అహం ప్రభావం
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:20 AM
విజయం, కంటికి కనిపించే విషయాలు, గుర్తింపు... వీటి ద్వారా నడిచే ఈ యుగంలో మన నిర్ణయాలను, సంబంధాలను, అంతర్గత శాంతిని కంటికి కనిపించని ఒక అంశం నిర్దేశిస్తుంది...
యోగా
విజయం, కంటికి కనిపించే విషయాలు, గుర్తింపు... వీటి ద్వారా నడిచే ఈ యుగంలో మన నిర్ణయాలను, సంబంధాలను, అంతర్గత శాంతిని కంటికి కనిపించని ఒక అంశం నిర్దేశిస్తుంది. అది: అహం. అహం ఆరోగ్యకరమైన రూపంలో ఉన్నప్పుడు అది మనకు ఉనికిని, విశ్వాసాన్ని అందిస్తుంది. కానీ అది బాగా పెరిగిపోయినప్పుడు మన అవగాహనను వక్రీకరిస్తుంది. అర్థం చేసుకోవడానికి బదులు రక్షణాత్మక ధోరణిలోకి, సహకార వైఖరికి బదులు ఆధిపత్యాన్ని చెలాయించడంలోకి, ప్రతిఫలించడానికి బదులు ప్రతిస్పందించడంలోకి మనల్ని నెట్టేస్తుంది. పని చేసే ప్రదేశాల్లో, సంస్థల్లో, కుటుంబాల్లో, చివరకు ఆధ్యాత్మిక జీవనంలో... ఇలా ప్రతి చోటా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
పని ప్రదేశాల్లో: వృత్తిపరమైన వాతావరణంలో... అహం తరచుగా అనుభవం, అధికారం వెనుక దాగి ఉంటుంది. ఒక జూనియర్ సహోద్యోగి ఇచ్చిన వినూత్నమైన సూచనను ఎలాంటి చర్చా లేకుండా తోసిపుచ్చవచ్చు. ఎవరైనా అభిప్రాయం వెల్లడిస్తే... ఆ వ్యక్తి తమను అవమానపరుస్తున్నారని భావించవచ్చు. తప్పును అంగీకరిస్తే తమ హోదాకు భంగం కలుగుతుందని అనిపించవచ్చు. ఇటువంటి ప్రతిస్పందనలు సంస్థలను క్రమంగా బలహీనపరుస్తాయి. వ్యక్తులు తమ ఆలోచనలను వ్యక్తపరచడానికి వెనుకాడినప్పుడు కొత్త ఆవిష్కరణలు నెమ్మదిస్తాయి. సహకారానికి బదులు ఘనతకే ప్రాధాన్యం దక్కినప్పుడు బృందాలు విశ్వాసాన్ని కోల్పోతాయి. ‘‘అహం చాలా సూక్ష్మమైన అవరోధం. అది మనల్ని నేర్చుకోకుండా నిరోధిస్తుంది. ఎందుకంటే అది మనకు ఆ సంగతి ఇప్పటికే తెలుసునని మనల్ని ఒప్పిస్తుంది’’ అంటారు దాజీ. నిజమైన వృత్తినైపుణ్యం ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంలో కాదు... వృద్ధిని ఆహ్వానించడంలో ఉంటుంది.
సంస్థలలో: పోటీకన్నా సహకారం బలంగా ఉన్నప్పుడు సంస్థలు వృద్ధి చెందుతాయి. అయినప్పటికీ బృందాలను అహం నిశ్శబ్దంగా విభజించగలదు. మరింత సమర్థమైనవిగా కనిపించడం కోసం సమాచారాన్ని విభాగాలు దాచిపెట్టవచ్చు. నాయకులు వినడం కన్నా మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ‘‘వినయం మీ స్థాయిని తగ్గించదు, అది మీ బలాన్ని పెంచుతుంది’’ అని దాజీ స్పష్టం చేశారు.
కుటుంబ జీవితంలో: అహం అనేది పనిలో ఒత్తిడిని సృష్టిస్తే, ఇంట్లో దూరాన్ని సృష్టిస్తుంది. సంబంధాలు దెబ్బతినడం పెద్ద సంఘర్షణల వల్ల కాదు, పరిష్కారం కాన్ని చిన్న సందర్భాల వల్ల... క్షమాపణ చెప్పడం ఆలస్యం కావడం వల్ల, రక్షణాత్మకమైన ప్రతిస్పందన వల్ల, నిశ్శబ్దమైన ద్వేషం వల్ల సంభవిస్తాయి. అహం ప్రామాణికతను కోరుకుంటుంది. ప్రేమ అనుబంధాన్ని కోరుకుంటుంది. ‘బహుశా నాదే తప్పు కావచ్చు’ అనే సాధారణమైన మాట... ఏళ్ళ తరబడీ ఉన్న భావోద్వేగమైన దూరాన్ని తగ్గించగలదు. ‘‘హృదయం సరళంగా మారితే సంబంధాలు సరళంగా మారుతాయి’’ అని దాజీ వెల్లడించారు.
ఆధ్యాత్మిక వృద్ధిలో: ఒక వ్యక్తి ధ్యానాన్ని నిజాయితీగా ప్రారంభించవచ్చు. జ్ఞానం, క్రమశిక్షణ లేదా గ్రహించిన పురోగతి వల్ల క్రమంగా గర్వం తలెత్తవచ్చు. అప్పుడు ధ్యానాన్ని పోలిక భర్తీ చేస్తుంది శరణాగతిని ఆధిపత్యభావన భర్తీ చేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతికి తేలికతనం అవసరం. అహం భారాన్ని సృష్టిస్తుంది. అహం అణగారితే ఆధ్యాత్మిక ప్రగతి మొదలవుతుందని దాజీ చెప్పారు.
ఆరోగ్య కోణం: నిరంతరం అహంకారపూరిత రక్షణాత్మక ధోరణి నాడీ వ్యవస్థను ఉద్రిక్తతలో ఉంచుతుంది. కాలక్రమేణా అది ఒత్తిడికి, చిరాకుకు, భావోద్వేగమైన అలసటకు, కలత నిద్రకు దారి తీస్తుంది. అంతర్గతమైన శాంతి... స్థిరమైన స్వాతిశయంతో కలిసి ఉండలేదు. అహంకారాన్ని అణచివేయవలసిన పని లేదు. దాన్ని శుద్ధి చేసుకోవాలి. స్పందించే ముందు కాస్త నిదానించాలి. ప్రతిస్పందించడానికి ముందు వినాలి. ఆలస్యం కాకుండా క్షమాపణ చెప్పాలి. ఎవరితోనూ పోల్చకుండా అభినందించాలి. స్వీయ అవగాహన కోసం ప్రతి రోజూ ధ్యానాన్ని సాధన చేయాలి. అహం ఎంత తక్కువగా ఉంటే శాంతి అంత ఎక్కువగా ఉంటుందని దాజీ పేర్కొన్నారు. విజయం ప్రపంచాన్ని ఆకట్టుకోవచ్చు. కానీ అహంనుంచి పొందే విముక్తి హృదయానికి శాంతిని తెస్తుంది.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్,
ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్. 9440087532
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News