మామిడి పండ్లతో తియ్యటి రుచులు
ABN , Publish Date - May 30 , 2026 | 01:24 AM
వేసవిలో విరివిగా లభించే మామిడి పండ్లతో రకరకాల తీపి వంటకాలు యారుచేసుకోవచ్చు. వాటిలో అందరూ ఇష్టపడే విభిన్న రుచులు మీ కోసం...
వంటిల్లు
మామిడి పండ్లతో తియ్యటి రుచులు
వేసవిలో విరివిగా లభించే మామిడి పండ్లతో రకరకాల తీపి వంటకాలు యారుచేసుకోవచ్చు. వాటిలో అందరూ ఇష్టపడే విభిన్న రుచులు మీ కోసం...
మ్యాంగో సాగో డెజర్ట్
కావాల్సిన పదార్థాలు
ఫ మామిడి పండ్ల ముక్కలు- రెండు కప్పులు, సగ్గుబియ్యం- ఒక కప్పు, కండెన్స్‌డ్ మిల్క్- ఒక కప్పు, ఫ్రెష్ క్రీమ్- అర కప్పు, యాలకులు- రెండు, బాదం పలుకులు- కొన్ని, పిస్తా పలుకులు- కొన్ని, జీడిపప్పు పలుకులు- కొన్ని
తయారీ విధానం
ఫ సగ్గుబియ్యన్ని కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తరువాత స్టవ్ మీద రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగాక సగ్గుబియ్యం వేసి ఉడికించి నీళ్లు వడబోయాలి. ఈ సగ్గుబియ్యంలో చల్లటి నీళ్లు పోసి మరోసారి వడబోయాలి. మిక్సీలో ఒక కప్పు మామిడి పండ్ల ముక్కలు, కండెన్స్‌డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో ఉడికించిన సగ్గుబియ్యం వేసి కలపాలి. వెడల్పాటి గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసి సమంగా పరిచి పైన మామిడి పండ్ల ముక్కలు, బాదం-పిస్తా-జీడిపప్పు పలుకులు వేసి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ చిలకరించి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి. తరువాత ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేయాలి.
మ్యాంగో కోకోనట్ డిలైట్
కావాల్సిన పదార్థాలు
ఫ మామిడి పండ్ల ముక్కలు- రెండు కప్పులు, పచ్చి కొబ్బరి తురుం- రెండు కప్పులు, చక్కెర- అర కప్పు, యాలకులు- రెండు, పాల పొడి- అర కప్పు, ఎండు కొబ్బరి పొడి- పావు కప్పు, నెయ్యి- కొద్దిగా, పిస్తా పలుకులు- కొన్ని
తయారీ విధానం
ఫ మిక్సీలో మామిడి పండ్ల ముక్కలు, చక్కెర, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పచ్చి కొబ్బరి తురుం, కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత అందులో మామిడి గుజ్జు, పాలపొడి వేసి బాగా కలిపి మరో అయిదు నిమిషాలు మగ్గించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చిన తరువాత స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి. ఆపైన పిస్తా పలుకులు వేసి కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చుట్టాలి. ఈ లడ్డూలను ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పళ్లెంలో పెడితే ఎంతో రుచికరమైన మ్యాంగో కోకోనట్ డిలైట్ రెడీ..!
మ్యాంగో పుడ్డింగ్
కావాల్సిన పదార్థాలు
ఫ మామిడి పండ్ల ముక్కలు- రెండు కప్పులు, చక్కెర- ఆరు చెంచాలు, పాలు- నాలుగు చెంచాలు, కార్న్‌ఫ్లోర్- చెంచా
తయారీ విధానం
ఫ బ్లెండర్‌లో మామిడి పండ్ల ముక్కలు, పాలు, నాలుగు చెంచాల చక్కెర వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. చిన్న గిన్నెలో కార్న్‌ఫ్లోర్ వేసి కొన్ని నీళ్లు చిలకరించి ఉండలు రాకుండా జారుగా కలపాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో మామిడి గుజ్జు, కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుతూ దగ్గరకు వచ్చేదాకా చిన్న మంట మీద ఉడికించి దించాలి. స్టవ్ మీద మరో చిన్న గిన్నె పెట్టి అందులో రెండు చెంచాల చక్కెర వేసి కరిగించాలి. ఈ ద్రావణాన్ని వెడల్పాటి గిన్నెలో పోయాలి. దీనిపైన మామిడి-కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి సమంగా పరచాలి. ఈ గిన్నెను రెండు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తరువాత బయటికి తీసి పళ్లెంలో రివర్స్ చేయాలి. అంతే పిల్లలంతా ఇష్టపడే తియ్యటి మ్యాంగో పుడ్డింగ్ రెడీ..!
కిరణ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ చెఫ్,
కడలి రెస్టారెంట్
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News