అండాల నిల్వ ఆచితూచి..
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:42 AM
బ్యాంకులో దాచుకున్న డబ్బును నచ్చినప్పుడు తెచ్చుకుని వాడుకోవచ్చు. కానీ అండాలకు ఈ సూత్రం వర్తించదు. నచ్చినప్పుడు తెచ్చి వాడుకోడానికి అండాలు ఆరోగ్యంగానే ఉన్నా, వాటిని వినియోగించుకునే మహిళల...
ఎగ్ ఫ్రీజింగ్
గర్భాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలకు అండాల నిల్వ సౌలభ్యం ఎంతో బాగా ఉపయోగపడుతోంది. అయితే నిల్వ చేసుకున్న అండాలను ఎప్పటిలోగా వాడుకోవాలి? వాటికి కాల పరిమితి ఉంటుందా? వాటిని వినియోగించుకునే మహిళల వయో పరిమితి ఎంత? ఈ విషయాల గురించి వైద్యులేమంటున్నారు?
బ్యాంకులో దాచుకున్న డబ్బును నచ్చినప్పుడు తెచ్చుకుని వాడుకోవచ్చు. కానీ అండాలకు ఈ సూత్రం వర్తించదు. నచ్చినప్పుడు తెచ్చి వాడుకోడానికి అండాలు ఆరోగ్యంగానే ఉన్నా, వాటిని వినియోగించుకునే మహిళల శరీరాలు అందుకు సన్నద్ధంగా లేకపోవచ్చు. వయసు పైబడేకొద్దీ మధుమేహం, అధిక రక్తపోటు మొదలైన సమస్యలు పెరగడంతో పాటు గర్భధారణకు శరీరం సహకరించే అవకాశాలు క్షీణిస్తూ ఉంటాయి. కాబట్టి ఎగ్ ఫ్రీజింగ్‌ను ఆశ్రయించాలనుకునే ప్రతి మహిళా, ఆ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం వెనకున్న కారణాలను తరచి చూసుకోవాలి.
25 నుంచి 30 లోపే...
నిజానికి ఈ ప్రక్రియ అత్యవసరంగా అండాలను దాచుకోవలసిన అవసరం ఉన్న మహిళలకు ఉద్దేశించినది. పలు ఆరోగ్య కారణాల వల్ల, కుటుం బ కారణాల వల్ల, విద్య, వృత్తి జీవితాల కారణంగా తగినంత ఆర్థిక స్థోమత సాధించిన తర్వాతే గర్భం దాల్చలనుకునే మహిళలు, ఎగ్ ఫ్రీజింగ్‌ను ఎంచుకుంటూ ఉంటారు. క్యాన్సర్ చికిత్సలో అందించే రేడియేషన్, కీమోథెరపీల వల్ల మహిళల అండాశయల మీద ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత గర్భం దాల్చడానికి వీలుగా ఈ కోవకు చెందిన మహిళలు ముందస్తుగా అండాలను నిల్వ చేసుకోవడం ఉత్తమం. అయితే ఏ వయసులో అండాలను సేకరిస్తే, అండాలు ఆ వయసులోనే ఫ్రీజ్ అయి ఉండిపోతాయి. అండాశయాల నుంచి అండాలను సేకరించడానికి తగిన వయసు 25 నుంచి 30 సంవత్సరాలు. ముందు చెప్పుకున్న కారణాల వల్ల సదరు వయసు మహిళలు అండాలను నిల్వ చేసుకోవాలని నిర్ణయించుకుంటే, ఎగ్ ఫ్రీజింగ్‌ను ఆశ్రయించవచ్చు.
వీలైనంత త్వరగా వాడుకుని...
ప్రతి మహిళా పుట్టుకతోనే అండాలను వెంట తెచ్చుకుంటుంది. వయసు పైబడేకొద్దీ వీటి సంఖ్య, నాణ్యత క్షీణిస్తూ ఉంటాయి. 25 నంచి 30 ఏళ్ల వయసు మహిళల్లో అండాల నాణ్యత పతాక స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి ఈ వయసులో గర్భం దాల్చడం అత్యుత్తమం. అది సాధ్యపడని వాళ్లు అండాలను నిల్వ చేసుకోవాలనుకునేవాళ్లు కూడా ఈ వయసులోనే అండాలను సేకరించి నిల్వ చేసుకోవాలి. అయితే నిల్వ చేసుకున్న అండాలను నచ్చినప్పుడు వాడుకుని గర్భం దాల్చడానికి మహిళల శరీరాలు సహకరించకపోవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా 35 నుంచి 40 ఏళ్లలోపే వాటిని వాడుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా ఏ కారణాల వల్ల అండాలను నిల్వ చేసుకున్నారో, ఆ కారణాలను పరిష్కరించుకుని, వెంటనే గర్భధారణ ప్రక్రియను ఆశ్రయించాలి. అలా కాకుండా 40 అంతకంటే ఎక్కువ వయసులో నిల్వ చేసుకున్న అండాలతో గర్భధారణను ఆశ్రయిస్తే, గర్భం దాల్చినా, అధిక రక్తపోటు, మధుమేహం మొదలైన ఆరోగ్య సమస్యలతో గర్భం క్లిష్టం కావచ్చు.

