Share News

చెట్లు ఎక్కాలా? ఆమె నేర్పిస్తారు!

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:30 AM

చెట్ల నుంచి కొబ్బరికాయలు దించే పని ఒక మహిళ చేపట్టడమే అరుదు. అలాంటిది అందులో రాణించడమే కాదు, మనదేశం నుంచి తొలి మహిళా ‘కోకోనట్‌ ట్రీ క్లైంబింగ్‌ ట్రైనర్‌.’ దేశ, విదేశాల్లో వేల మంది...

చెట్లు ఎక్కాలా? ఆమె నేర్పిస్తారు!

చెట్ల నుంచి కొబ్బరికాయలు దించే పని ఒక మహిళ చేపట్టడమే అరుదు. అలాంటిది అందులో రాణించడమే కాదు, మనదేశం నుంచి తొలి మహిళా ‘కోకోనట్‌ ట్రీ క్లైంబింగ్‌ ట్రైనర్‌.’ దేశ, విదేశాల్లో వేల మందికి శిక్షణ ఇచ్చారు సునీ లీ. అంతేకాదు... భారీ వాహనాల డ్రైవింగ్‌, కరాటే, వ్యవసాయం ... ఇలా పలు అంశాల్లో ఆమె నిష్ణాతురాలు. ‘‘జీవితంలో ప్రతి దశలోనూ సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే సాహసంతో ముందడుగు వేయాలి’’ అంటున్న ఆమె కథ ఇది.

‘‘కేరళలోని వర్కళ పట్టణం మాది. నా భర్త లీ వృత్తి రీత్యా మేము ముంబయిలో ఉండేవాళ్ళం. మా ఊరికి దగ్గిరలోని ఆలయంలో జరిగే ఆయిల్యమ్‌ ఉత్సవాల్లో... మా తోటలోని కొబ్బరి బొండాలను అమ్మవారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. 2010లో ఆ మొక్కు తీర్చుకోవడానికి మా ఊరికి వచ్చాం. చెట్టు నుంచి కొబ్బరి బొండాలను దించే వ్యక్తి కోసం వెతికితే ఎక్కడా దొరకలేదు. చివరకు ఒకరు ముందుకు వచ్చినా, సగం కాయలు దించి వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డాను. ‘‘ఆ వృత్తిలో ఆదాయం తక్కువ, ప్రమాదం ఎక్కువ. అందుకే యువత ముందుకురావడంలేదు’’ అని స్థానికులు అన్నారు. ‘‘వచ్చే ఏడాది నేనే స్వయంగా చెట్టు నుంచి కాయలు దించి, పూర్తిగా మొక్కు తీర్చుకుంటాను’’ అని మావాళ్ళతో చెప్పాను. అందరూ ఎగతాళిగా నవ్వారు. నేను వెనకడుగు వేయలేదు.

రహస్యంగా ఉంచా...

మా వివాహం తరువాత... ఇరవయ్యేళ్ళపాటు ముంబయిలో ఉన్నాం. మావారు లీ... అక్కడి ఒక షిప్పింగ్‌ కంపెనీలో డ్రైవర్‌గా పని చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే కరాటే, హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ నేర్చుకున్నాను. నా భర్తకు సాయంగా కొన్నాళ్ళు ట్రాక్టర్లు, టిప్పర్ల లాంటివి నడిపాను. పట్టుదలగా ప్రయత్నిస్తే కొబ్బరి చెట్లు ఎక్కడం కూడా నేర్చుకోగలనని అనిపించింది. కానీ మా బంధువుల దృష్టి లో అది చాలా తక్కువ స్థాయి పని. అందులోనూ ఒక మహిళ చెట్లు ఎక్కడాన్ని కలలో కూడా ఊహించలేరు. ఇవన్నీ ఆలోచించే ధైర్యం చేశాను. అయితే కొన్నాళ్ళు రహస్యంగా ఉంచమని చెప్పారు. అదే సమయంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు (సిడిబి) ముప్ఫై మందికి శిక్షణ ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. నా పేరు నమోదు చేయించుకొని ట్రైనింగ్‌లో చేరాను. మొత్తం బ్యాచ్‌లో మహిళను నేనొక్కర్నే. వెన్ను నొప్పికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నానని మా వాళ్ళకు చెప్పి... శిక్షణకు వెళ్ళేదాన్ని. మొదట్లో కష్టంగా ఉండేది. కానీ క్రమంగా ఒక్కొక్క అడుగు పైకి వెళ్ళడం ప్రాక్టీస్‌ చేశాను. శిక్షణ పూర్తయ్యేసరికి... 60 సెకెన్లలో 50 అడుగులు నిలువుగా చెట్టుపైకి ఎక్కడంలో ప్రావీణ్యం సాధించాను. సర్టిఫికెట్‌ అందుకున్నాను. తరువాత నా భర్త కూడా ఆదే శిక్షణ తీసుకున్నారు. అలా 40 ఏళ్ళ వయసులో చేసిన సాహసం... నాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెడుతుందని అప్పుడు ఊహించలేదు.


