Share News

ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు అడ్డుకట్ట

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:38 AM

మన రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేసే పరిస్థితి ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌. ఈ రుగ్మత గురించిన అపోహలు వాస్తవాలు ఇవి...

ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు అడ్డుకట్ట

అవగాహన

మన రోగనిరోధక వ్యవస్థ మన శరీరం మీదే దాడి చేసే పరిస్థితి ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌. ఈ రుగ్మత గురించిన అపోహలు వాస్తవాలు ఇవి.

కొందర్లో ఆటోఇమ్యూన్‌ వ్యాధులు అ దే తరహా ఇతర వ్యాధులతో ముడిపడి ఉంటాయి. ఆ వ్యాధులన్నీ రోగనిరోధక వ్యవస్థ పని చేయకపోవడంతో పాటు, జన్యుపరమైన కారణాలతో ముడిపడి ఉంటాయి. ఉదాహరణకు టైప్‌1 డయాబెటిస్‌ ఆటో ఇమ్యూన్‌ థైరాయిడ్‌ సమస్యలతో లేదా సీలియాక్‌ వ్యాధితో ముడిపడి ఉంటుంది. ఇలా అవినాభావ సంబంధం కలిగి ఉండే రెండు విభిన్న రుగ్మతల సమస్యను ఆటోఇమ్యూన్‌ క్లస్టరింగ్‌ అని అంటారు. అలాగని ఈ రెండు సమస్యల్లో ఒకటి ఉన్నంత మాత్రాన రెండోది తలెత్తాలనే నియమమేమీ లేదు.

ఒక ఆటోఇమ్యూన్‌ వ్యాధి, మరొక ఆటోఇమ్యూన్‌ వ్యాధి పెరగడానికి సహాయపడుతుందా?

అవును. పలు రకాల ఆరోగ్య పరిస్థితులు, జన్యుపరమైన, వ్యాధినిరోధక సంబంధిత మార్గాలను పంచుకుంటాయి. కాబట్టి ఒక ఆటోఇమ్యూన్‌ వ్యాధి కలిగిన వాళ్లలో ఇంకొక ఆటోఇమ్యూన్‌ వ్యాధి తలెత్తే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ ముప్పు తీవ్రత... ఆరోగ్య పరిస్థితి, కుటుంబ చరిత్ర, పర్యావరణ అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధితో కచ్చితంగా మరొక వ్యాధి తలెత్తుతుందని అనుకోకూడదు.

ఆటోఇమ్యూన్‌ వ్యాధిలో జన్యువుల పాత్ర ఎంత? ఇది వంశపారంపర్యమా?

ఆటోఇమ్యూన్‌ వ్యాధుల్లో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఎక్కువ సందర్భాల్లో ఒకే ఒక జన్యువు కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. బహుళ జన్యు వైవిద్యాలు కూడా ఆటోఇమ్యూన్‌ వ్యాధులను ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాధులు కుటుంబ చరిత్రలో ఉన్నప్పుడు సంబంధీకులకు సంక్రమించే అవకాశం ఉన్నప్పటికీ వంశపారంపర్యంగా కచ్చితంగా సంక్రమించి తీరుతుందని అనుకోడానికి వీల్లేదు. పర్యావరణ మార్పులు, ఇన్‌ఫెక్షన్లు, హార్మోన్ల ప్రభావాలు, జీవనశైలి కూడా ఈ వ్యాధుల వృద్ధికి దోహదపడతాయి.

ఆటోఇమ్యూన్‌ వ్యాధులను శాశ్వతంగా నయం చేసే వీల్లేదా?

సంక్లిష్టమైన వ్యాధినిరోధక వ్యవస్థలో లోపాల మూలంగా రక్షణ యంత్రాంగం పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాల మీద దాడి చేస్తుంది. ఈ స్పందనను పూర్తిగా అణచివేస్తే, శరీరం వ్యాధికారక ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోతుంది. అదనంగా భిన్నమైన ఆటోఇమ్యూన్‌ వ్యాధులు, భిన్నమైన యంత్రాంగాలను, అవయవ వ్యవస్థలను కలిగి ఉంటాయి. కాబట్టి వ్యాధినిరోధకశక్తిని సన్నగిల్లేలా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్‌, బయొలాజిక్‌ థెరపీలు... ఇన్‌ఫ్లమేషన్‌, లక్షణాల నియంత్రణ, అవయవ నష్ట నివారణలతో పాటు వ్యాధి తిరగబెట్టకుండా నివారించే లక్ష్యంగా మాత్రమే పని చేస్తాయి.


వ్యక్తిగత చికిత్సలు లేదా జీన్‌ థెరపీతో ఫలితం ఉండదా?

శరీర తత్వం ఆధారంగా రూపొందించిన వ్యక్తిగత చికిత్సలతో ఈ వ్యాధులు కొంతమేరకు అదుపులోకొచ్చే వీలుంది. జన్యు పరీక్ష, బయోమార్కర్లు, ఇమ్యూన్‌ ప్రొఫైలింగ్‌ కూడా వ్యాధి మార్గాలను గుర్తించి టార్గెటెడ్‌ చికిత్సలకు సహాయపడతాయి. కార్‌టి థెరపీతో పాటు, జన్య చికిత్స, అడ్వాన్స్‌డ్‌ సెల్యూలర్‌ చికిత్సలను కూడా పరీక్షించడం జరుగుతోంది. అయితే ఈ చికిత్సలన్నీ పలు రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధుల పరిశోధనకే పరిమితమయ్యాయి.

ఆటోఇమ్యూన్‌ వ్యాధులను నియంత్రించే వీలుందా? ముప్పును తగ్గించే వీలున్న జీవనశైలి మార్పులు, ముందు జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా?

ఆటోఇమ్యూన్‌ వ్యాధులను నిలువరించే మార్గాలేవీ ఇప్పటివరకూ కనుగొనడం జరగలేదు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ వ్యాధుల ముప్పు నుంచి కొంతమేరకు రక్షణ పొందవచ్చు. ధూమపానం జోలికి వెళ్లకుండా, సమతులాహారం తీసుకుంటూ, క్రమంతప్పక వ్యాయామం చేస్తూ, బరువును అదుపులో ఉంచుకుం టూ, ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, సరిపడా నిద్రపోగలిగితే ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందే వీలుంది. ఈ వ్యాధుల కుటుంబ చరిత్ర కలిగినవారు లక్షణాల ఆధారంగా వీలైనంత త్వరగా వైద్యులను కలిసి, వ్యాధిని నిర్థారించుకోవడం అవసరం.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 04:38 AM