సంప్రదాయ నృత్యం ధ్వంసమవుతోందా..!
ABN , Publish Date - May 30 , 2026 | 01:30 AM
సంప్రదాయ నృత్యాలే కథా వస్తువులుగా ఎన్నో సినిమాలు రూపొందాయి, ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే తాజాగా విడుదలైన ‘చాంద్ మేరా దిల్’ అనే హిందీ సినిమాలో నటి...
ట్రెండింగ్
సంప్రదాయ నృత్యాలే కథా వస్తువులుగా ఎన్నో సినిమాలు రూపొందాయి, ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే తాజాగా విడుదలైన ‘చాంద్ మేరా దిల్’ అనే హిందీ సినిమాలో నటి అనన్య పాండే ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం... పలువురు నృత్య కళాకారులు, ప్రముఖుల విమర్శలను ఎదుర్కొంటోంది. ‘ఫ్యూజన్ డాన్స్’ పేరుతో ట్రెండ్ అవుతున్న తాజా పోకడ గురించి ప్రముఖ నృత్య కళాకారులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలివి...
నృత్య విలువలను, సూత్రాలను పాటించకుండా, తోచిన భంగిమలను చొప్పించి ప్రదర్శించిన నాట్యం, నాట్యం అనిపించుకోదు. తాజాగా విడుదలైన ‘చాంద్ మేరా దిల్’ సినిమాలో హిందీ నటి అనన్య పాండే ప్రదర్శించిన నాట్యమే ఇందుకు ప్రధాన ఉదాహరణ. ఆ సినిమాలో ఆమె ప్రదర్శించిన నృత్యం పలువురు క్లాసికల్ డాన్సర్ల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సినిమా పరిశ్రమ సంప్రదాయ నృత్యాల పట్ల సున్నితత్వాన్ని కోల్పోయి, నిర్దయగా ప్రవర్తిస్తోందంటూ అనేక వాదనలు, విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ భరతనాట్యం డాన్సర్, పద్మ విభూషణ్, సొనాల్ మాన్‌సింగ్‌తో పాటు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రతిభ ప్రహ్లాద్ మొదలైన ప్రముఖులెందరో అనన్య పాండే నృత్యాన్ని విమర్శించడం విశేషం. ఈ సందర్భంగా, తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన క్లాసికల్ డాన్సర్ల అభిప్రాయాలు వాళ్ల మాటల్లోనే....

కళారంగానికి ఔచిత్యం ప్రధానం
స్వాతి సోమ్‌నాథ్, ప్రముఖ కూచిపూడి నర్తకి
సంప్రదాయ నృత్య కళలు కాలానుగుణ మార్పులకు లోనవుతున్నాయి. అలాగే సినిమాల్లోని సంప్రదాయ నృత్యాలు కూడా! ప్రముఖ దర్శకులు విశ్వనాథ్ గారు మినహా, క్లాసికల్ అని చెప్పుకునే ఇతరత్రా సినిమాల్లో ప్రదర్శించిన నృత్యాలేవీ సంప్రదాయ నృత్యాలు కావు. అయినా సినిమాలు భావప్రకటనా స్వేచ్ఛ కలిగి ఉండడం అవసరం కాబట్టి ఎబ్బెట్టుగా ఉండనంతవరకూ ఆ నృత్యాలను విమర్శించకూడదు. నిజానికి ఇప్పుడు అనేక మంది క్లాసికల్ డాన్సర్లు ప్రదర్శించే నృత్యమేదీ నూటికి నూరు శాతం సంప్రదాయ నృత్యమని అనడానికి వీల్లేదు. ఇప్పుడు నేను చేస్తున్న కూచిపూడికీ, వందేళ్ల నాటి కూచిపూడికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఒకప్పుడు నేను చేసిన తొమ్మిది రోజుల భామాకలాపం ఇప్పుడు పదిహేను నిమిషాలకు తగ్గిపోయింది. అయితే ప్రతి సంప్రదాయ నృత్యంలో కొన్ని ప్రాథమిక సూత్రాలుంటాయి. అవి దెబ్బతినకుండా చూసుకోవాలి. సృజనాత్మకత స్వాగతించిన దగినదే అయినా, దానికంటూ ఒక పద్ధతిని పాటించాలి. కూడిపూడి కలిగి ఉన్న సారం, ప్రత్యేకతలు పాడవకుండా గురువులు జాగ్రత్తగా కొరియాగ్రఫీ చేసినప్పుడు, ఆ నృత్యం కచ్చితంగా ప్రజారంజకమవుతుంది.
