ఆహారం వ్యవహారం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:17 AM
బరువు అదుపులో ఉండడడానికి తోడ్పడే సరళమైన సూత్రం సమతులాహారమే! తినకూడనివి పరిమితం చేసి, తినవలసినవి తింటే బరువు అదుపులో ఉంటుంది. అందుకోసం...
డైట్
బరువు అదుపులో ఉండడడానికి తోడ్పడే సరళమైన సూత్రం సమతులాహారమే! తినకూడనివి పరిమితం చేసి, తినవలసినవి తింటే బరువు అదుపులో ఉంటుంది. అందుకోసం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం!
చక్కెర చేటే!
చక్కెర...శరీరంలో నొప్పితో కూడిన వాపులు (ఇన్‌ఫ్లమేషన్), సోరియాసిస్, మొటిమలు, ఎగ్జీమా, చర్మం సాగిపోవడం లాంటి చర్మ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. చక్కెర వల్ల చర్మం అడుగున ఉండే కొల్లాజెన్ క్షీణించి, చర్మం సాగే గుణం కోల్పోతుంది. తెల్లని చక్కెర, బ్రౌన్ షుగర్, సుక్రలోజ్, మేపుల్ షుగర్, మొలాసిస్, తేనెలు మానేయాలి. బదులుగా పండ్లు ఎంచుకోవచ్చు.
ఇవి మానేయాలి
సరళమైన పిండిపదార్థాలు అతి త్వరగా సింపుల్ షుగర్స్‌గా మారిపోతాయి. ఇలా రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోకుండా ఉండాలంటే క్లిష్టమైన పిండిపదార్థాలు తినాలి. అందుకోసం చిలకడదుంపలు, గుమ్మడి, క్వినోవా లాంటి, ఇన్సులిన్ పెరగకుండా ఉంచే పిండిపదార్థాలనే ఎంచుకోవాలి.
హార్మోన్ల హెచ్చుతగ్గులు
హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా బరువును ప్రభావితం చేస్తాయి. అందుకు కారణాల గురించి తెలుసుకుందాం
ప్రొలాక్టిన్: ఈటింగ్ డిజార్డర్లు, అస్తవ్యస్థ థైరాయిడ్, కాలేయం పనితీరు గాడి తప్పడం, పిట్యుటరీ గ్రంథిలో కణుతులు ప్రొలాక్టిన్ అధిక విడుదలకు ప్రధాన కారణాలు. లక్షణాలను బట్టి వైద్యులను కలిసి చికిత్స తీసుకుని, ఈ హార్మోన్ స్రావాన్ని సరిచేసుకోవాలి.
ఎండోమెట్రియోసిస్: ప్రొజెస్టరాన్ హార్మోన్ తగ్గుదల కారణంగా ఎండోమెట్రియోసిస్ తలెత్తే వీలుంది. ఇందుకోసం ఈస్ట్రోజన్ హార్మోన్ ఉధృతిని తగ్గించే మందులు వాడి పరిస్థితిని అదుపు చేసుకోవచ్చు.
పిసిఒ, పిసిఒడి: చక్కెరకు ఫుల్‌స్టాప్ పెట్టి, పీచును పెంచి, అత్యల్ప గ్లైసెమిక్ ఆహారం తీసుకుంటూ, అత్యధిక మాంసకృత్తులు, ఒమేగా 3 కొవ్వులు తీసుకోవాలి. వ్యాయామం తప్పనిసరి.
శుద్ధి వద్దు
ప్రాసె్‌సడ్ ఫుడ్స్‌లో నిల్వ రసాయనాలు, కృత్రిమ రంగులు, రుచులు జోడించి ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం. ఎక్కువ మొత్తాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, చక్కెరలూ ఉంటాయి. కాబట్టి ప్యాకెట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటిలో ఇన్‌ఫ్లమేషన్‌కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని మరింత సున్నితంగా మార్చేసి, పలు రకాల అలర్జీలకు గురయ్యేలా చేస్తాయి. గ్లూటేన్ లేని ప్యాకెట్ ఫుడ్స్ పీచు లేని పిండిని కలిగి ఉంటాయి. గ్లూటేన్ లేని పదార్థాలు తినాలనకుంటే పాలిష్ పట్టని గోధుమలు, బియ్యం, క్వినోవా తినాలి. ప్యాకెట్లలో దొరికే చిప్స్, కేక్స్ మానేయాలి. వీటితో పాటు ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాలలో దొరికే శుద్ధి చేసిన నూనెలు (పొద్దుతిరుగుడు, వేరుసెనగ) కూడా మానేయాలి. ఇవన్నీ ఫ్రక్టోజ్, సుక్రోజ్, డెక్స్‌ట్రోజ్ చక్కెరల్లా, హార్మోన్ల పనితీరును దెబ్బతీసి స్థూలకాయులుగా మారుస్తాయి.
వాపులు, నొప్పులు
వ్యాధికి తొలి సూచనలు ఇవి. కీళ్ల నొప్పులు (ఆర్థ్రయిటిస్), హృద్రోగ సమస్యలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (విరేచనాలు), మధుమేహం, కొన్ని రకాల కేన్సర్లకు ఇవే ప్రధాన లక్షణాలు. తింటున్న పదార్థాలు సరిపడకపోతే పేగుల్లో వాపు మొదలవుతుంది. ఈ సమస్యే మున్ముందు హార్మోన్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి ఇన్‌ఫ్లమేషన్‌కు కలిగించే పదార్థాల్లో ప్రధానమైనవి.... చక్కెర, ఎర్రని మాంసం, గ్లూటేన్. మాంసం, చక్కెరలు చర్మపు పిహెచ్ విలువలను మార్చేస్తాయి. అంతే కాదు, పెద్ద పేగుల్లోని బ్యాక్టీరియానూ మారుస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ అదుపులో ఉండడం కోసం పొట్టు తీయని, పాలిష్ పట్టించని ధాన్యాలు, సేంద్రీయ కూరగాయలు, పళ్లు, పసుపు, బ్రక్కొలి, నిమ్మ ఎక్కువగా తినాలి.
లవణం నిషిద్ధం
ఆహారానికి రుచిని అందించడంతో పాటు నాడుల మధ్య ప్రసారాలు జరగడానికి, రక్తంలో చక్కెర స్థాయులు సమంగా ఉండడానికీ, హార్మోన్ల స్రావాలు క్రమం అవడానికీ ఉప్పు అవసరమే! అయితే మితిమీరిన ఉప్పు అనర్థాన్ని తెచ్చి పెడుతుంది. నిజానికి వైద్యులు రోజుకు 6 గ్రాముల ఉప్పునే తీసుకోమని సూచిస్తున్నారు. ఇది ఒక చెంచా కంటే తక్కువ. రోజుకు 13 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకునేవారు 6.8 గ్రాముల ఉప్పు తీసుకునే వారి కంటే ఎక్కువగా గుండె సమస్యల బారిన పడే ప్రమాదం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News