Share News

సమ్మర్‌లో సేదతీర్చే చల్లని సూప్‌లు

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:20 AM

ఎండాకాలంలో దాహార్తి తీర్చుకోవడానికి పండ్ల రసాలు, మిల్క్‌షేక్‌లు, కొబ్బరినీళ్లు, చెరుకు రసం ఇలా ఎన్నో రకాలు తాగుతూ ఉంటాం. వీటితోపాటు చల్లచల్లని సూప్‌లు...

సమ్మర్‌లో సేదతీర్చే చల్లని సూప్‌లు

వంటిల్లు

ఎండాకాలంలో దాహార్తి తీర్చుకోవడానికి పండ్ల రసాలు, మిల్క్‌షేక్‌లు, కొబ్బరినీళ్లు, చెరుకు రసం ఇలా ఎన్నో రకాలు తాగుతూ ఉంటాం. వీటితోపాటు చల్లచల్లని సూప్‌లు కూడా తాగితే అలసట తీరుతుంది. మనకు అందుబాటులో ఉన్నవాటితో సులువుగా తయారుచేసుకోగలిగే విభిన్నమైన సూప్‌ల వివరాలు మీకోసం...

రైస్‌ కంజి

కావాల్సిన పదార్థాలు

అన్నం- అర కప్పు, మంచి నీళ్లు- ఒక కప్పు, చిక్కటి పెరుగు- అర కప్పు, ఉప్పు- అర చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా, నూనె- చెంచా, ఆవాలు- పావు చెంచా, జీలకర్ర- పావు చెంచా, మినప గుండ్లు- అర చెంచా, కరివేపాకు- కొద్దిగా, పచ్చిమిర్చి- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, అల్లం తరుగు- చెంచా, ఇంగువ- చిటికెడు

తయారీ విధానం

  • మట్టి గిన్నెలోకి అన్నాన్ని తీసుకుని అందులో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తగా బ్లెండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో పెరుగు, ఉప్పు, అల్లం తరుగు వేసి బాగా కలపాలి.

  • స్టవ్‌మీద పాన్‌ పెట్టి నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, ఇంగువ, కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఈ పోపును అన్నం-పెరుగు మిశ్రమంలో వేసి కలపాలి. ఇలా తయారుచేసుకున్న రైస్‌ కంజిని కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.

చిల్డ్‌ మష్రూమ్‌

ట్రఫుల్‌ వెలౌటే

కావాల్సిన పదార్థాలు

మష్రూమ్స్‌- పావు కేజీ, వెన్న- రెండు చెంచాలు, కూరగాయలు ఉడికించిన నీళ్లు- ఒక కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌- పావు కప్పు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- అర చెంచా, ట్రఫుల్‌ ఆయిల్‌- చెంచా, కొత్తిమీర తరుగు- కొద్దిగా

తయారీ విధానం

స్టవ్‌ మీద పాన్‌ పెట్టి వెన్న వేసి కరిగించాలి. తరువాత ముష్రూమ్స్‌ ముక్కలు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. ఆపైన బ్లెండర్‌లో వేసి కూరగాయలు ఉడికించిన నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్‌ చేసి గిన్నెలోకి తీయాలి. అందులో ఫ్రెష్‌ క్రీమ్‌, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ సూప్‌ని గాజు బౌల్స్‌లో పోసి పైన ట్రఫుల్‌ ఆయిల్‌ వేసి కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేయాలి.


సమ్మర్‌ ఫ్రక్టోజ్‌ సిప్‌

కావాల్సిన పదార్థాలు

పుచ్చకాయ ముక్కలు- ఆరు కప్పులు, స్ట్రాబెర్రీ ముక్కలు- ఒక కప్పు, అవకాడో ముక్కలు- అర కప్పు, నిమ్మరసం- రెండు చెంచాలు, తేనె- రెండు చెంచాలు, పుదీనా ఆకులు- ఆరు, చల్లటి నీళ్లు- ఒక గ్లాసు, పింక్‌ సాల్ట్‌- చిటికెడు, ఐస్‌క్యూబ్స్‌- నాలుగు

తయారీ విధానం

బ్లెండర్‌లో పుచ్చకాయ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, అవకాడో ముక్కలు, పుదీనా ఆకులు, తేనె, నిమ్మరసం, పింక్‌ సాల్ట్‌ వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. తరువాత చల్లటి నీళ్లు పోసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఈ సూప్‌ని స్టయినర్‌ సహాయంతో పెద్ద గిన్నెలోకి వడబోయాలి. తరువాత సూప్‌ బౌల్స్‌లో పోసి ఐస్‌ క్యూబ్స్‌ వేసి స్ట్రాబెర్రీ స్లయిసెస్‌, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేయడమే.

నట్టీ కుకుంబర్‌ మింట్‌ సూప్‌

కావాల్సిన పదార్థాలు

కీరాలు- రెండు, చిక్కటి పెరుగు- రెండు కప్పులు, ఐస్‌ క్యూబ్స్‌- అయిదు, నట్స్‌- అర కప్పు (బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, వేరుశనగ గుండ్లు), పుదీనా ఆకులు- పది, వెల్లుల్లి రెబ్బలు- రెండు, ఆలివ్‌ ఆయిల్‌- మూడు చెంచాలు, నిమ్మరసం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, చిల్లీ ఫ్లేక్స్‌- రెండు చెంచాలు, చల్లటి నీళ్లు- ఒక గ్లాసు

తయారీ విధానం

  • కీరాలను శుభ్రంగా కడిగి తొక్క, తీసి మధ్యకు కోసి గింజలు తొలగించాలి. ఆపైన చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పుదీనా ఆకులు, వెల్లుల్లి రెబ్బలను కూడా సన్నగా తరగాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నట్స్‌ వేసి దోరగా వేయించాలి.

  • బ్లెండర్‌లో కీరా ముక్కలు, పెరుగు, పుదీనా ఆకుల తరుగు, వెల్లుల్లి తరుగు, వేయించిన నట్స్‌, నిమ్మరసం, ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు, ఐస్‌ క్యూబ్స్‌ వేసి చల్లటి నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. ఇలా తయారుచేసిన సూప్‌ని గ్లాస్‌ బౌల్స్‌లో పోసి పైన కొన్ని నట్స్‌, చిల్లీ ఫ్లేక్స్‌ చల్లి చల్లగా సర్వ్‌ చేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 05:20 AM