అద్భుతం పండిస్తున్నారు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:40 AM
పంట పండించాలంటే పొలం ఉండాలి. దుక్కి దున్నాలి. వాన రావాలి. ఎండ కాయాలి. కానీ ఇవేవీ లేకుండానే గదిలోనే అరుదైన కశ్మీరీ రకం కుంకుమ పువ్వు సాగు చేస్తున్నారు...
వినూత్నం
పంట పండించాలంటే పొలం ఉండాలి. దుక్కి దున్నాలి. వాన రావాలి. ఎండ కాయాలి. కానీ ఇవేవీ లేకుండానే గదిలోనే అరుదైన కశ్మీరీ రకం కుంకుమ పువ్వు సాగు చేస్తున్నారు... అక్కాతమ్ముళ్లయిన ఆస్తిక, శంకర్ నారుల. నాన్న ఆలోచనలకు సాంకేతికతను జోడించి... లక్షలు సంపాదిస్తున్నారు. మరెందరో ఔత్సాహికులను వ్యవసాయం వైపు మళ్లిస్తున్న వారి కథ 25 ఏళ్ల ఆస్తిక మాటల్లోనే...
‘‘జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో... ఎవరిని ఎటు నడిపిస్తుందో అస్సలు ఊహించలేం. అందుకు నా పయనమే ఒక ఉదాహరణ. అందరిలా చిన్నప్పుడు నాదీ, మా తమ్ముడు శంకర్‌దీ ఒకటే లక్ష్యం... బాగా చదువుకోవాలి. మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. ఏ లోటూ లేకుండా జీవితం సాగిపోవాలి. కానీ కాలం మా ప్రయాణంలో అనుకోని మజిలీని పరిచయం చేసింది. ఆ మజిలీనే చివరకు మా జీవితాశయం అయింది. పంజాబ్ రాష్ట్రం లుథియానా మాది. నేను పొలిటికల్ సైన్స్‌లో, తమ్ముడు కంప్యూటర్స్ అప్లికేషన్స్‌లో డిగ్రీలు చేశాం. నా డిగ్రీ అవ్వగానే ఉద్యోగం చూసుకోవాలని అనుకున్నా. సరిగ్గా అదే సమయంలో నాన్న వికాస్ మా ముందు కొత్త ప్రతిపాదన పెట్టారు.
నాన్న ఆలోచన...
మా నాన్న బ్యాంకు మాజీ ఉద్యోగి. ఆయనకు మొదటి నుంచీ విభిన్నమైన వ్యవసాయ పద్ధతులంటే ఆసక్తి. అలాగని మా కుటుంబంలో ఎవరికీ వ్యవసాయ రంగంలో ప్రవేశమే లేదు. పదవీ విరమణ తరువాత నాన్న కుంకుమ పువ్వు గురించి చదవడం మొదలుపెట్టారు. అందులో ఉండే సాగు పద్ధతులేంటి, ప్రకృతి వైపరీత్యాలను ఎలా తట్టుకోవాలి, పెట్టుబడి, రాబడి వివరాలన్నీ సేకరించారు. ఆయన్ని బాగా ఆకట్టుకున్న అంశం... నేలతో, ఎండ, వానలు, రుతువుల మార్పులతో సంబంధం లేకుండా ఇండోర్‌లో పండించే విధానం.
లాక్‌డౌన్‌లో శ్రీకారం...
కరోనాతో ప్రపంచం స్తంభించిన వేళ... నాన్న తన ఆలోచనకు రూపం ఇవ్వాలని అనుకున్నారు. ముఖ్యంగా ఇరాన్, అమెరికాల్లో అధునాతన పద్ధతుల్లో జరుగుతున్న కుంకుమ పువ్వు సాగు అన్నిటికంటే ఆయనకు బాగా నచ్చింది. ఆ వివరాలను మా ఇద్దరితో పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నాణ్యమైన కుంకుమ పువ్వు, అదీ కశ్మీరీ రకానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని... దాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. మమ్మల్ని కూడా అటు వైపు రమ్మన్నారు. మొదట్లో నేను, తమ్ముడు అస్సలు ఒప్పుకోలేదు. ‘ఇది అయ్యే పని కాదులే’ అంటూ నాన్నకు చెప్పేశాం. మాకూ ఎంతో ఆసక్తిగా అనిపించింది కానీ... అందులోకి దిగితే జీవితం ఉండదని భావించాం. అయితే లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్నాం కదా... ఆ ప్రక్రియనంతటినీ నిశితంగా గమనించాం. ఆ క్రమంలో మాకు తెలియకుండానే ఆసక్తి ఎక్కువైంది. ప్రధానంగా డిమాండ్‌కు, ఉత్పత్తికి మధ్య పెద్ద అంతరం ఉందని గుర్తిం చాం. ప్రయత్నం ఫలిస్తే మంచి ఆదాయ మార్గంగా మారుతుందని గ్రహించాం. అలా నాన్నతో కలిసి కార్యక్షేత్రంలోకి దిగాం.
