Share News

నాన్న స్ఫూర్తితో అక్షరార్చన

ABN , Publish Date - Nov 18 , 2026 | 05:13 AM

నాణ్యమైన చదువు అందరికీ అందాలనే ఆలోచన అర్చన జైసాల్‌ను పల్లె సీమల వైపు నడిపించింది.వందలాది మహిళకు టీచర్లుగా శిక్షణ ఇచ్చి ఆదాయ మార్గం చూపిన ఆమె....

నాన్న స్ఫూర్తితో అక్షరార్చన

నాణ్యమైన చదువు అందరికీ అందాలనే ఆలోచన అర్చన జైసాల్‌ను పల్లె సీమల వైపు నడిపించింది.వందలాది మహిళకు టీచర్లుగా శిక్షణ ఇచ్చి ఆదాయ మార్గం చూపిన ఆమె... వారి సాయంతో వేలాది పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య... పేదలు, సంపన్నుల మధ్య వ్యత్యాసాలు పోవాలంటే విద్యాపరమైన అంతరాలు తొలగాలంటున్న అర్చన అంతరంగమిది.

‘‘ప్రస్తుత సమాజంలో ఎవరైనా విద్యావంతులు కావడం అనేక అంశాల మీద ఆధారపడి ఉంటోంది. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు బాగా ఖర్చు పెట్టగలగాలి. విద్యాలయాల్లో మంచి టీచర్లు ఉండాలి. అక్కడ నేర్చుకోవడానికి తగిన వాతావరణం ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇవన్నీ అందని ద్రాక్షపండ్లే. బడికి దూరంగా, ఎలాంటి లక్ష్యం లేకుండా మిగిలిపోతున్న పిల్లలు కొందరైతే... ఏడో క్లాసో, ఎనిమిదో క్లాసో చదువుతున్నా ప్రాథమికమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని స్థితిలో మరికొందరున్నారు. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. తల్లిదండ్రులు పెద్దగా చదువుకున్నవారు కాకపోవడం వల్ల, ప్రైవేట్‌ కోచింగ్‌లో చేరే ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల చాలామంది హైస్కూలు దాటడం లేదు. వారికి నాణ్యమైన విద్యను అతి తక్కువ ఖర్చులో అందుబాటులోకి తేవడం ఎలా? అని ఆలోచించాను. 2022లో ‘యువర్‌ కోచింగ్‌’ పేరుతో ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. ‘‘బాగా చదువుకున్నావు. ఉద్యోగం చేసుకోకుండా ఎందుకీ ట్యూషన్లు?’’ అన్నారు నా సన్నిహితులు. ‘‘చదువు విలువేమిటో నాకు తెలుసు. అది జీవితాలను గొప్పగా తీర్చిదిద్దుతుందనడానికి మా నాన్న జగదీశ్‌ ఉదాహరణ’’ అని వారికి బదులిచ్చాను. ఎందుకంటే... నాన్న పడిన కష్టాన్ని కళ్ళారా చూశాను.

రిక్షా తొక్కి చదువుకున్నారు...

