Share News

అనుభవాల వేదిక..!

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:04 AM

హర్‌ త్రివేండ్రం... అభిరుచులను పంచుకోవడం, ఆసరాగా నిలవడం, అరమరికలు లేకుండా భావాలను వ్యక్తపరచడం... ఇలా ఎన్నిటికో వేదిక.తనలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తులతో...

అనుభవాల  వేదిక..!

హర్‌ త్రివేండ్రం... అభిరుచులను పంచుకోవడం, ఆసరాగా నిలవడం, అరమరికలు లేకుండా భావాలను వ్యక్తపరచడం... ఇలా ఎన్నిటికో వేదిక.తనలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తులతో అనుసంధానం కావడం కోసం తిరువనంతపురానికి చెందిన అంజలీ మనోజ్‌ ఆరంభించిన ఈ ఫేస్‌బుక్‌ గ్రూప్‌... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పదహారు వేల పైచిలుకు మహిళల్ని అనుసంధానిస్తున్న ఒక కమ్యూనిటీ. దాన్ని అన్నీ తానై అంజలి నడిపిస్తున్నారు.

మన్నా అబ్రహం... ఇండియాతో పాటు పలు దేశాల్లో టీచర్‌గా పని చేశారు. అమెరికాలో సర్కస్‌ కళాకారుల పిల్లలకు చదువు చెప్పడం కోసం ఎనిమిదేళ్ళపాటు రైలునే ఇల్లుగా చేసుకొని, వారితో చేసిన ప్రయాణం తన జీవితంలో మరచిపోలేని అనుభవమని చెబుతారామె. ఆ అనుభవాలను, తన స్వస్థలమైన కేరళను చిన్నవయసులోనే విడిచిపెట్టడానికి దారితీసిన చేదు సంఘటనలతో రచనలు చేయాలనుకున్నారు. వాటి గురించి తన బంధు మిత్రులతో చర్చించినప్పుడు... వారు ఆమెను ఎగతాళి చేశారు. ‘సర్కస్‌ గర్ల్‌’అంటూ ఆట పట్టించారు. మన్నా సందిగ్ధంలో ఉన్న సమయంలో... ‘హర్‌ త్రివేండ్రం’

(హెచ్‌టి) గ్రూప్‌ను ఆమె పాత విద్యార్థి ఒకరు పరిచయం చేశారు. ‘‘ఆ గ్రూపులోని పోస్టులను ఆసక్తిగా చదివేదాన్ని. ఒకసారి ‘‘మీరు చూసిన ఆసక్తికరమైన ప్రదేశాల గురించి రాయండి’’ అంటూ గ్రూపులోని సభ్యులకు అడ్మిన్‌ అంజలీ మనోజ్‌ సూచించారు. నా సర్కస్‌ అనుభవాలు కొన్ని రాసినప్పుడు... వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. దాని గురించి తెలుసుకున్న కొన్ని పత్రికలు నా ఇంటర్వ్యూలు అడిగాయి. నా అనుభవాలు ప్రచురణకు అర్హమైనవేనని అర్థమయింది. 2022లో ‘హార్ట్‌ ఆఫ్‌ ది సర్కస్‌’ పుస్తకాన్ని వెలువరించాను. ఆ తరువాత అది మళయాళంలోకి అనువాదమయింది. రచయిత్రిగా నన్ను సమాజం గుర్తిస్తోంది. ‘హర్‌ త్రివేండ్రం’ లేకపోతే అది సాధ్యమయ్యేదని అనుకోను’’ అని గుర్తు చేసుకున్నారు మన్నా. హెచ్‌టిలో మరో సభ్యురాలు లెన్నీ ‘ఇట్స్‌ జస్ట్‌ లైఫ్‌’ పేరుతో ఆత్మకథ రాశారు. ‘‘అది కేరళకు చెందిన డెబ్భయ్యేళ్ళ మహిళ ఆత్మకథ. దానికి హెచ్‌టి మిత్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని చెబుతారు లెన్నీ.


మనసులో మాట పంచుకోడానికి...

హెచ్‌టిలో సభ్యులైన వేలాదిమందికి ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో. ‘‘పేరులో త్రివేండ్రం ఉన్నా ప్రపంచవ్యాప్తంగా సభ్యులున్న ఒక కమ్యూనిటీ. కానీ ఇది ఇంత విస్తరిస్తుందని ఊహించలేదు’’ అంటారు హెచ్‌టికి కర్త, కర్మ, క్రియ అయిన అంజలీ మనోజ్‌. ‘‘కొన్నేళ్ళ క్రితం పిల్లల పుట్టిన రోజును ఒక కొత్త థీమ్‌తో చేయాలనుకున్నాను. దానికోసం సూచనలివ్వాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తే... స్పందనలు చాలా పేలవంగా అనిపించాయి. నాలాంటి అభిరుచులు ఉన్న, సృజనాత్మకత, హాస్యచతురత ఉన్నవారితో, ఎంతోకాలంగా దూరంగా ఉన్న స్నేహితులతో అనుసంధానం కావడానికి ఒక వేదిక కావాలనిపించింది. పాతికేళ్ళ నుంచి నేను కేరళలోని త్రివేండ్రంలో ఉన్నాను. అందుకే... ‘హర్‌ త్రివేండ్రం’ పేరుతో ఒక గ్రూప్‌ను 2018లో ప్రారంభించాను. కొవిడ్‌ సమయంలో... చాలామంది మహిళలకు... తమ గుర్తింపును గోప్యంగా ఉంచుకుంటూ... తమ మనసులోని మాటల్ని తోటి మహిళలతో పంచుకోవడానికి ఒక వేదిక అవసరమైంది. ఆ సమయంలోనే సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. ఇంటి సమస్యలు, శారీరక, ఆరోగ్య, మానసిక సమస్యలను ఎవరైనా చెప్పుకున్నప్పుడు... వారికి సహానుభూతిని, మద్దతును, సలహాలను ఇతర సభ్యులు అందిస్తూ వచ్చారు. అలా ఈ కమ్యూనిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం 16 వేలకు పైగా సభ్యుల ప్రపంచమంతటా ఉన్నారు’’ అంటున్నారు అంజలి.

