వైఫల్యాలు దాటి శిఖరాగ్రానికి
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:15 AM
పదిహేడేళ్ల వయసులో చూసిన ‘ఎవరెస్ట్’ చిత్రం ఆమె ముఖచిత్రాన్ని మార్చేసింది. నాడు తన గదిలోని తెల్ల బోర్డుపై ‘ఎవరెస్ట్ 2026’ అని రాసుకుంది. సరిగ్గా ఐదేళ్లలో అనుకున్నది...
సంకల్పం
పదిహేడేళ్ల వయసులో చూసిన ‘ఎవరెస్ట్’ చిత్రం ఆమె ముఖచిత్రాన్ని మార్చేసింది. నాడు తన గదిలోని తెల్ల బోర్డుపై ‘ఎవరెస్ట్ 2026’ అని రాసుకుంది. సరిగ్గా ఐదేళ్లలో అనుకున్నది సాధించింది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి యువతరానికి ప్రేరణగా నిలిచిన 22 ఏళ్ల సానికా షా జర్నీ ఇది.
‘‘అవి లాక్‌డౌన్ రోజులు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చేసిన సందర్భం. అప్పుడు నాకు పదిహేడేళ్లు. టీవీలో ‘ఎవరెస్ట్’ సినిమా చూస్తున్నాను. 1996 పర్వతంపై జరిగిన విషాదం ఆధారంగా తీసిన చిత్రం అది. సినిమా పూర్తయ్యేసరికి నా ఆలోచనే మారిపోయింది. పర్వతారోహణపై విపరీతమైన ఆసక్తి కలిగింది. ఆ క్షణమే నా గదిలో ఉన్న తెల్ల బోర్డుపై రాసుకున్నా... ‘ఎవరెస్ట్ 2026’ అని. అమ్మానాన్నలకు చెబితే... వారు కూడా మద్దతునిచ్చారు. నాటి నుంచి నాకు అదొక్కటే లక్ష్యం.
చదువుకొంటూనే...
ఈశాన్య ముంబయిలోని ములుండ్ ప్రాంతం మాది. చిన్నప్పటి నుంచీ పర్వతారోహణతో పాటు సినిమాలపై కూడా మక్కువ. అందుకే ‘విజిలింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్’లో యాక్టింగ్ బీఏలో చేరాను. డిగ్రీ చదువుతూనే పర్వతారోహణలో కూడా శిక్షణ తీసుకున్నాను. మా అమ్మానాన్నలిద్దరికీ ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. వారు మారథాన్‌లలో కూడా పాల్గొంటారు. అమ్మ న్యూట్రిషనిస్ట్. నాన్న వ్యాపారవేత్త. నేను పాఠశాలలో మంచి అథ్లెట్‌ని. మంచు పర్వతాలంటే ఎప్పుడూ ఇష్టమే. కాకపోతే నేను కొంచెం బద్దకస్తురాలిని. శిక్షణకు ముందు ఉదయాన్నే లేవాలంటే కష్టంగా ఉండేది. ఎవరెస్టును అధిరోహిస్తానని ఏ రోజూ ఊహించలేదు. కానీ ఒకసారి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాక నాలో ఉత్సాహం ఉరకలు వేసింది.
ఐదేళ్ల శ్రమ...
