర్పడిన బంధాన్ని అభిరుచిగా, జీవితాశయంగా మార్చుకున్నారు బిదుల బైజునాథ్.వివిధ ప్రయోగాలు చేస్తూ ఎన్నో కళాకృతులు సృష్టించి ప్రముఖుల మెప్పు పొందారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వ క్యాలెండర్లో స్థానం పొందిన ఈ కేరళ మహిళ... ఇటీవలే పాతికేళ్ళ కళా ప్రయాణాన్ని పూర్తి చేసుకొని... మరింత దీక్షతో ముందుకు సాగుతున్నారు.
‘‘కేరళలోని కోజికోడ్ జిల్లా ఎలత్తూర్ గ్రామం మాది. పంట పొలాలతో, పచ్చదనంతో కళకళలాడే మా ఊరి సమీపంలోనే కొరపుళా నది ప్రవహిస్తుంది. దాన్ని మా ఊరి పేరుతో ‘ఎలత్తూర్ నది’ అని కూడా పిలుస్తారు. ఆ తీరాల్లో దొరికే మట్టి... పాత్రలు, బొమ్మల తయారీకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే మా గ్రామం మట్టితో చేసే వస్తువులకు, కళారూపాలకు ప్రసిద్ధి చెందింది. వాటి రూపశిల్పుల సృజనను చూస్తూ పెరిగిన నాకు ఆ కళమీద ఆసక్తి కలిగింది. కున్హి కృష్ణన్ అనే కళాకారుడు నన్ను ప్రోత్సహించి, ఎన్నో మెళకువలు నేర్పారు. బొమ్మల తయారీలో పాటించవలసిన సూత్రాలను బోధించారు. సొంతంగా బొమ్మలు తయారు చేసినప్పుడు... మొదట్లో బాగా వచ్చేవి కాదు. అయినా నిరాశ చెందకుండా అభ్యాసం చేశాను. మా ఇంటి ముందున్న పొలంలోని మట్టితో... మా ఇంట్లో పనిచేసే కళ్యాణి అమ్మ బొమ్మను విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాను. దాంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక వైపు చదువును, మరోవైపు నా కళాభిరుచిని కొనసాగించాను.
తోటి విద్యార్థులే తొలి కస్టమర్లు
నేను తయారు చేసిన చిన్న కుండలు, పాత్రలు, దేవుడి ప్రతిమలను కొనడానికి నా తోటి విద్యార్థులు ఆసక్తి చూపేవారు. ఆ తరువాత బంధువులు, స్నేహితులకు కూడా వాటిని అమ్మేదాన్ని. ఖర్చులకు కుటుంబం మీద ఆధారపడే అవసరం లేకపోవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఫార్మసిస్ట్ కావాలనేది నా తల్లిదండ్రుల కోరిక. కానీ కళాకారిణిగానే స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. బీకామ్‌లో చేరాను. అదే సమయంలో... అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడ గాంధీ విగ్రహాన్ని తయారు చేశాను. అప్పటి ముంబై ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషనర్ సి.వి.పి.కురుప్ దాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారు. ఆయన సూచన, ప్రోత్సాహంతో... బీకామ్ పూర్తయ్యాక... కర్ణాటకలోని సెంట్రల్ విలేజ్ పాటరీ ఇనిస్టిట్యూట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశాను.ఆ తరువాత మా ఇంటికి దగ్గర్లోనే ఒక క్లే స్టూడియో ఏర్పాటు చేసుకున్నాను. మట్టితో పాత్రలు, అలంకరణ వస్తువులు, బొమ్మలు రూపొందించి... దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం ప్రారంభించాను. అలా కొన్ని వందల ప్రదర్శనల్లో భాగమయ్యాను. కానీ 2023లో... ద్వారకలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో ‘పీఎం విశ్వకర్మ పథకం’ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ నాకు గుర్తింపు తెచ్చింది.

