కడుపులో నొప్పి ఎందుకు?
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:56 AM
నొప్పి తలెత్తే ప్రదేశాన్ని బట్టి కడుపు నొప్పికి కారణాన్ని కనిపెట్టొచ్చు. తిన్న ఆహారం జీర్ణం అవకపోయినా, కలుషిత ఆహారం తిన్నా కడుపు నొప్పి తప్పదు. ఈ నొప్పుల్లో...
కౌన్సెలింగ్
డాక్టర్! తరచూ కడుపు నొప్పి వేధిస్తోంది. నొప్పికి కారణమేంటో తెలియడం లేదు. లక్షణాలను బట్టి నొప్పికి మూల కారణాన్ని కనిపెట్టే మార్గం ఉందా?
ఓ సోదరి, హైదరాబాద్.
నొప్పి తలెత్తే ప్రదేశాన్ని బట్టి కడుపు నొప్పికి కారణాన్ని కనిపెట్టొచ్చు. తిన్న ఆహారం జీర్ణం అవకపోయినా, కలుషిత ఆహారం తిన్నా కడుపు నొప్పి తప్పదు. ఈ నొప్పుల్లో రకాలున్నాయి. అవేంటంటే....
అసిడిటీ నొప్పి: మసాలాలు, పులుపు, కారాలతో కూడిన పదార్థాలు తినటం వల్ల అసిడిటీతో, పొట్టలో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి పొట్ట పైభాగంలో మొదలవుతుంది. కడుపు ఉబ్బరంతో పాటు, కొన్నిసార్లు పొట్టలో, కత్తితో పొడిచినంత విపరీతమైన నొప్పి కూడా రావొచ్చు. సాధారణంగా ఈ నొప్పి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతుంది. ఆ సమయంలో పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉప్పు, పులుపు, కారాలు తగ్గిస్తే అసిడిటీ తాలూకు నొప్పి తగ్గిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నా రెండు రోజులకు మించి నొప్పి వేధిస్తే, తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించాలి.
గాల్ బ్లాడర్ స్టోన్స్: గాల్ బ్లాడర్‌లో రాళ్లున్న వాళ్లు నూనె పదార్థాలు తిన్న వెంటనే కడుపులో నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి కుడి వైపు డొక్కలో మొదలవుతుంది. నొప్పి భరించలేనంత తీవ్రంగా ఉంటుంది. వాంతులు కూడా అవుతాయి. ఇలా గాల్‌బ్లాడర్‌లో రాళ్లున్న వ్యక్తులు నూనె పదార్థాలు తిన్నప్పుడు గాల్ బ్లాడర్ నుంచి రాళ్లు బయటకి రావటానికి ప్రయత్నిస్తాయి. దాంతో పొట్టలో నొప్పి మొదలవుతుంది. ఈ లక్షణం కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రతించి చికిత్స తీసుకోవాలి. గాల్ బ్లాడర్ వాపు, రాళ్ల పరిమాణం, కదలికలను బట్టి వైద్యులు మొదట యాంటీబయాటిక్స్, అవసరాన్నిబట్టి సర్జరీని ఎంచుకుంటారు.
పాంక్రియాటిక్ పెయిన్: ముఖ్యంగా మద్యపానం చేస్తూ ఆ సమయంలో నూనెతో కూడిన పదార్థాలు తినేవారికి ఈ నొప్పి వస్తుంది. పొట్ట మధ్య భాగంలో, పైన నొప్పి ఉంటుంది. పొట్ట నుంచి వీపులోకి కూడా నొప్పి ప్రసరిస్తుంది. పాంక్రియాస్ వెనక భాగంలో ఉంటుంది కాబట్టి వెల్లకిలా పడుకుంటే దాని మీద ఒత్తిడి పడి నొప్పి ఎక్కువవుతుంది. దాంతో రోగి బోర్లా పడుకోవటానికి ఇష్టపడతాడు. సాధారణంగా సెలైన్లు, యాంటీబయాటిక్స్‌తో ఈ నొప్పిని అదుపులోకి తేవొచ్చు. మద్యపానం మానేసి, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకుంటే పాంక్రియాస్ నొప్పిని నియంత్రించవచ్చు.
డాక్టర్. భవానీ రాజు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News