శిక్షణ తరువాత అనుభవం కోసం ఇతర పర్వతాలు అధిరోహించడం మొదలుపెట్టాను. సన్నాహకాల్లో భాగంగా గత ఐదు నెలలుగా విశ్రాంతి అన్నది లేదు. రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేవడం, ఇరవై కిలోమీటర్లు పరుగెత్తడం, పదిహేను కిలోల బ్యాక్‌ప్యాక్‌తో హైకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం, జిమ్‌లో గడపటం. ఈ శిక్షణలో శారీరకంగా కంటే మానసిక దృఢత్వానికే అధిక ప్రాధాన్యం ఉంటుంది. దీనివల్ల నాకు నిలకడ, ఓర్పు అలవడ్డాయి. అన్నిటినీ త్యాగం చేయాల్సి వచ్చింది. కాలేజీ జీవితాన్ని ఆస్వాదించలేకపోయాను. స్నేహితులు పార్టీలు, షికార్లకు తిరుగుతుంటే... నేను మాత్రం శిక్షణలో గడిపేదాన్ని. ఒకవైపు చదువుకొంటూ... మరోవైపు పర్వతారోహణకు సన్నద్ధం కావడం అంత సులువు కాదు. అయితే నేను సాధించాల్సిన లక్ష్యం వీటన్నిటికీ అతీతమైనది. పెద్దది. దాన్ని మా అధ్యాపకులు అర్థం చేసుకుని, రెండిటినీ సమన్వయం చేసుకోవడంలో సహకరించారు.

విఫలమైనా వదల్లేదు...
గత సంవత్సరం దక్షిణ అమెరికాలోని ఎత్తయిన శిఖరం అకోన్‌కాగ్వాతో పాటు మరో రెండు ఇతర పర్వతారోహణల్లో విఫలమయ్యాను. ఆ వైఫల్యాలను జీర్ణించుకోవడం కాస్త కష్టమనిపించినా, తిరిగి పుంజుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మరింత పట్టుదలగా ఎవరెస్టు యాత్రకు సిద్ధమయ్యాను. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం వైపు నా సాహస యాత్ర ప్రారంభమైంది. మే 20... ఉదయం పదకొండున్నర... ఎవరెస్ట్ శిఖరాగ్రాన... సముద్ర మట్టానికి 8,848 అడుగుల ఎత్తులో నిలబడ్డాను. ఆ క్షణం భావోద్వేగాలను నియంత్రించుకోలేక పోయాను. ఇక్కడ నిలబడటానికి నేను ఐదేళ్లు నిరీక్షించాను. నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆనందంతో గుండె ఉప్పొంగింది. కుటుంబానికి దూరంగా నలభై రోజులు... కష్టానికి తగిన ఫలితం దక్కిందన్న సంతృప్తి. సాధించానన్న గర్వం. నా విజయం నా సినీ ప్రయాణానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను ఒక అథ్లెట్‌ను, కళాకారిణి కావడం కూడా నా కెరీర్‌కు కలిసి వస్తుందని అనుకొంటున్నాను. ముఖ్యంగా నా కథ నాలాంటి యువతరంలో ప్రేరణ నింపుతుందని ఆశిస్తున్నాను.’’
అమ్మకు వందనం...
శిఖరానికి చేరుకోగానే ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఎవరెస్ట్ పర్వత దైవిక స్వరూపమైన సాగర్‌మాతా దేవికి నమస్కరించాను. ఇది నాకు ఒక పర్వతారోహణ మాత్రమే కాదు... ఆధ్యాత్మిక ప్రయాణం కూడా. నాకు భరతనాట్యంలోనూ ప్రవేశం ఉంది. బేస్‌క్యాం్‌పలో జరిగిన పూజా కార్యక్రమంలో సాగర్‌మాతకు నైవేద్యంగా భరతనాట్యం ప్రదర్శించాను. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలను చూసిన కొందరు నృత్యకారులు నా నాట్యం లయబద్దంగా లేదని విమర్శించారు. గమనించాల్సింది ఏమిటంటే... అది నాకు అంకితభావం, భావోద్వేగాలకు సంబంధించినది. బేస్ క్యాంప్ నుంచి శిఖరాగ్రానికి చేరుకోవడానికి నాకు పన్నెండు గంటల సమయం పట్టింది. గడ్డకట్టే చలి... ఊపిరి అందని పరిస్థితి... శారీరక బలం ఒక్కటే సరిపోదు. మనోధైర్యం కూడా కావాలి. సాగర్‌మాతను ప్రార్థిస్తూ అడుగులు వేశాను.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News