నేను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్‌లో పుట్టి పెరిగాను. మా నాన్న చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయారు. కుటుంబ పోషణ, మా మేనత్తల పెళ్ళి బాధ్యతలు నాన్న మీద పడ్డాయి. దాంతో రిక్షా కార్మికుడిగా మారారు. కానీ చదువును మాత్రం కొనసాగించారు. రిక్షా తొక్కుతూ, ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదివి, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. తోటి రిక్షా కార్మికుల ప్రోత్సాహంతో ఆర్‌ఆర్‌బీ రాసి... రైల్తే ఉద్యోగం సంపాదించారు. వారణాసిలో పోస్టింగ్‌ వచ్చింది. మేము అయిదుగురు అక్కచెల్లెళ్ళం, మాకొక సోదరుడు. తన కష్టాలు మాకు రాకూడదని, మమ్మల్ని బాగా చదివించాలని నాన్న ఎంతో ఆరాటపడ్డారు. ఉద్యోగం చేస్తూనే... అదనపు ఆదాయం కోసం బ్యానర్లు పెయింట్‌ చేసేవారు, బొమ్మలు గీసేవారు. ఆయన ప్రేరణతో మేము బాధ్యతగా చదివేవాళ్ళం. అంతా సజావుగా సాగుతున్న దశలో... నాన్న హఠాత్తుగా మరణించారు. మా అమ్మ పరిస్థితి బాలేకపోవడం, మేమంతా చిన్నవాళ్ళం కావడంతో కారుణ్య నియామకంలో ఉద్యోగం పొందలేకపోయాం. ఆ సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మా అక్క ఉద్యోగంలో చేరి... ఇంటిని నడిపించింది. మా చదువులు ఆగిపోకుండా చూసింది. నేను బెనారస్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తరువాత గ్రామీణ బాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలనే ఆశయంతో ‘యువర్‌ కోచింగ్‌’ను ప్రారంభించాను. దాన్ని 2023లో ‘శిక్షా సాథీ’ పేరుతో రిజిస్టర్‌ చేశాను.


4-navya.jpg

వంద రూపాయలకే...

వివిధ పాఠ్యాంశాల్లో పిల్లలకు పరిజ్ఞానాన్ని, అవగాహనను పెంచడానికి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఆంగ్లంలో ప్రావీణ్యం పెరగడానికి బడి తరువాత పిల్లలకు కోచింగ్‌ ఇవ్వడంతో ఈ ప్రయాణం మొదలయింది. ఒకటో తరగతి నుంచి ప్లస్‌ టూ వరకూ విద్యార్థులు చేరారు. వారి పురోగతిని గమనించిన తరువాత... మరింతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కోచింగ్‌ ఇవ్వాలని కోరడంతో... ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు దీనిద్వారా ఉపాధి కల్పించవచ్చు అనిపించింది.. అలా గత మూడేళ్ళలో 740 మంది గ్రామీణ మహిళలు, ఉత్సాహవంతులైన బాలికలు ‘శిక్షా సాథీ’ ద్వారా శిక్షణ పొందారు. ప్రస్తుతం మా సంస్థ కార్యకలాపాలు ఉత్తప్రదేశ్‌లోని వారణాసి, మీర్జాపూర్‌, ఘాజీపూర్‌, ప్రయాగ్‌రాజ్‌, మావూ, భదోనీ జిల్లాల్లో... 78 అభ్యసన కేంద్రాల ద్వారా నడుస్తున్నాయి. ఇప్పటిదాకా 7,700 మందికి పైగా విద్యార్థులకు కోచింగ్‌ ఇచ్చి, వారి సామర్థ్యాలను మెరుగుపరిచాం. చిన్న తరగతులకు వంద రూపాయలు, ఇంటర్‌ విద్యార్థుల నుంచి ఆరు వందల రూపాయలు ఫీజుగా తీసుకుంటున్నాం. ఆ మొత్తాన్ని కూడా కట్టలేని వారికి పూర్తి ఉచితంగా బోధన చేస్తున్నాం. పిల్లల్లో చదువంటే ఒకప్పుడు ఉండే భయాన్ని తొలగించడంలో, ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో విజయం సాధించామనే సంతృప్తి ఉంది. అలాగే... ఏకకాలంలో పిల్లలకు విద్యను, మహిళలకు ఆదాయాన్ని అందించగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బోధకుల్లో విద్యార్థినులు కూడా ఉన్నారు. తమ చదువులకు, ఖర్చులకు ఎవరిపైనా ఆధారపడనక్కర్లేకుండా వారు నెలకు ఆరేడు వేలు సంపాదిస్తున్నారు. అట్టడుగున ఉన్న వర్గాలకు చక్కటి చదువు, అవకాశాలు అందించడానికి మరింత కృషి చేయాలనేది నా ఆశయం. దీనికంతటికీ స్ఫూర్తి మా నాన్న జీవితమే. అందుకే... నాకు ఎప్పటికీ ఆయనే హీరో.’’

ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 05:15 AM