నాలుగేళ్ల పరిశోధన...
మా కుటుంబంలో ఎవరికీ వ్యవసాయం గురించి అవగాహన లేకపోవడంవల్ల... ముందుగా దానిపై దృష్టి పెట్టాం. ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద అందుబాటులో ఉన్న పరిశోధన పత్రాలు, పాఠ్య పుస్తకాలు... అన్నీ చదివాం. శాస్త్రవేత్తలను కలిశాం. నెల రోజులపాటు కశ్మీర్ వెళ్లి, అక్కడి కుంకుమ పువ్వు సంప్రదాయ సాగు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాం. గూగుల్ స్కాలర్, ఐటీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్), ఆర్క్ (అగ్రికల్చరల్ రీసెర్చ్ కమ్యూనికేషన్ సెంటర్)ల నుంచి పరిశోధనా పత్రాలు కొనుగోలు చేశాం. మాకు అర్థమైంది ఏంటంటే... ఇండోర్ ఫార్మింగ్ వెనుక ఉన్న శాస్త్ర, సాంకేతిక అంశాలు చాలా సంక్లిష్టమైనవే కానీ, ఆచరణలో పెట్టడం అసాధ్యం కాదని. నాలుగేళ్ల పరిశోధన తరువాత పూర్తి స్థాయి సమాచారం, అవగాహనతో రెండేళ్ల కిందట ‘గ్రో గ్రోవర్’ పేరుతో కశ్మీరీ రకం కుంకుమ పువ్వు ఇండోర్ ఫార్మింగ్‌కు శ్రీకారం చుట్టాం.
ప్రయోగశాల...
ఈ సాగు చాలా సున్నితమైనది. అధిక శ్రమతో కూడుకున్నది. అయితే దాని ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుంది. కిలోకు 1.5 లక్షల పువ్వులు కావాలి. నాణ్యతను బట్టి మార్కెట్‌లో కిలో ధర 3 లక్షల నుంచి 15 లక్షల వరకు పలుకుతుంది. కశ్మీరీ కుంకుమ పువ్వు ప్రత్యేకత ఏంటంటే... గాఢమైన రంగు, ఘాటైన సువాసన, అందులోని ఔషధ గుణాలు. ఇంత విలువైన పంట సాగు క్రమంగా తగ్గిపోతోంది. అవసరమైన మేరకు ఉత్పత్తి లేదు. ఎక్కువగా ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకొంటోంది. మేం కశ్మీర్ తరహా వాతావరణాన్ని ఏరోపోనిక్ సాంకేతికత సాయంతో లుథియానాలోని ఒక పెద్ద గదిలో సృష్టించాం. ఈ విధానంలో మొక్కలు మట్టి లేకుండా, గాలిలో లేదంటే పొగ మంచులో పెరుగుతాయి. సెన్సార్లు తదితర ప్రత్యేక ఏర్పాట్లతో గది లోపలి వాతావరణాన్ని మనమే నియంత్రిస్తాం. ఇందులో నాలుగు అంశాలు... ఉష్ణోగ్రత, తేమ, కార్బన్‌డయాక్సైడ్, కాంతి ఇమిడివుంటాయి. వాస్తవానికి ఇది వ్యవసాయ క్షేత్రంలా కాకుండా ఒక ప్రయోగశాలలా అనిపిస్తుంది.’’
లాభాల పంట...
‘గ్రో గ్రోవర్’ కోసం 55 లక్షలు పెట్టుబడి పెట్టాం. రెండేళ్ల అలుపెరుగని కృషి తరువాత మొదటి పువ్వు పూసింది. అది చూసి మా కళ్లు చెమర్చాయి. బిడ్డ పుట్టినప్పుడు పొందిన అనుభూతి. భావోద్వేగం. తొలి పంట చేతికి వచ్చింది. ఇన్నేళ్ల కష్టానికి గానూ 1.3 కిలోల కుంకుమ పువ్వు ఉత్పత్తి అయింది. 17 లక్షల ఆదాయం లభించింది. ఆస్ర్టేలియా, కెనడా తదితర దేశాలకు ఎగుమతి చేశాం. మొత్తంగా ఇప్పటికి 26 లక్షలు దీని ద్వారా ఆర్జించాం. చుట్టుపక్కల రైతులకు కూడా ఈ సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International