తలనొప్పి తోక ముడిచేలా...
ABN , Publish Date - Jul 28 , 2026 | 04:59 AM
తలనొప్పి వేధిస్తే, నొప్పి మాత్ర మింగేసి ఊరుకుంటాం! కానీ ఆ తలనొప్పి వెనక నాడీపరమైన కారణం దాగి ఉంటే కనిపెట్టేదెలా? అందుకే ఎలాంటి తలనొప్పినీ అశ్రద్ధ చేయకూడదంటున్నారు
న్యూరాలజీ
తలనొప్పి వేధిస్తే, నొప్పి మాత్ర మింగేసి ఊరుకుంటాం! కానీ ఆ తలనొప్పి వెనక నాడీపరమైన కారణం దాగి ఉంటే కనిపెట్టేదెలా? అందుకే ఎలాంటి తలనొప్పినీ అశ్రద్ధ చేయకూడదంటున్నారు వైద్యులు.
ప్రైమరీ, సెకండరీ...ఇలా రెండు రకాల తలనొప్పులుంటాయి. మైగ్రెయిన్ తలనొప్పి ప్రైమరీ తలనొప్పి అయితే, మెదడులో కణితి, తలకు గాయం లేదా బ్యాక్టీరియా, వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల, రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల తలెత్తే తలనొప్పి సెకండరీ తలనొప్పి. ప్రైమరీ తలనొప్పి వస్తూ, పోతూ, పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. కానీ సెకండరీ తలనొప్పి క్షణాల్లో తీవ్రమైపోతూ, జ్వ రం, పక్షవాతం, అవయవాల్లో బలహీనత లాంటి లక్షణాలతో వేధిస్తుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన మెదడు భాగం ఆధారంగా లక్షణాలు కూడా మారుతూ ఉంటాయి. ఈ రెండు రకాల తలనొప్పులనూ లక్షణాలు, స్కాన్స్ ఆధారంగా కనిపెట్టవచ్చు.
అలసత్వం తగదు
ఎలాంటి కొత్త తలనొప్పినీ నిర్లక్ష్యం చేయకూడదు. ఒత్తిడికి లోనైనప్పుడు కొంత సమయం పాటు కొద్దిపాటి తలనొప్పి వేధించి, తగ్గిపోతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెలలో ఒకట్రెండు సార్లు తలనొప్పి వేధించినప్పుడు, తలనొప్పి మాత్రలు వేసుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ పదే పదే వేధించే తలనొప్పికి పదే పదే నొప్పి మాత్రలు వేసుకుంటూ ఉండిపోతే, ఆ పరిస్థితి మెడికేషన్ ఓవర్‌యూజ్ మైగ్రెయిన్‌కు దారి తీస్తుంది. అవసరానికి మించి నొప్పి మాత్రలు వాడుకోవడం వల్ల తలెత్తే తలనొప్పి ఇది. కాబట్టి ఎలాంటి ఒత్తిడీ లేకపోయినా, తలనొప్పి వేధిస్తున్నా, నెలలో నాలుగైదు సార్లు తలనొప్పి మాత్రలు వేసుకోవలసి వస్తున్నా, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
తలనొప్పులు పలు రకాలు
మైగ్రెయిన్, మెదడులో సమస్యల వల్ల తలెత్తే తలనొప్పులతో పాటు విటమిన్ డి, బి12, ఐరన్ లోపం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. కాబట్టి ఈ లోపాలు లేవని వైద్య పరీక్షలతో నిర్థారించుకోవాలి. కొత్త రకం తలనొప్పి కారణాన్ని నిర్థారించడం కోసం స్కానింగ్ కూడా అవసరమవుతుంది. దీంతో మెదడులో కణుతులు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను సులభంగా కనిపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో మెదడులోని డ్రెయిన్స్ పూడుకుపోయి, సెరిబ్రల్ వీనస్ థ్రోంబోసిస్ కూడా తలెత్తవచ్చు. యువతలో డీహైడ్రేషన్ వల్ల, మహిళల్లో ప్రసవానంతరం ఈ సమస్య తలెత్తుతూ ఉంటుంది. వీటన్నిటినీ ఎమ్మారై, లేదా సిటి స్కాన్‌తో కనిపెట్టి, తగిన చికిత్స తీసుకోవడం అవసరం. సాధారణంగా తలకు తగిలే చిన్నపాటి దెబ్బలను కూడా ఎవరూ తీవ్రంగా పరిగణించరు. కానీ తలకు దెబ్బ తగిలిన తర్వాత, కొత్తగా తలనొప్పి వేధించడం మొదలుపెట్టినా, మగత మొదలైనా, ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. స్కాన్‌లో మెదడులో రక్తం గడ్డకట్టినట్టు కనిపిస్తే, వైద్యులు చిన్న గడ్డలను మందులతో, పెద్ద గడ్డలను ఆపరేషన్‌తో తొలగిస్తారు.
