Share News

మహిళలకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:16 AM

‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్‌ అగర్వాల్‌... ఆ తరువాత ‘మగధీర, బృందావనం’ లాంటి మెగా హిట్స్‌తో అభిమాన తార అయింది. పెళ్లి తరువాత బిడ్డకు జన్మనిచ్చిన ఆమె...

మహిళలకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు

సెలబ్‌ టాక్‌

‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాజల్‌ అగర్వాల్‌... ఆ తరువాత ‘మగధీర, బృందావనం’ లాంటి మెగా హిట్స్‌తో అభిమాన తార అయింది. పెళ్లి తరువాత బిడ్డకు జన్మనిచ్చిన ఆమె... ఇప్పుడు కథకు ప్రాధాన్యమున్న, అర్థవంతమైన పాత్రలతో అలరిస్తోంది. తాజగా విడుదలైన ‘ది ఇండియా స్టోరీ’లో చక్కని అభినయంతో ఆకట్టుకున్న ఈ ‘చందమామ’... ఓ ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించింది.

రెండు దశాబ్దాలకు పైబడిన కెరీర్‌లో మరపురాని పాత్రలు ఎన్నో పోషించింది కాజల్‌ అగర్వాల్‌. దక్షిణాదిలో అగ్ర హీరోలు అందరితోనూ నటించిన ఆమె... అత్యధిక పారితోషికం తీసుకొంటున్న తారల్లో ఒకరిగా వెలుగొందింది. ముంబయిలో ‘కిషిచంద్‌ చెల్లారామ్‌ కాలేజీ’లో మాస్‌ మీడియా, మార్కెటింగ్‌ అండ్‌ అడ్వైర్‌టైజింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన ఆమె చిన్న వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించింది. 2004లో హిందీ చిత్రం ‘క్యూన్‌ హోగయా నా’ తొలి చిత్రం. ఐశ్వర్యారాయ్‌ సోదరిగా అందులో నటించిన కాజల్‌... కెరీర్‌ నిరాశగానే మొదలైంది. కానీ తెలుగులో ‘చందమామ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె... ‘మగధీర’తో భారీ హిట్‌ సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి కెరీర్‌ దూసుకుపోయింది. 2020లో గౌతమ్‌ కిచ్లూను పెళ్లాడిన కాజల్‌... మగబిడ్డ నీల్‌కు జన్మనిచ్చింది. తర్వాత వేగం తగ్గించి, కథాబలం ఉన్న పాత్రలను ఎంచుకొంటూ ముందుకు సాగుతోంది. తాజాగా విడుదలైన ‘ది ఇండియా స్టోరీ’లో నటనకు గానూ ప్రశంసలు అందుకొంటున్న ఆమె... భారీ బడ్జెట్‌ చిత్రం ‘రామాయణ’లో మండోదరిగా నటిస్తోంది.


‘‘సినీ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు పెద్ద కలలున్న ఒక టీనేజర్‌ని. నాకు సినిమా నేపథ్యం లేదు. ఈ వృత్తి గురించి నాకు తెలిసిందంతా పని చేస్తూ నేర్చుకున్నదే. రెండు దశాబ్దాలుగా వివిధ భాషల్లో, విభిన్న శైలుల్లో, కొంతమంది అద్భుతమైన నిర్మాతలతో కలిసి ప్రయాణించాను. విజయవంతమైనదైనా, సవాళ్లతో కూడుకున్నదైనా... ప్రతి చిత్రం నన్ను తీర్చిదిద్దింది. ప్రస్తుతం... చేపట్టే ప్రాజెక్టులను సంఖ్యతో కాకుండా, నటిగా నేను పరిణతి చెందుతున్నానా? జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోయే కథలను ఎంచుకొంటున్నానా? అనేవాటితో కొలుస్తాను. ‘ది ఇండియా స్టోరీ’ నా కెరీర్‌లో ఒక దశకు ప్రతీక. ఈ దశలో పనితీరు, అలాగే లక్ష్యమూ రెండూ ముఖ్యం. ఇది కల్తీ ఆహారంపై ప్రశ్నించే సినిమా. మితిమీరిన పురుగుమందుల వాడకం, వాటివల్ల ఆరోగ్యం దెబ్బతినడం... మనందరికీ నిత్యం ఎదురయ్యే సమస్యలు. దీనిపై అవగాహన కల్పించి, కుటుంబం పట్ల బాధ్యతను పెంచుతుంది ఈ చిత్రం. ఒక నటిగా గుర్తింపు తెచ్చేవే కాకుండా, సామాజికంగా ప్రభావం చూపగలిగే కథలు దొరకడం చాలా అరుదు. ప్రస్తుతం అలాంటి పాత్రలపై ఎక్కువ దృష్టి పెట్టాను. ఒక అర్థవంతమైన కథ మన ముందుకు వచ్చినప్పుడు, అందులో భాగం కావడం విలువైనదని నేను భావిస్తాను. ఒక సినిమా చర్చలకు ప్రేరేపించినా, ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించినా, కనీసం ఒక కుటుంబ అలవాట్లను మార్చగలిగినా... అది అద్భుత ఫలితమే. అయితే ప్రతి చిత్రం సామాజిక సందేశం ఇవ్వాల్సిన అవసరంలేదు. వినోదం కూడా సినిమాకు ముఖ్యమే’’ అంటుంది కాజల్‌.