కలకాలం నిలిచే జ్ఞాపకం
ఆ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... ఒక్కొక్క స్టాల్నూ చూస్తూ... నా స్టాల్ దగ్గరకు వచ్చారు. ప్రదర్శనలో ఉంచిన వాటిని పరిశీలించారు. కాసేపు అక్కడ కూర్చున్నారు. నన్నూ కూర్చోమన్నారు. ఉత్పత్తుల తయారీ గురించి, కేరళ మట్టి ప్రత్యేకత గురించి అడిగారు. ఇతర ప్రాంతాల మట్టి కన్నా అది ఎందుకు భిన్నమైనదో నన్ను, నా బృందంలోని ఇతర కళాకారులను అడిగి తెలుసుకున్నారు. నేను మట్టితో చేసిన సబ్బు పెట్టెను, మట్టి-చెక్క కలిపి చేసిన గడియారాలను చూసి మెచ్చుకున్నారు. గోడలకు అమర్చుకొనే మట్టి దీపాలను తయారు చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రధానిని కలుసుకోవడం, ఆయన నా పక్కన కూర్చొని మాట్లాడడం... ఇది కలలో కూడా ఊహించలేదు. అంతేకాదు... కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వ క్యాలెండర్లో... మా బృందంతో ప్రధాని మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించారు. ఆ క్యాలెండర్ ద్వారా నేను, నా కళ దేశమంతటికీ తెలిసింది. దేశ విదేశాల్లో 400కు పైగా ఎగ్జిబిషన్లు నిర్వహించాను. అలాగే... కేరళ, జమ్ము-కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ఎన్నో సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నాను. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించి, మా కళాకృతులను ప్రశంసించారు. ప్రధానితో ఫొటో... కలకాలం నిలిచిపోయే అనుభవం, జ్ఞాపకం, గౌరవం.
కళలు ప్రతిఫలించేలా...
ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు పర్యటించడం, అక్కడ రకరకాల మట్టిని పరిశీలించి, వాటితో ప్రయోగాలు చేయడం, వస్తువులు తయారుచేయడం నాకు ఇష్టం. సాధారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకి చెందిన మట్టిని నేను ఉపయోగిస్తాను. మట్టిని కలపడం, బొమ్మని మలచడం, ఎండబెట్టడం, తుదిమెరుగులు దిద్దడంతో ఈ ప్రక్రియ ముడిపడి ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో నా సృజనాత్మకతకు మెరుగులు దిద్దుతాను. కొత్త డిజైన్లు తయారు చేస్తాను. డెకరేటివ్ ఐటమ్స్, చిన్న పాత్రలు, గాజు కుందెలు, టీ పాట్స్, లైట్ స్టాండ్స్, పెర్ఫ్యూమ్ డిఫ్యూజర్లు... ఇలా ఎన్నిటినో తయారు చేస్తున్నా. అంతేకాదు... తెయ్యం, కథాకళి లాంటి నృత్యాల భంగిమల్లో టెర్రాకోట్ బొమ్మలను తీర్చిదిద్దుతున్నాను. అలా తయారైన కొన్ని వందల రకాల బొమ్మలు దేశ, విదేశాల్లో విక్రయమవుతున్నాయి. మాకు కార్పొరేట్ క్లయింట్స్ కూడా ఉన్నారు. నా స్టూడియో ద్వారా పలువురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. మరోవైపు పిల్లలకు, పెద్దలకు తరగతులు, వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాను. విదేశీయులతో సహా రెండువేల మందికి పైగా టెర్రకోట కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాను. దీనంతటి వెనుక నా భర్త బైజునాథ్, మా ఇద్దరు పిల్లల సహకారం ఎంతో ఉంది. కళాకారిణిగా పాతికేళ్ళ మైలురాయిని ఇటీవలే చేరుకున్నాను. దేశంలోని వివిధ సంస్కృతులను, కళలను నా బొమ్మలలో ప్రతిఫలించాలనేది నా ఆశయం. ఆ దిశగా నా ప్రయాణాన్ని మరింత దీక్షతో కొనసాగిస్తాను.’’
కేంద్ర ప్రభుత్వ క్యాలెండర్లో...
మా బృందంతో ప్రధాని మాట్లాడుతున్న ఫొటోను ప్రచురించారు. ఆ క్యాలెండర్ ద్వారా నేను, నా కళ దేశమంతటికీ తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో మళ్లీ మున్సిపల్ ఎన్నికలు.. రెండ్రోజుల్లో నోటిఫికేషన్
3.5 కిలోల బంగారం, 380 క్యారెట్ల వజ్రాలతో ఖరీదైన ముగ్గు.. వీడియో వైరల్
For More AP News And Telugu News