Share News

బాధ్యత.. ధైర్యం @ వరాలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 04:25 AM

నాన్న గొర్రెల కాపరి. రోజంతా కష్టపడినా కుటుంబం గడవని పరిస్థితి. ఆ కష్టం చూస్తూ పెరిగిన కూతురు... తండ్రికి భారం తగ్గించాలనుకుంది. పట్టుదలగా పీజీ చదివి...

బాధ్యత.. ధైర్యం @ వరాలు

లైఫ్‌

నాన్న గొర్రెల కాపరి. రోజంతా కష్టపడినా కుటుంబం గడవని పరిస్థితి. ఆ కష్టం చూస్తూ పెరిగిన కూతురు... తండ్రికి భారం తగ్గించాలనుకుంది. పట్టుదలగా పీజీ చదివి... ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. కానీ... కొలువు మార్చురీలో! మగవారు సైతం వెనకాడే వృత్తిలో... నిత్యం మృతదేహాల మధ్యలో... ధైర్యమే అండగా... సాహసమే శ్వాసగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. మార్చురీ అసిస్టెంట్‌... 27 ఏళ్ల పగిడాల వరాలు... ‘నవ్య’తో పంచుకున్న అనుభవాలు ఇవి.

‘‘మా అమ్మానాన్నలకు నేను ఒకేఒక్క సంతానం. అదికూడా ఆడబిడ్డ కావడంతో నన్ను చాలా గారాబంగా పెంచారు. నా కాళ్లపై నేను నిలబడాలని ఉన్నదాంట్లోనే చదివించారు. వారి కష్టం వృధా కాకూడదని, నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని అనుకున్నాను. పట్టుదలగా ప్రయత్నించి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాను. ప్రస్తుతం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. వైఎస్సార్‌ కడప జిల్లా చాపాడు మండలం చిన్నవరదాయపల్లె గ్రామం మాది. మా నాన్న గంగన్న మేకల కాపరి. తల్లి గంగాదేవి గృహిణి. నేను ఇంటర్మీడియట్‌ వరకు ప్రొద్దుటూరులోనే చదివాను. తరువాత తిరుపతి ‘పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం’ క్యాంపస్‌లో డిగ్రీ, ఎంకాం పూర్తి చేశాను. తరువాత ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరాను. అయితే అది నాకు సంతృప్తినివ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే నా కెరీర్‌కు, మా కుటుంబానికీ ఒక భరోసా ఉంటుందని భావించాను. అన్నిటికీ మించి నాన్నకు అండగా నిలవాలని అనుకున్నాను.

మొదట్లో భయమేసింది...

అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులు చేస్తూవస్తున్నాను. అలా పోస్టుమార్టం అసిస్టెంట్‌ ఉద్యోగానికి నోటిఫికేషన్‌ వెలువడింది. అప్లై చేశాను. మెరిట్‌ ఆధారంగా ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల కిందట విధుల్లో చేరాను. ‘అమ్మాయిని కదా... క్లెరికల్‌ వర్క్‌ ఉంటుందిలే’ అనుకున్నా. కానీ చేరాక తెలిసింది... శవాలను కోయాల్సి వస్తుందని. మొదటి రోజే పోస్టుమార్టం గదిలో మూడు మృతదేహాలు ఉన్నాయి. వాటిని చూడగానే భయపడ్డాను. శవ పరీక్ష చేశాక... ఆ రోజు రాత్రంతా అదే కలవరింత. నిద్ర పట్టలేదు. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా. క్రమంగా ఆ భయం నుంచి బయటపడ్డా. ప్రస్తుతం పోస్టుమార్టం గదిలో వైద్యుల పర్యవేక్షణలో మృతదేహాలను కోయడం, శరీర అవయవాలను భద్రపరచి ల్యాబ్‌లకు పంపడం, ఇతర శరీర భాగాలకు కుట్లు వేయడం, శవాలకు సంబంధించిన రికార్డు రాయడం తదితర విధులు నిర్వర్తిస్తున్నాను. గడిచిన మూడే ళ్లలో 500కు పైగా శవ పరీక్షలు చేశాను.


