వంటల్లో ఘనా‘పాటీ’
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:37 AM
వయసు 90. కానీ వేరొకరి సాయం అవసరం లేదు. ఊతకర్ర అక్కర్లేదు. చలాకీగా తిరిగేస్తారు. ఇంటర్‌నెట్‌లో సంప్రదాయ వంటలు వండేస్తూ..
వయసు 90. కానీ వేరొకరి సాయం అవసరం లేదు. ఊతకర్ర అక్కర్లేదు. చలాకీగా తిరిగేస్తారు. ఇంటర్‌నెట్‌లో సంప్రదాయ వంటలు వండేస్తూ... విభిన్న రుచులను పరిచయం చేస్తూ... వేలమంది అభిమానులను సంపాదించుకున్నారు. రెసిపీలే కాకుండా... ఆరోగ్య సూత్రాలు కూడా వివరిస్తూ ఆన్‌లైన్‌లో వడ్డిస్తున్న కేరళ బామ్మ... సరస్వతి పాటీ అభిరుచి ఇది...
‘‘జీవితమంటేనే సమస్యలు, సవాళ్లు, బంధాలు, బాధలు. సమస్యలను పరిష్కరించుకొంటూ, సవాళ్లను అధిగమిస్తూ, బాధలను మరిచి కాలంతో పాటు సాగిపోవాలి. ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం. కేరళలోని పాలక్కడ్‌లో సంప్రదాయ ఉమ్మడి కుటుంబం మాది. తరువాత బెంగళూరులో స్థిరపడ్డాను. చాలా చిన్న వయసులో మా అమ్మమ్మ, అమ్మలను కోల్పోయాను. ఆ బాధ నుంచి తేరుకోకముందే నా మీద బాధ్యత పడింది. పన్నెండేళ్లకే వంట గదిలో గరిట తిప్పాల్సివచ్చింది. దాన్ని నేను బరువుగా భావించలేదు. ఎంతో శ్రద్ధగా, ఇష్టంగా మొదలుపెట్టాను. ఇక మా అత్తయ్య బాగా వంట చేసేవారు. ఆమె చేత్తో వండితే రోజూ తినే కూరైనా సరే ఎంతో రుచిగా ఉంటుంది. వంటింట్లో అత్తయ్యకు సాయపడుతూ వంట నేర్చుకున్నాను.
చుట్టూ ఉన్నవారే స్పూర్తి...
ఉమ్మడి కుటుంబం కావడంతో మా ఇంట్లో ఎప్పుడూ రకరకాల రుచులు వడ్డిస్తుండేవారు. మా చుట్టుపక్కల ఇళ్లవాళ్లు పర్వదినాల్లో ప్రత్యేక వంటలు చేసేవారు. అలా వండినప్పుడల్లా మాకు కూడా ఇచ్చేవారు. వాటిల్లో ఏమేం పదార్థాలు ఉపయోగించారో అడిగి తెలుసుకొనేదాన్ని. నేను కూడా ఇంట్లో చేసేదాన్ని. అంతటితో ఆగిపోలేదు. తరచూ కొత్త వంటకాలు ప్రయత్నించేదాన్ని. అయితే అన్నీ సంప్రదాయ రుచులే వండేదాన్ని.
ఇక నా మనవరాలు మీనాక్షి నా దగ్గరే పెరిగింది. తను రోజూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవీ చూస్తుండేది. అదేమిటో నాకు అర్థమయ్యేది కాదు. కొంత కాలం మనవరాలిని గమనించాక... ఒక రోజు అడిగా... ‘ఇందులో ఎవరైనా వీడియోలు, ఫొటోలు పెట్టవచ్చా’ అని! ‘ఎవరైనా పోస్ట్ చేయవచ్చు’ అంటూ తను బదులిచ్చింది. ఆ సమాధానం నా ఆలోచనల్ని మార్చేసింది. సామాజిక మాధ్యమాలు ఎలా పని చేస్తాయో అడిగి తెలుసుకున్నాను. కొంత కాలం దాని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాక... ఇక అందులో నుంచి బయటకు రాలేకపోయాను. అయితే సాంకేతికత, నా మనవరాలు ఒక్కటే. ఎందుకంటే... తను కూడా అప్పుడప్పుడూ నన్ను గందరగోళానికి గురి చేస్తుంటుంది.
నా ఆసక్తిని గమనించి...
నా మనవరాలు నా ఆసక్తిని గమనించింది. నేను వంటలు బాగా ఇష్టంగా చేస్తాను కాబట్టి, అదే కంటెంట్‌తో ఒక ఇన్‌స్టాలో చానల్ ప్రారంభిద్దామని తను చెప్పింది. సరేనన్నాను. ఇద్దరం కలిసి రెండేళ్ల కిందట ‘ది అయ్యర్ పాటీ’ చానల్‌ను తీసుకువచ్చాం. ‘పాటీ’ అంటే తమిళంలో బామ్మ అని. అయితే మా కంటెంట్‌ను ప్రపంచం చూడాలన్న ఉద్దేశంతో చానల్ మొదలుపెట్టలేదు. 90 ఏళ్ల వయసులో నాకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉండాలని మీనాక్షి భావించింది. కానీ అనుకోకుండా అదే ఇప్పుడు వేలమందికి చేరువైంది. ప్రస్తుతం లక్షన్నర మంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. నేను పోస్ట్ చేసే ప్రతి రీల్‌కూ వేలల్లో లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయంటే... ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ముఖ్యంగా నేటితరం యువత ‘పాటి’ అంటూ చూపించే ప్రేమాభిమానాలు ఈ వయసులో కూడా నన్ను ఉత్సాహంగా ఉంచుతున్నాయి.
ఆరోగ్యానికి ప్రాధాన్యం...
నా వీడియోల్లో అధిక శాతం పచ్చళ్లు, పొడులు, సాంబారు, రసం, పిండివంటలు ఉంటాయి. కానీ అన్నీ ఆరోగ్యకరమైనవే. అలాగని కావాలని చొప్పించిన పదార్థాలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి నా జీవన శైలిలో భాగమైన సంప్రదాయ వంటకాలే ఇవన్నీ. అత్తయ్యను చూసి అలవాటు చేసుకున్నా. తను అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఆహార పదార్థాలు మార్చేసి, చిటికెలో కొత్త వంటకం సిద్ధం చేసేవారు. నా వంటల్లో బాగా ఆదరణ పొందినవాటిల్లో ఒకటి... కొల్లు రసం. ఉలవలతో చేసే రసం. దగ్గు, జలుబుకు ఔషధంలా పని చేస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇన్‌స్టాలో నా పేజీ నా కుటుంబానికి... అంటే ఫాలోవర్స్‌కు ఒక డైరీ లాంటిది. ఎప్పుడు ఎలాంటి సందేహాలు వచ్చినా నా పేజీ ద్వారా నివృత్తి చేసుకొనే వీలుంది. అంత వివరంగా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాను.’’
‘అదిగో పాటీ’...
బయటకు వెళ్లినప్పుడు నన్ను గుర్తుపడుతున్నారు. ‘అదిగో అయ్యర్ పాటీ’ అంటూ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పలుకరిస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది... సామాజిక మాధ్యమం నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందని. ఈ జన్మకు ఇది చాలని.’’
ఈ వార్తలు కూడా చదవండి..
క్వాంటం ఎకో సిస్టంతో.. ఏపీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు: సీఎం చంద్రబాబు
లోకేశ్ విందులో రాజకీయ ఏకత్వం.. కుటుంబ విలువల ప్రతిబింబం..
Read Latest Telangana News And AP News And Telugu News