చదువే ఆస్తి
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:02 AM
నాన్న ఆటో డ్రైవర్... అమ్మ రోజు కూలీ. తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు చూసి ఆమె చలించిపోయింది. పేదరికం దాటి కుటుంబం కష్టాలు తీరాలన్నా... తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా....
సంకల్పం
నాన్న ఆటో డ్రైవర్... అమ్మ రోజు కూలీ. తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు చూసి ఆమె చలించిపోయింది. పేదరికం దాటి కుటుంబం కష్టాలు తీరాలన్నా... తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా... ఉన్నత విద్యే ఏకైక మార్గమని భావించింది. పుస్తకాలనే ప్రపంచంగా మార్చుకొని... దృఢ సంకల్పంతో అహర్నిశలూ శ్రమించింది. ఇటీవల జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో... ఏకంగా ఐదు బంగారు పతకాలు సాధించి... చదువే అతిపెద్ద ఆస్తి అని నిరూపించింది బేగంపేట నిఖిత. ఆమెతో ‘నవ్య’ మాటామంతి.
‘‘మనకు ఆస్తి పాస్తులు లేవు. మీరెంత చదివితే అంతవరకు చదివిస్తా. చదువే మీ ఆస్తి’ అని మా నాన్న ప్రభుగౌడ్ ఎప్పుడూ మాకు చెప్పేవారు. ఆ మాటలే నాలో స్ఫూర్తి రగిలించాయి. విద్య లేకపోతే జీవితం లేదనే సత్యాన్ని బోధించాయి. ఇంటికి పెద్ద కూతురుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి... చెల్లి శివాని, తమ్ముడు అభిరామ్‌కు ప్రేరణగా నిలవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం కాసల్ గ్రామం మాది. నేను అక్కడే పుట్టి పెరిగాను. అయితే ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పదిహేనేళ్ల కిందట మేం హైదరాబాద్‌కు వచ్చాం. నగర శివారు గండిగూడలో స్థిరపడ్డాం. మా నాన్న ఆటో నడుపుతారు. అమ్మ చంద్రకళ రోజు కూలీగా పని చేసేది. నేను ఇంటర్, డిగ్రీ పటాన్‌చెరులో చదివాను. డిగ్రీ తరువాత పీజీ ఎంట్రెన్స్ రాసి, ఉస్మానియా యూనివర్సిటీలో సీటు సంపాదించాను. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ర్టీలో చేరాను. చిన్నప్పటి నుంచి స్కూలుకైనా, కాలేజీకైనా నాన్న ఆటోలో తీసుకెళ్లేవారు. ఇప్పుడు కూడా పరీక్షలప్పుడు తనే వచ్చి ఆటోలో దిగబెడతారు.
మొదట్లో భయమేసింది...
పీజీలో చేరేవరకు నేను ఉస్మానియా వైపు ఎప్పుడూ రాలేదు. మా ఆర్గానిక్ కెమిస్ట్రీ తరగతి గదిలో నిజాం కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులే అధికం. వాళ్లు చాలా చురుగ్గా ఉండేవారు. ప్రొఫెసర్ చెప్పేవి వెంటనే పట్టేసేవారు. ప్రశ్నలు అడిగితే తడుముకోకుండా జవాబులు చెప్పేవారు. వాళ్లందరినీ చూశాక వెనకబడిపోతానేమో అని భయం వేసింది. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సబ్జెక్ట్‌పై శ్రద్ధ పెట్టాను. కొంతకాలానికి ఆ భయం పోయింది. నేను కూడా అన్నిటిలో ముందుండేదాన్ని. కాకపోతే ఇంటికి దూరంగా, వర్సిటీ హాస్టల్‌లో ఉండి చదువుకోవడం వల్ల కొన్నాళ్లు ఇబ్బంది పడ్డాను. అయితే లక్ష్య సాధనలో అలాంటివన్నీ అధిగమిస్తేనే అడుగు ముందుకు వేయగలమని అర్థం చేసుకున్నాను.
