గొంతులో ఆహారం అడ్డుపడితే... డిస్ఫేజియా!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:22 AM
మింగేటప్పుడు ఆహారం గొంతులో ఇరుక్కుపోయినట్టు అనిపించే సమస్యను వైద్య పరిభాషలో డిస్ఫేజియా అని అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో మంటతో కూడిన...
కౌన్సెలింగ్
డాక్టర్ గత కొన్ని రోజులుగా నా గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఉంటోంది. మింగడం కూడా కష్టంగా ఉంది. ఈ సమస్యను ఏమంటారు? దీనికి చికిత్స ఉందా?
- ఓ సోదరి, హైదరాబాద్
మింగేటప్పుడు ఆహారం గొంతులో ఇరుక్కుపోయినట్టు అనిపించే సమస్యను వైద్య పరిభాషలో డిస్ఫేజియా అని అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో మంటతో కూడిన యాసిడ్ రిఫ్లక్స్‌లో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. కానీ ఈసోఫీగల్ క్యాన్సర్‌లో కూడా ఇదే లక్షణం కనిపిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం అవసరం. మరీ ముఖ్యంగా ఘన, ద్రవ పదార్థాలు మింగేటప్పుడు ఇబ్బంది తలెత్తడం, ఆహారం గొంతులోనే ఇరుక్కుపోయినట్టు అనిపించడం, మింగే ప్రయత్నం చేసినప్పుడు గొంతులో నొప్పి, అసౌకర్యం కలగడం ఈ సమస్య ప్రధాన లక్షణాలు. కుటుంబ చరిత్ర, ఎండోస్కోపీ, మరికొన్ని పరీక్షల ద్వారా డిస్ఫేజియా అసలు కారణాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి.
జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో...
గొంతు నుంచి పొట్ట వరకూ పలు రకాల సమస్యల్లో డిస్ఫేజియా కనిపిస్తుంది. కొందరికి నరాల సమస్యతో కూడా ఈ రకమైన లక్షణం తలెత్తవచ్చు. ప్రధానంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ కారణాల వల్ల డిస్ఫేజియా తలెత్తినట్టు అనుమానం ఉన్న పక్షంలో గొంతులో ఇన్‌ఫెక్షన్ల మీద దృష్టి పెట్టాలి. సర్వసాధారణంగా కనిపించే సమస్య ఇది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా ఇదే లక్షణం కనిపించవచ్చు. పొట్టలో ఉండవలసిన ఆమ్లం, గొంతు లోపలకు తన్నుకొచ్చే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు, గొంతులో ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంది. దీంతో పాటు కొందర్లో అకెలేషియా కార్డియా అనే సమస్య కూడా తరచుగా కనిపిస్తూ ఉంటుంది.
సాధారణంగా ఆహారం తీసుకున్నప్పుడు అన్నవాహికకూ, పొట్టకూ మధ్య ఉన్న కండరాలు రిలాక్స్ కావాలి. అప్పుడే గొంతులోని ఆహారం సులభంగా పొట్టలోకి చేరుకుంటుంది. కానీ ఈ సమస్య ఉన్నవారిలో ఈ కండరాలు బిగుతుగా ఉండి ఆహారం మింగడం కష్టమవుతుంది. 25 నుంచి 35 ఏళ్ల వారిలో ఈ సమస్య ఎక్కువ. 40 నుంచి 50 ఏళ్ల వారిలో దీర్ఘకాలం పాటు యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్ వల్ల, అన్నవాహిక దారి ఇరుకైపోయి, ఆహారం మింగడం కష్టమైపోతుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో అకస్మాత్తుగా ఆహారం మింగడం కష్టమైతే, అన్నవాహికలో క్యాన్సర్ గడ్డలున్నట్టు అనుమానించాలి. అన్నవాహిక పొట్టలో కలిసే ప్రదేశంలో అల్సరు ఉన్నా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అయితే సమస్యకు కారణం ఏదైనా, మింగడంలో ఇబ్బంది తలెత్తిన వెంటనే వైద్యులను కలిసి, వ్యాధినిర్థారణ పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స తీసుకోవడం అవసరం.
- డాక్టర్ కె.ఎస్. సోమశేఖర్ రావు
సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
హైదరాబాద్.
ఇవి కూడా చదవండి...
కృష్ణా డెల్టాకు న్యాయం చేయాలనే పట్టిసీమ చేపట్టాం: సీఎం చంద్రబాబు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News