మందులతో తలనొప్పి
మన దేశంలో మైగ్రెయిన్‌తో బాధపడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువ. ఎక్కువ మందిలో కనిపించే అత్యంత సాధారణ సమస్య ఇది. కత్తితో పొడుస్తున్నట్టు భరించలేని తల పోటు ఒక్కోరోజు ఒక్కో వైపు వేధించవచ్చు. కంటిచూపులో కూడా మార్పు రావచ్చు. వెలుగు చూడలేకపోవడం, వెలుగుతో తలనొప్పి ఎక్కువైపోవడం, వాంతులవడం, వాంతితో ఉపశమనం కలగడం కూడా మైగ్రెయిన్ ప్రధాన లక్షణాలే! కొందరికి ఒత్తిడితో, మరికొందరికి కొన్ని రకాల పదార్థాలతో మైగ్రెయిన్ ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అయితే ప్రారంభంలో ఆ నొప్పి మైగ్రెయిన్ అని తెలియక తలనొప్పి మాత్రలు వాడుకుంటూ ఉండిపోతారు. కానీ ఇలా వాడుకోవడం వల్ల అసలు సమస్య సమూలంగా పరిష్కారం అవకపోగా, పని మీద ఏకాగ్రత తగ్గుతుంది, జీవన నాణ్యత కూడా తగ్గిపోతుంది. అరుదుగా కొందర్లో చిన్నపాటి బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. కాబట్టి ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.

మెదడులో ట్యూమర్లతో...
మెదడులో కణితులతో తలనొప్పి క్రమేపీ పెరుగుతూ, అదే పనిగా కొనసాగుతుంది. వాంతులు, చేతులు, కాళ్లు బలహీనపడడం, మాట తడబడడం, కంటి చూపు మందగించడం, పక్షవాతం.. ఇలా ట్యూమర్ మెదడులో తలెత్తిన ప్రదేశం ఆధారంగా లక్షణాలు మారుతూ ఉంటాయి. అలాగే కణితి తలెత్తిన ఒకట్రెండు నెలల్లోనే లక్షణాలు బయల్పడి, క్రమేపీ వేగంగా తీవ్రమైపోతాయి. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు స్కాన్స్‌తో కణితిని గుర్తించి, రకాన్ని బట్టి చికిత్సా పద్ధతులను ఎంచుకుంటారు.
అత్యవసర పరిస్థితి... అన్యూరిజం
మెదడులోని రక్తనాళాలు బలహీనపడి, ఒక చిన్న బుడిపె ఏర్పడి, అది చిట్లిపోయే పరిస్థితి ఇది. ఇలా జరిగినప్పుడు మెదడులో తీవ్ర రక్తస్రావమై, తట్టుకోలేనంత తలనొప్పి వేధిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా సర్జరీ చేసి, గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడం ద్వారా మెదడు మీద ఒత్తిడి తగ్గించి, అదే సమయంలో రక్తనాళాన్ని మూసివేయాల్సి వస్తుంది. అయితే జన్యుపరంగా రక్తనాళాల బలహీనత ఉన్న వాళ్లు, ధూమపానం, అధిక రక్తపోటు ఉన్న వారిలో అన్యూరిజం తలెత్తే అవకాశాలు ఎక్కువ.
మైగ్రెయిన్‌కు ఇంజెక్షన్స్
సాధారణంగా మెదడులో ‘క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్’ ప్రొటీన్ పెరిగి, రక్తనాళాల వాచిపోయి, తీవ్రమైన నొప్పితో మైగ్రెయిన్ వేధిస్తుంది. మైగ్రెయిన్ మందులన్నీ ఈ ప్రొటీన్ విడుదలకు అడ్డుకోవడం ప్రధానంగానే రూపొందాయి. అయితే తాజాగా ‘ఎరెనుమాబ్’, ‘జిప్యాంట్స్’ అనే రెండు రకాల సమర్థవంతమైన ఇంజెక్షన్స్ అందుబాటులోకొచ్చాయి. ఇవి రెండూ క్యాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ పెప్టైడ్‌ను బ్లాక్ చేయడం ద్వారా తలనొప్పిని తగ్గిస్తాయి.
డాక్టర్ జైదీప్ రాయ్ చౌధురి
సీనియర్ న్యూరాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్..!
బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్
Read Latest AP News And Telugu News