అండాల నిల్వకు ముందు...
అండాల నిల్వకు కూడా మహిళలకు కొన్ని అర్హతలుండాలి. అధిక రక్తపోటు, మధుమేహం సమస్యలు అదుపులో ఉండాలి. స్కాన్, రక్తపరీక్షల ద్వారా అండాల నిల్వ ఎంత ఉంది? అన్నది నిర్థారించుకుని, ఇతరత్రా ఆరోగ్య సమస్యలేవీ లేవని నిర్థారించుకున్న తర్వాతే వైద్యులు అండాలను సేకరిస్తారు. కొందరికి పిసిఒడి, ఎండోమెట్రియోసిస్ సమస్యలుంటాయి. వీటిని చికిత్సతో సరిదిద్ధిన తర్వాత అండాల సేకరణ ప్రక్రియను మొదలుపెడతారు. అలాగే కొందరికి అండాలు తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇలాంటి వాళ్లకు సాధ్యమైనంత తర్వగా సేకరించిన అండాలతో గర్భం ధరించమని కూడా వైద్యులు సలహా ఇస్తారు. అండాల సేకరణ ప్రక్రియ సులభతరమైనది కాదు. ఐవిఎఫ్ సెంటర్లలో సాగే ఈ ప్రక్రియలో భాగంగా అండాల నిల్వను ఆశ్రయించిన మహిళకు ముందుగా హార్మోన్లను అందించి, ఎక్కువ అండాలు విడుదలయ్యేలా అండాశయాలను ప్రేరేపించవలసి వస్తుంది. తర్వాత స్కానింగ్ ద్వారా అండాల తయారీని నిర్థారించుకుని, చిన్న సర్జికల్ ప్రొసిజర్ ద్వారా అండాలను సేకరించి, మైనస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేస్తారు. ఆ తర్వాత ఎన్నేళ్లు దాచుకుంటారన్నది పూర్తిగా మహిళల ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది.
సహజసిద్ధ గర్భధారణ 30లోపే...
గర్భధారణ వయసు 30కు మించకుండా చూసుకోవాలి. అంతకంటే వయసు పైబడేకొద్దీ పుట్టబోయే బిడ్డకూ, తల్లికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. పెద్ద వయసులో పుట్టే పిల్లల్లో క్రోమోజోమ్ సంబంధిత సమస్యలు (డౌన్స్ సిండ్రోమ్) తలెత్తుతాయి. తల్లికి గర్భస్రావాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మూడో నెల గర్భంలో స్కాన్, రక్తపరీక్షలో బిడ్డకు క్రోమోజోమ్ సమస్యలున్నట్టు తేలినా, ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలినా, పరిస్థితిని కచ్చితంగా నిర్థారించడం కోసం ఉమ్మనీరు, ప్లాసెంటా కణజాల పరీక్ష చేయవలసి వస్తుంది. ఫలితం అధారంగా గర్భాన్ని కొనసాగించాలా, విరమించుకోవాలా అన్నది నిర్ణయించుకోవలసి వస్తుంది. పెద్ద వయసులో తల్లికి మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ వయసులో గర్భం దాల్చిన మహిళలు వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తగా మలసుకోవలసి వస్తుంది.
ఆరోగ్యం మీద దృష్టి పెట్టి...
అండాలను దాచుకోవాలన్నది మంచి ఆలోచనే! అయితే నిల్వ చేసుకోవాలని అనుకుంటున్న అండాలు ఆరోగ్యంగా, అసలు ఉన్నాయా, లేవా అన్నది తెలుసుకునేదెలా? ఇందుకోసం యుక్త వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారశైలి, జీవనశైలిని అనుసరించాలి. క్రమం తప్పక వ్యాయామం చేస్తూ, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఒత్తిడిని ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. నెలసరి మీద దృష్టి పెట్టాలి. అలాగే ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కొందర్లో ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ సమస్య అంతర్లీనంగా ఉండొచ్చు. వీరిలో అండాశయాల్లో అండాలు తయారు అవకపోవచ్చు. ఈ సమస్య పరీక్షల ద్వారానే బయటపడుతుంది. ఈ సమస్య ఉందని తెలుసుకోకుండా, 30 ఏళ్ల వయసులో పిల్లల కోసం వైద్యులను ఆశ్రయిస్తే, సమస్యను సరిదిద్దడం క్లిష్టం కావచ్చు. కాబట్టి 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి యువతి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, అవసరమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ, బరువును అదుపులో ఉంచుకుంటూ, పునరుత్పత్తి సామర్థ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
డాక్టర్ కామేశ్వరి సూరంపూడి
సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్,
ఫెర్నాండెజ్ హాస్పిటల్,
హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News