ప్రాధాన్యతలు మారాయి...

బిడ్డకు తల్లి అయ్యాక తన ప్రాధాన్యతలు మారాయంటుంది ఈ భామ. ‘‘నా అభిరుచి కాదు కానీ, నా దృక్పథం కచ్చితంగా మారింది. నేను ఎంచుకొనే ప్రాజెక్టులు, వాటి షెడ్యూల్‌ విషయంలో ఇప్పుడు చాలా శ్రద్ధ తీసుకొంటున్నాను. ‘నాన్నలాగానే అమ్మ కూడా పనికి వెళుతుంద’ని మా అబ్బాయి అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. పిల్లలకు మన వృత్తి గురించి తెలియకపోవచ్చు, కానీ మనం పంచే ప్రేమను, సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకొంటారు. అందుకే నేను తనతో ఉన్నప్పుడు మరో ఆలోచన రానివ్వను.’’


ప్రతి సెట్‌కూ ఒక ప్రత్యేకత...

ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా ఎన్నో చిత్ర పరిశ్రమల్లో పని చేసిన కాజల్‌... ‘‘అది నాకు దక్కిన అదృష్టం. నిజం చెప్పాలంటే ప్రతి సినిమా సెట్టు... దానికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటుంది. దక్షిణాది పరిశ్రమలు క్రమశిక్షణ, సామర్థ్యం, ప్రణాళికలకు ప్రసిద్ధి. హిందీ సినిమా... కథనంలో, సృజనాత్మక సహకారంలో అద్భుతమైన వైవిధ్యాన్ని ఒకచోట చేర్చుతుంది. అయితే నేడు పరిశ్రమల మధ్య ఆ సరిహద్దులు చెరిగిపోతున్నాయని నాకు అనిపిస్తోంది. కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు భారతీయ సినిమాను ఒకే వ్యవస్థగా భావిస్తున్నారు. ఇది ఒక సానుకూల మార్పని నేను అనుకొంటున్నాను’’ అంటుంది.

వాటినీ స్వీకరిస్తున్నారు...

వయసు పైబడినా హీరోలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదే కథానాయికల విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఇది పరిశ్రమలో ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ. దీనిపై స్పందిస్తూ... ‘‘ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కథానాయికలు కూడా వయసుతో సంబంధం లేకుండా లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. వాటిని ప్రేక్షకులు ఆమోదిస్తున్నారు. ఇక నా విషయానికొస్తే ప్రస్తుతం నేను ఒక దశకు చేరుకున్నాను. వయసుకు తగిన కథలకంటే ఆసక్తిని రేకెత్తించే పాత్రల వెంట పడుతున్నాను. ఆ పాత్ర నన్ను ఉత్తేజపరిచి, సవాలు విసిరి, కథకు దోహదపడేదైతే, నాకు అదే ముఖ్యం. ఎప్పుడూ మూసపద్ధతిలో పోకుండా నిరంతరం వైవిధ్యాన్ని వెతుక్కొంటూ వెళితే ఈ ప్రయాణం సుదీర్ఘ కాలం సాగుతుందని నమ్ముతాను. మహిళలకు, మంచి కథలకు గడువు తేదీ అంటూ ఉండదు. నా కెరీర్‌లోని ప్రతి దశలోనూ నాలో ఏదోఒక మార్పు తెచ్చిన చిత్రం ఒకటి ఉంది’’ అంటూ ముగించింది ఈ ముద్దుగుమ్మ.

మహిళలకు, మంచి కథలకు కాలపరిమితి అంటూ ఉండదు. పెళ్లై పిల్లలు పుట్టినంత మాత్రాన నటీనటుల ఆసక్తులు మారవు కానీ, కథలను ఎంచుకునే కోణం కచ్చితంగా మారుతుంది. ఇప్పుడు నేను కేవలం సినిమాల సంఖ్య కోసం కాకుండా నాలోని నటిని నిరంతరం సవాలు చేసే, సమాజంపై ప్రభావం చూపించే అర్ధవంతమైన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 05:16 AM