సవాళ్లు ఎన్నో...

ఆత్మహత్యలు, హత్యలు, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో మరణించినవారి మృతదేహాలు ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి వస్తాయి. వాటికి శవ పరీక్షలు చేయడం ఒక ఎత్తయితే... స్పాట్‌ పోస్టుమార్టం చేపట్టడం మరో ఎత్తు. ఎంతో సవాలుతో కూడుకున్నది. నదీ ప్రవాహాల్లో కొట్టుకుపోయిన శవాలు, చనిపోయి రోజులు గడిచిన తర్వాత గుర్తించినవి, కుళ్లి పురుగులు పట్టి దుర్వాసనతో తరలించేందుకు వీలులేకుండా ఉండేవాటికి... గుర్తించిన చోటే పోస్టుమార్టం నిర్వహించాలి. ఆ ప్రాంతం వరకు ముళ్లపొదలు, పొలాలు, నదుల గట్లు, కాలిబాటల్లో వెళ్లడం, అదీ ఒక ఆడపిల్లకు చాలా కష్టమైన అంశం. ఈ మూడేళ్లలో అలాంటి సవాళ్లు విసిరిన అనుభవాలు చాలానే ఉన్నాయి.

00-Navya.jpg

తలుచుకొంటే చేయగలరు...

పోస్టుమార్టం అంటే పురుషులు మాత్రమే చేయదగిన కఠినమైన వృత్తి అని, అందులో చాలా మంది మద్యం సేవించి పని చేస్తుంటారని భావిస్తారు. ఎంత కఠినమైన పని కూడా మహిళలు తలుచుకుంటే అవలీలగా చేయగలరు.’’

పఠాన్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌

ప్రొద్దుటూరు రూరల్‌

వారిని చూస్తే బాధేస్తుంది

సెల్‌ఫోన్‌ కొనలేదని, టూ వీలర్‌ ఇవ్వలేదని, బార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న చిన్న అంశాలపై ఆత్మహత్యలు చేసుకుని విగతజీవులుగా మారుతున్నారు. అల్లారు ముద్దుగా పెరిగి, బాగా స్థిరపడినవారు కూడా అర్థంలేని కారణాలతో ప్రాణాలు తీసుకొంటున్నారు. పోస్టుమార్టం గదిలోని బల్లపై పడుకుని ఉన్న అలాంటివారి మృతదేహాలు చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది. జీవితంలో ఏ సమస్యా ప్రాణం తీసుకునేంత పెద్దది కాదని తెలుసుకోండి. ప్రాణం ఉన్నంతవరకే మనిషికి విలువని గ్రహించండి.

విమర్ళలను దాటి...

ఈ ఉద్యోగంలో చేరినప్పుడు చాలామంది విమర్శించారు. ‘ఉన్నత చదువులు చదువుకొని, అమ్మాయివి అయుండి ఈ పనులేంట’ని బంధువులు, చుట్టుపక్కలవారు ప్రశ్నించారు. అయితే అవేవీ నేను పట్టించుకోలేదు. నిజాయతీగా చేసే ఏ పని అయినా నేను గౌరవిస్తాను. శవ పరీక్షలు నిర్వహించడం అంటే మృతుల కుటుంబాలకు న్యాయం చేయడమని నేను భావిస్తాను. మొదట మా అమ్మానాన్న కూడా ఈ ఉద్యోగానికి వెళతానంటే ఒప్పుకోలేదు. తర్వాత నా పనిని అర్థం చేసుకున్నారు. పెళ్లి తరువాత భర్త బాలయ్య, అత్తమామలు కూడా ఎంతో సహకరిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 30 , 2026 | 04:25 AM