కళ్లముందు మెదిలేవి...
మా కుటుంబ నేపథ్యం తెలుసుకొని ప్రొఫెసర్ యాదగిరి సార్ నన్ను ఎంతో పోత్రసహించారు. ఎప్పటికప్పుడు నా సందేహాలను నివృత్తి చేసేవారు. సాయంత్రం క్లాస్‌లు అవ్వగానే ఐదున్నరకు హాస్టల్‌కు వెళ్లిపోయేదాన్ని. రాత్రి మూడు గంటలు, ఉదయం లేవగానే రెండు గంటలు చదువుకోవడం నా దినచర్యలో భాగం చేసుకున్నాను. కాలేజీ సమయంలో ఎక్కువగా ల్యాబ్‌ల్లో గడిపేదాన్ని. ఎందుకంటే థియరీ కంటే ప్రాక్టికల్స్ నాకు కష్టం అనిపించేవి. అయితే ఇక్కడి ల్యాబ్‌లో పరిశోధనకు సరైన పరికరాలు లేవు. సెంట్రల్ వర్సిటీ తరహాలో ల్యాబ్‌ను అభివృద్ధి చేస్తే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుంది. పీజీ వరకు నాకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్లు ఉండేవి కావు. సెకండ్ ఇయర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో సైనప్ అయ్యాను. కానీ చాలా అరుదుగా రీల్స్ చూసేదాన్ని. నా నేపథ్యం, నా కుటుంబ పరిస్థితులు ఎప్పుడూ కళ్లముందు మెదిలేవి. అందుకే సాధ్యమైనంత వరకు స్టడీ్‌సపైనే దృష్టి పెట్టాను.

అమ్మానాన్నలకు అంకితం...
వర్సిటీకి వచ్చిన కొత్తల్లో ఎంతో కంగారు పడ్డాను. ‘ఇక్కడ ఇమడగలుగుతానా? అనుకున్నది సాధించగలుగుతానా?’ అనే సందేహం కలిగేది. అలాంటి నేను ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ర్టీలో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నాను. ఇటీవల జరిగిన ఉస్మానియా 85వ స్నాతకోత్సవంలో నేను ఐదు గోల్డ్ మెడల్స్ అందుకున్నాను. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పతకాలు తీసుకొంటున్న సమయంలో నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. వేదిక మీద నుంచి ఐదుసార్లు నా పేరు పిలవడం... నిజంగా ఇదంతా కలా నిజమా అనిపించింది. ఇదంతా చూసి మా అమ్మానాన్న భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విజయంలో వారి పాత్ర అమూల్యం. అందుకే ఈ పతకాలను వారితోపాటు పాఠశాలలో నన్ను ఎంతో ప్రోత్సహించిన శంకర్ సార్‌కు అంకితమిస్తున్నాను.’’
బయ్య దామోదర్
నమ్మకం ఉంచండి...
ఆర్గానిక్ కెమిస్ర్టీలో ఫస్ట్ ర్యాంకు రావడంతో ఇన్‌స్పైర్ ఫెలోషి్‌పకు ఎంపికయ్యాను. ఈ ఫెలోషిప్ పొందాలంటే పీహెచ్‌డీ అడ్మిషన్ రావాలి. ప్రస్తుతం దాని కోసం సన్నద్ధమవుతున్నాను. అలాగే ఆర్గానిక్ కెమిస్ర్టీలో పీహెచ్‌డీ చేసి, డాక్టరేట్ పొందాలనేది నా లక్ష్యం. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక్కటి చెప్పాలని అనుకొంటున్నా. మీ పిల్లలు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించండి. వారిపై నమ్మకం ఉంచండి. ఎవరో ఏదో అంటారని ఆలోచించవద్దు. సరైన మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అందుకొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు
ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News