ప్రభువు చూపిన దారి
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:17 AM
క్రీస్తు చెప్పినది ఆచరించడం కష్టం. ఆయన చెప్పినట్టు ప్రవర్తించడమూ కష్టమే. ఆ మాట ఆయనే చెప్పాడు. ‘‘నా మార్గం శిలువ మార్గం. నా కాడి బరువైనది, దానిని మోయడం అంత తేలిక కాదు...
దైవమార్గం
క్రీస్తు చెప్పినది ఆచరించడం కష్టం. ఆయన చెప్పినట్టు ప్రవర్తించడమూ కష్టమే. ఆ మాట ఆయనే చెప్పాడు. ‘‘నా మార్గం శిలువ మార్గం. నా కాడి బరువైనది, దానిని మోయడం అంత తేలిక కాదు. మోయడానికి సిద్ధపడినవానికి త్యాగం అవసరం. ఓపికగా మోస్తే... దానిలోని ఆత్మవైశాల్యాన్ని, సౌలభ్యాన్ని చూడగలరు. అప్పుడు మీ జీవితం ధన్యమవుతుంది’’ అని స్పష్టం చేశాడు. సుఖం మరిగినవారికి, స్వార్థపరులకు ఆయన మాట, బాట క్లిష్టంగా అనిపిస్తాయి. అందుకే ప్రభువు ఏం చెప్పాడో శోధించాలి.
తెలుసుకున్నాక దాన్ని అనుసరించాలి.
క్రీస్తు చెప్పిన దైవ రాజ్యానికి చేరాలంటే... మనిషిని ప్రేమించాలి. మనిషిపై కారుణ్యాన్ని ఒలికించాలి. ఆ మనిషి నీపట్ల తప్పు చేస్తే క్షమించాలి. లేదా నీవే తప్పు చేస్తే పశ్చాత్తాపం చెంది, క్షమాపణ అడగాలి. ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా... నిస్వార్థంగా వారికి సేవలు చేయాలి. ఇవన్నీ వివిధ సందర్భాల్లో పలు ప్రదేశాల్లో ఆయన ప్రబోధించాడు. ఆనాడు ఆయన బోధలు విన్నవారిలో... అప్పటికే బానిస బతుకుతో నలిగినవారు ఉన్నారు. జీవితం పట్ల విసుగెత్తినవారు ఉన్నారు. పురాతన యూదా మత సిద్ధాంతాలు తమ జీవనశైలికి అన్వయంకాక సతమతం అయినవారు ఉన్నారు. మోసాలకు గురైనవారు ఉన్నారు. విరక్తి చెందినవారు ఉన్నారు. దుఃఖితులైన మహిళలు, పురుషులు, పేదలు, ధనికులు, అవయవలోపాలు కలిగినవారు... ఇలా ఎందరో ఉన్నారు.
ఏసు ప్రసంగాలు కొండల్లో, కోనల్లో, పచ్చిక బయళ్ళలో, సముద్ర తీరాల్లోని ఇసుక తిన్నెల్లో సాగాయి. ఆయనను చూడడానికి, ఆయన మాటలు వినడానికి... ఆకలిదప్పులు మరచి జనం తండోపతండాలుగా ఎగబడేవారు. ఆయన ప్రసంగాలన్నీ దైవ రాజ్య స్థాపన గురించి, ప్రేమించడం గురించి, మన్నించడం గురించి, నిస్వార్థ సేవలు అందించడం గురించి, విమోచన గురించి, బైబిల్‌లో ప్రధాన సూత్రాలైన దైవారాధన, తోటి ప్రజల పట్ల ప్రేమ గురించి ప్రధానంగా సాగాయి. ఆయన కాంతి మార్గాన్ని, శాంతి మార్గాన్ని, సత్య మార్గాన్ని, ప్రేమ మార్గాన్ని ప్రజలకు అందించాడు. అవి లోకానికి ఆదర్శవంతమైనవి. నాటి నుంచి నేటి వరకూ ప్రతిరోజూ అవే బోధకులలో, విశ్వాసుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రజలను మేలుకొలుపుతున్నాయి. అత్యున్నతమైన జీవనానికి మార్గనిర్దేశం చేస్తున్నాయి.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News