Share News

సృష్టి మీదే... శక్తి మీరే

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:08 AM

మహిళల ఉన్నతి కోసం, సాధికారత కోసం అహర్నిశలు తపించి, ఆ దిశగా అపూర్వమైన కృషి చేసిన ఆధ్యాత్మికవేత్త శ్రీమాతాజీ నిర్మలాదేవి. సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర, వారి బాధ్యతల...

సృష్టి మీదే... శక్తి మీరే

సహజయోగ

మహిళల ఉన్నతి కోసం, సాధికారత కోసం అహర్నిశలు తపించి, ఆ దిశగా అపూర్వమైన కృషి చేసిన ఆధ్యాత్మికవేత్త శ్రీమాతాజీ నిర్మలాదేవి. సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర, వారి బాధ్యతల గురించి ఎన్నో సందర్భాలలో ఆమె ప్రసంగాలు చేశారు. 1995లో బీజింగ్‌లో నిర్వహించిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సులో చైనా ప్రభుత్వం ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె చేసిన ప్రసంగం చిరస్మరణీయమైనది. అందులోని ప్రధానాంశాలు...

‘‘యావత్‌ ప్రపంచ చరిత్రలోనే ఉత్కృష్టమైనది ప్రస్తుత కాలం అయినప్పటికీ... మహిళల సమస్యల గురించి ఇంత చైతన్యం ఉందని నేను ఊహించలేదు. మానవ సమాజంలో మహిళల సముచిత పాత్రను, ప్రాధాన్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేదు. దీనివల్లనే ఎన్నో ఏళ్ళపాటు సమస్త మహిళాజాతి అనేక బాధలకు లోనయింది. మహిళలు సృష్టించిన సమాజమే వారి అణచివేతకు, వారిపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తోంది. ప్రతి దేశానికి, నాగరికతకు అంతర్గత శక్తి మహిళలే. వారే సమస్త మానవజాతి నిర్మాతలు, సంరక్షకులు అనేది నిర్వివాదాంశం. ఇది సర్వరక్షకుడైన భగవంతుడు వారికి ఇచ్చిన పాత్ర. విత్తనాలు వాటంతట అవే వేటినీ సృష్టించలేవు. భూమాత ఎంతో ఒత్తిడిని భరిస్తూ వాటిని వికసింపజేసి, ఫలాలను, పుష్పాలను లోకానికి అందిస్తుంది. అదే విధంగా మహిళ శిశువుకు జన్మను ఇస్తుంది, పెంచి, పోషించి, రేపటి పౌరునిగా తీర్చిదిద్దుతుంది. మనం రోజూ వివిధ మాధ్యమాలలో ఎన్నో హింసాత్మకమైన, అనైతికమైన కార్యక్రమాలు చూస్తున్నాం. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద పడి... సమాజం నాశనమవుతోంది. అవినీతి, లంచగొండితనం, హింసలకు దూరంగా... పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్న పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లుల పెంపకమే కీలకం.


సమతుల్య స్థితి కోసం...

మహిళ తనకు ఉన్న శక్తిని గుర్తించినట్టయితే... ఈ ప్రపంచాన్ని సుందరంగా మార్చగలదు. ఆమె కావాలనుకుంటే పురుషులకన్నా ఎక్కువగా పని చేయగలదు. అయితే హుందాతనంతో, చక్కటి అవగాహనతో, వాత్సల్యంతో ఉంటూ, తనలోని శక్తులను గౌరవించుకుంటూ శాంతిని నెలకొల్పడం, సమాజానికి కవచంలా రక్షణ కల్పించడం మహిళల బాధ్యత. మరి దీనికోసం అవసరమైన సమతుల్య స్థితిని వారు ఎలా సాధించాలి? మన పరిణామ క్రమంలో భాగంగా, ఆధ్యాత్మికమైన ఉన్నతి కోసం దోహదపడం కోసం... మన వెన్నెముక చివరిలోని త్రిభుజాకారపు ఎముకలో (సాక్రమ్‌ బోన్‌) విశిష్టమైన దైవశక్తి ఉంది. దానినే ‘కుండలినీ’ అంటారు. ఆ శక్తిని జాగృతమయినప్పుడు... ఊర్ధ్వముఖంగా పైకి లేచి, ఆరు శక్తి కేంద్రాల ద్వారా ప్రయాణించి... శిరస్సు మాడు లేదా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని... సహస్రారం దగ్గర సర్వ వ్యాపక శక్తి అయిన పరమాత్ముని ప్రేమతో మిమ్మల్ని కలుపుతుంది. ఆ దివ్య శక్తి మీలో ప్రవహించి మిమ్మల్ని ఉత్సాహవంతుల్ని చేస్తుంది. మీరు అత్యంత శక్తిమంతులుగా, కరుణ, దయ, శాంతి స్వరూపులుగా మారతారు. మీ వ్యక్తిత్వం సంపూర్ణంగా వికసిస్తుంది.’’

ఈ బోధనలను, సూచనలను శ్రీమాతాజీ నిర్మలాదేవి నిత్య జీవితంలో స్వయంగా పాటించారు, వాటి శక్తిని నిరూపించి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారు. సమాజంలో మోసపోయిన మహిళలు, బాలికల సంరక్షణ కోసం ఢిల్లీలో ‘విశ్వ నిర్మల ప్రేమ ఆశ్రమా’న్ని స్థాపించారు. రాబోయే కాలంలో తమకు ఎదురయ్యే సవాళ్ళను స్వతంత్రంగా ఎదుర్కొని, ఆనందమైన, గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే విధంగా వారు తయారు కావాలన్నదే శ్రీమాతాజీ ఆశయం.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 03:08 AM