నేడు కూచిపూడి నృత్యానికి జానపద నృత్యాన్ని జోడించి ప్రదర్శిస్తున్నారు. సినిమాల్లో చూపించే నృత్యం స్ఫూర్తితో వేదికల మీద నాట్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులూ ఉన్నారు. వీలైనంత త్వరగా నాట్య ప్రదర్శన ఇచ్చేయాలనే పిల్లలు, తలితండ్రుల ఆతృతలే ఇందుకు కారణం. గురువులు కూడా అదే ప్రాతిపదికన నడుచుకోవడం బాధాకరం. ఆవిష్కరణ, సృజనాత్మకత పేరుతో తోచిన భంగిమలను నృత్యంలో చొప్పిస్తున్న ధోరణిని అనుసరిస్తున్నారు. నిజానికి సినిమాల కోసమంటూ ప్రత్యేకమైన డాన్సులు ఉండవు. సమాజంలో ఏ డాన్స్ ఆదరణ పొందితే, దాన్నే సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే సంప్రదాయ నాట్యం విషయంలో ప్రధాన సూత్రాల నుంచి పక్కకు తప్పుకోకుండా చూసుకోవడం అవసరం. నేను గతంలో అమెరికాలో, ఒకపరికొకపరి వయ్యారమే అనే అన్నమయ్య కీర్తనకు నృత్యం చేసినప్పుడు, ఆ ప్రదర్శనకు హాజరైన నిష్ణాతులు ఒక వ్యాఖ్య చేశారు. అప్పటివరకూ తాము చూసిన కూచిపూడి జాతరలతో విసిగెత్తిపోయామనీ, అంత అందమైన కూచిపూడి నృత్యాన్ని మొదటిసారి చూస్తున్నామనీ ప్రశంసించి, ఈ భంగిమలు కూచిపూడిలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. నిజానికి అవన్నీ ముందునుంచీ ఉన్న భంగిమలే! వాటిని అందంగా ప్రదర్శించగలగాలి. ఆ నాట్య సారం, ప్రత్యేకతలను హృద్యంగా కొనసాగించే పరిజ్ఞానం, సామర్థ్యం కలిగి ఉండాలి. శాస్త్రాన్ని ఔపాసన పట్టి, ప్రాథమిక సూత్రాలు దెబ్బతినకుండా, ఔచిత్యంతో నడుచుకున్నంత కాలం సంప్రదాయ నృత్యం నవ్వుల పాలు కాకుండా ఉంటుంది.

జవాబుదారీతనం ఉండాలి
హలీమ్ ఖాన్, కూచిపూడి డాన్సర్
సినిమాల్లో సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడం తప్పు కాదు. కానీ జవాబుదారీతనం కలిగి ఉండాలి. కొత్త పోకడతో ప్రదర్శించే సంప్రదాయ నృత్యం, నృత్య కళాకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదనే సున్నితత్వాన్ని సినీ నిర్మాతలూ, దర్శకులు కలిగి ఉండడం అవసరం. ఏ సరికొత్త ప్రయోగమైనా తప్పకుండా ఆహ్వానించదగినదే! కానీ ప్రయోగానికి పూనుకునే వ్యక్తి ఆ అంశం పట్ల పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. సబ్జెక్టు పట్ల అవగాహన ఉన్న శాస్త్రవేత్త మాత్రమే ఫ్యూజన్ ప్రయోగానికి పూనుకునే అర్హత కలిగి ఉంటాడు. కాబట్టి సంప్రదాయ నృత్యాన్ని ఫ్యూజన్ రూపంలో ప్రదర్శించాలని అనుకున్నప్పుడు, నృత్య సౌందర్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. అంతే తప్ప నచ్చిన ధోరణిలో, తెగింపుతో నడుచుకోవడం సరి కాదు. గతంలో నృత్య ప్రధాన సినిమాల్లో నాట్యం తెలిసిన కళాకారులనే ఎంచుకునేవారు. లేదా సన్నివేశం డిమాండ్ చేసినప్పుడు, నాట్య కళాకారుల ఆధ్వర్యంలో నటులకు నాట్య ముద్రలు, భంగిమలకు సంబంధించి శిక్షణ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం అంత సమయం, ఆసక్తి, జవాబుదారీతనం ఎవరికీ ఉండడం లేదు. ఇది బాధాకరం.
సంప్రదాయ నృత్యాల తీరుతెన్నులు కాలక్రమేణా మారిపోతూ ఉండడానికి ప్రధాన కారణం, నిష్ణాతులైన కళాకారుల దగ్గర శిక్షణ తీసుకోలేకపోవడమే! వీధి చివర డాన్స్ టీచర్ దగ్గరకు పిల్లలను పంపించి, వీలైనంత త్వరగా ప్రదర్శన ఇప్పించి పేరు తెచ్చుకోవాలని తపన పడే తల్లితండ్రులు ఎంతోమంది ఉన్నారు. నేర్పించే గురువుకు నాట్యం మీద పట్టు లేనప్పుడు, నేర్చుకునే శిష్యుల నాట్యం నాణ్యత కోల్పోవడం సహజం. డాన్స్ టీచర్ నేపథ్యం, అనుభవం, పరిజ్ఞానం నాట్య మనుగడకు ఎంతో ముఖ్యం. మన ముందు తరాలు సంప్రదాయ న్యత్య విలువలను మర్చిపోకుండా ఉండాలంటే, ఇలాంటి అనుభవమున్న గురువుల దగ్గరే పిల్లలకు నాట్యం నేర్పించాలి. సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు క్రమేపీ ఆదరణ కోల్పోతున్నాయి. వస్త్రధారణ, ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. నలుగురి కోసం కాదు నా కోసం నేను బ్రతకాలనే పోకడ విస్తృతమైపోయింది. కానీ ఆ నలుగురు ఎవరో కాదు. మనం, మన ఆలోచనే అనే విషయం ఎవరికి వారు తెలుసుకోవాలి. అప్పుడే సంప్రదాయ నాట్య సౌందర్యం, లేటెస్ట్ ట్రెండ్ ఒరవడిలో కొట్టుకుపోకుండా ఉండగలుగుతుంది.
గోగుమళ్ల కవిత
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News