3-Navya.jpg

పరస్పర సహకారం

‘‘సమాజంలోని అన్ని వర్గాల మహిళలను.. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, ఇతరుల జీవితాల మీద తీర్పులు చెప్పకుండా... మనసు విప్పి మాట్లాడుకోగలిగే సురక్షితమైన ఒక ప్రదేశంలోకి తేవాలన్న అంజలి ప్రయత్నానికి ప్రతిరూపమే హెచ్‌టి. నాలాంటి ఆలోచనలున్న స్నేహితుల్ని ఇక్కడ సంపాదించుకున్నాను. ఇప్పుడు నాకు 74 ఏళ్ళు. హెచ్‌టి వల్లనే నేను ఒక విధంగా కాలంలో వెనక్కి వెళ్ళి, నా జీవితాన్ని మళ్ళీ ఆస్వాదిస్తున్నాను. నా ఉత్సాహాన్ని, సంకల్పాన్ని తిరిగి పొందాను’’ అంటారు లెన్నీ అబ్రహం. ఆమెతో పాటు రిటైర్డ్‌ డెంటిస్ట్‌ లెన్నీ, మరో రచయిత్రి రాధా నాయర్‌ ప్రతివారం కాలమ్స్‌ రాస్తారు. ‘‘హెచ్‌టిలో నేను పెట్టిన పోస్టులు చూసి... చాలామంది మహిళలు నా దగ్గరకు కౌన్సెలింగ్‌ కోసం వస్తున్నారు’’ అని చెబుతారు కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ జసీనా బెకర్‌. అలాగే... అమెరికా నుంచి త్రివేండ్రంకు తిరిగి వచ్చిన ఆర్కిటెక్ట్‌ మిజి మాధ్యూ... తన రచనా వ్యాసంగం, వ్యాఖ్యాతగా వ్యవహరించడం, పాడటం, నటన, నృత్యం లాంటివాటిలో చురుగ్గా పాల్గొనడానికి కారణం హెచ్‌టి’’ అని అని చెబుతున్నారు. ఈ బృందంలోని సభ్యులు తరచూ కలుసుకొని, తమ భావాలను ముఖాముఖిగా పంచుకుంటూ ఉంటారు. జీవితానికి, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాలకు సంబంధించిన అంశాల్లో పరస్పరం సహకరించుకుంటారు. ‘‘ఈ గ్రూప్‌ ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా తోటి మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఎంతో అవగాహన కలిగింది. హెచ్‌టి చిరకాలం కొనసాగుతుందనే నమ్మకం నాకుంది’’ అంటున్నారు అంజలి.


నియమాలూ ఉన్నాయి...

ఇంత పెద్ద గ్రూప్‌ను నడపడం కత్తిమీద సామే. పరస్పర గౌరవం కాపాడుకోవడం, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవడం ప్రధానం. అందుకే ప్రతి పోస్టును తనకే పంపాలనేది అంజలి పెట్టిన ఏకైక షరతు. ఇక... డెబ్భయ్యేళ్ళ వయసులోనూ దానికి రోజూ తన సమయాన్ని ఆమె కేటాయిస్తున్నారు. వారంలో ఏడు రోజులూ ఈ గ్రూప్‌ నిర్వహణలో అంజలి నిమగ్నమై ఉంటారు. ‘‘ఆదివారాలు వదిలేద్దామని ఒకసారి సూచించాను. ఆదివారాలు ఏం చేస్తారని కొందరు సభ్యులు అడిగారు’’ అంటారు అంజలి నవ్వుతూ. అలాగే కచ్చితమైన నియమాలను కూడా ఆమె నిర్దేశించారు. ఈ గ్రూప్‌ కేవలం మహిళలకే పరిమితం. ఇందులో రాజకీయాల గురించి, మతం గురించి చర్చించకూడదు. కులం, మతం, సంస్కృతి లాంటి అంశాలపై కామెంట్స్‌ చెయ్యకూడదు. అశ్లీలమైన, అసభ్యమైన భాషతో, దృశ్యాలతో పోస్టులు, ఫొటోలు పెట్టకూడదు... ఇలాంటివి. కాగా వారంలో కొన్ని రోజులపాటు సభ్యులైన మహిళలు తమ సొంత వ్యాపారాలు లేదా తాము నిర్వహించే తరగతుల గురించి ప్రకటనలు పోస్ట్‌ చెయ్యవచ్చు. ఇక... సభ్యులు పెరుగుతున్న కొద్దీ... పాత సభ్యుల సిఫార్సుతో మాత్రమే కొత్తవారిని చేర్చాలనే నిబంధనను పెట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 03:04 AM