ఆనందంగా ఒప్పుకున్నాం...

కొన్ని రోజుల్లోనే... కోకోనట్‌ బోర్డు అధికారులు మమ్మల్ని పిలిచారు. ‘‘మహారాష్ట్రలోని రత్నగిరి కొబ్బరి పరిశోధన కేంద్రంలో శిక్షకుల అవసరం ఉంది. మీరు వెళ్తారా?’’ అని అడిగారు. అది మేము ఊహించని ఆఫర్‌. ఆనందంగా ఒప్పుకున్నాం. మన దేశంలో చెట్లు ఎక్కడంలో శిక్షణ ఇచ్చే తొలి మహిళగా అలా మొదలైన నా ప్రయాణం... ఇండియాలోని దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్లో, సింగపూర్‌, మలేసియా, ఇండోనేసియా, జమైకా లాంటి దేశాల్లో సాగింది. అది ట్రైనర్‌గా నన్ను మరింత పదునుపెట్టింది. ఇప్పటివరకూ అయిదువేలమందికి పైగా దేశ, విదేశాల్లో శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు నా వయసు 55 ఏళ్ళు. మాకున్న పొలంలో కొబ్బరి చెట్లు, కూరగాయల సాగు, పశువుల పెంపకం, మూలికా మొక్కల పెంపకం లాంటివి చేస్తున్నాను. 150 మంది సభ్యులుగా ఉన్న ‘కోకోనట్‌ ప్రొడ్యూసర్స్‌ సొసైటీ’ (సిపిఎ్‌స)కి అధ్యక్షురాలిని.

నేను నేర్చుకున్న కరాటేని సద్వినియోగం చేసుకోవడానికి ‘వర్కళ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌’లో సభ్యురాలిగా, ఉమెన్స్‌ సేఫ్టీ ఇనస్ట్రక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. ఈ మధ్యే నేను, నా భర్త ఒక సినిమాలో కూడా నటించాం.

దానివల్లే గుర్తింపు...

గత 15 ఏళ్ళలో పంచాయతీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ కొన్ని వందల పురస్కారాలు అందుకున్నాను. ‘బెస్ట్‌ కోకోనట్‌ ట్రీ క్లైంబింగ్‌ ట్రైనర్‌’గా జాతీయ అవార్డు, ఇటీవల కేరళ మహిళా కమిషన్‌ నుంచి ‘స్త్రీ శక్తి అవార్డు’ వీటిలో ప్రధానమైనవి. అయితే ‘‘నీకు అన్నిటికన్నా సంతృప్తి ఇచ్చినదేమిటి?’’ అని అడిగితే శిక్షణ ఇవ్వడమేనని చెబుతాను. ఎందుకంటే అదే నాకు గొప్ప గుర్తింపు తెచ్చింది. నా దగ్గర శిక్షణ పొందిన ఉత్తరాది మహిళలు కొందరు చెట్లు ఎక్కడాన్ని వృత్తిగా స్వీకరించారు. వారి జీవనోపాధికి దోహదం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది.’’

Also Read:

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

కష్టపడి పని చేసేవారికి అవకాశాలు పుష్కలం: నారా భువనేశ్వరి

For More Latest News

Updated Date - Mar 26 , 2026 | 01:30 AM