Share News

స్పేస్‌ మిషన్‌కు తెలుగు‘శక్తి’

ABN , Publish Date - Jul 25 , 2026 | 01:05 AM

‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఇచ్చిన ఈ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుంది కందుల జెస్సీ. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష రంగంపై...

స్పేస్‌ మిషన్‌కు తెలుగు‘శక్తి’

‘కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి’ మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ ఇచ్చిన ఈ సందేశాన్ని ఆదర్శంగా తీసుకుంది కందుల జెస్సీ. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అంతరిక్ష రంగంపై మక్కువతో... పేదరికం కుంగదీస్తున్నా, సరైన సదుపాయాలు లేకపోయినా పట్టు విడువకుండా పలు ప్రయోగాలు చేసి ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ఇటీవల ప్రతిష్ఠాత్మక ‘శక్తిశాట్‌-ఇంటర్నేషనల్‌ స్పేస్‌ మిషన్‌’కు ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఎంపికైన ఏకైక అభ్యర్థిగా నిలిచింది.

ప్రతిభకు ఏదీ అవరోధం కాదని చాటిచెప్పింది.

‘‘ఏదో ఒక సాకుతో ప్రయత్నం మానేస్తే వెనుకబడిపోతాం. ప్రతికూలతలను అనుకూలంగా మలచుకుంటూ ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధ్యమే. అది నా విషయంలో నిరూపితమైంది. మాది తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం. అక్కడి శ్రీమతి కస్తూర్బా గాంధీ జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. మా నాన్న శ్రీను వడ్రంగి పని చేస్తారు. అమ్మ అరుణ గృహిణి. నాన్న పనికి వెళ్లకపోతే పూట గడవని పేదరికం మాది. అద్దె ఇంట్లో, ఆర్థిక ఇబ్బందులతో రోజులు వెళ్లదీస్తున్నాం. కానీ నేను, మా అక్క షారోమ్‌ గ్రేసీ బాగా చదువుకోవాలని వారు ఎంతో తపన పడుతున్నారు. మా అక్క మా స్కూల్‌లోనే చదువుకొని... కడప ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయింది..

అంతరిక్షాన్ని అందుకున్నంత ఆనందం

నాకు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అన్నా, అంతరిక్ష రంగం అన్నా ఎంతో ఇష్టం. కానీ సొంతంగా ఏదైనా చేసే పరిస్థితులు మా ఇంట్లో లేవు. దాంతో... మా స్కూల్‌లో ఉన్న అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లోనే ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. వాటిని సైన్స్‌ ఫెయిర్స్‌లో ప్రదర్శించేదాన్ని. నేను రూపొందించిన స్మార్ట్‌ అగ్రికల్చర్‌ మానిటరింగ్‌ సిస్టం, స్మార్ట్‌ డస్ట్‌బిన్‌ స్టేటస్‌ మానిటరింగ్‌ సిస్టం లాంటివి బహుమతులు తెచ్చిపెట్టాయి. ‘శక్తిశాట్‌-ఇంటర్నేషనల్‌ స్పేస్‌ మిషన్‌’కు ఎంపికల కోసం గత ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. మా సైన్స్‌ టీచర్‌ మణిమాల ప్రోత్సాహంతో... మా స్కూల్‌ నుంచి 8 మందిమి నమోదు చేసుకున్నాం. దానికి సంబంధించిన ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి. 21 మాడ్యూల్స్‌లోని 550 వీడియో పాఠాలను చూసి, అవగాహన చేసుకొని... పరీక్షలు రాశాను. ఇంగ్లీష్‌ కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశాను. నేను నేర్చుకున్న అంశాలను వీడియోల రూపంలో పంపించాను. ఆ తరువాత దాదాపు గంట సేపు ఇంటర్వ్యూ జరిగింది. నా వ్యక్తిత్వం, నాలోని ప్రతికూలతలు, అనుకూలతలు లాంటి అంశాల గురించి నిశితంగా ప్రశ్నించారు. ఆ మరుసటి రోజు నేను ఎంపికైనట్టు సమాచారం అందింది. ‘శక్తిశాట్‌’కు 108 దేశాల నుంచి దాదాపు 12 వేలమంది రిజిస్టర్‌ అయ్యారు. మన దేశం నుంచి 21 మందిని ‘భారత్‌ టీమ్‌’గా ఎంపిక చేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికయింది నేనొక్కదాన్నే. అది తెలియగానే అంతరిక్షాన్ని అందుకున్నంత ఆనందం కలిగింది. ఏపీ విద్యా మంత్రి లోకేష్‌ కూడా ప్రశం సించారు.


వారిద్దరినీ కలిస్తే...

ఆగస్టు 21 నుంచి 31 వరకూ గ్రేటర్‌ నోయిడాలోని ‘గౌతమ బుద్ధ యూనివర్సిటీ’లో మాకు ప్రత్యేక తర్ఫీదు ఉంటుంది. వివిధ దేశాల విద్యార్థినులు దానిలో పాల్గొంటారు కాబట్టి ఐడియా షేరింగ్‌ జరుగుతుంది. అలాగే... వచ్చే నెల 23వ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఆ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం. ఆ సందర్భంగా ఒక వేడుక నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ కూడా వస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భోజనం చేసే అవకాశం ఉంటుంది. వారిద్దరినీ కలవడం నేను జీవితంలో మరచిపోలేని రోజుగా మిగులుతుంది. అలాగే ఉపగ్రహం తయారీలో నేను భాగస్వామిని కావడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది. అదే సమయంలో... ఇబ్బందులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నేను ఢిల్లీకి శిక్షణకు వెళ్లే సమయంలో... ఏవేవి తీసుకువెళ్లాలో సూచిస్తూ... ఒక జాబితాను ప్రాజెక్ట్‌ నిర్వాహకులు పంపించారు. వాటిలో ల్యాప్‌టాప్‌ కూడా ఉంది. దాన్ని సమకూర్చుకొనే స్తోమత మాకు లేదు. కనీసం మంచి ఫోన్‌ కూడా నాకు లేదు. ఢిల్లీ వెళ్లడానికి ఖర్చులు, ల్యాప్‌టాప్‌ ఎలా సమకూర్చుకోవాలో తెలియడం లేదు. దాతలు, ప్రభుత్వం సహకరిస్తే... దేశం గర్వించేలా మరిన్ని ఆవిష్కరణలు చేస్తాను.’’

రమేష్‌ నాగేంద్ర పలసల

రాజమహేంద్రవరం


4-Navya.jpg

శక్తిశాట్‌... ఒక వినూత్న ప్రయోగం

‘‘శక్తిశాట్‌’... ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’ నేతృత్వంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక చరిత్రాత్మకమైన ప్రపంచ స్థాయి అంతరిక్ష విద్యా కార్యక్రమం. అంతేకాదు, ఉపగ్రహ మిషన్‌ కూడా. ప్రపంచంలో ఉన్న బాలికల్లో సైన్సు, సాంకేతికత, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ విద్య (ఎస్‌టీఈఎం-స్టెమ్‌), అంతరిక్ష సాంకేతికతపై ఆసక్తిని, ప్రయోగాత్మక నైపుణ్యాలను పెంపొందించడం ఈ మిషన్‌ ముఖ్యోద్దేశం. శిక్షణ పొందిన విద్యార్థినుల భాగస్వామ్యంతో తయారు చేసిన పేలోడ్‌/ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టడం ఈ మిషన్‌ లక్ష్యం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రపంచ దేశాల విద్యార్థినులను ఏకం చేసే ఒక గొప్ప వేదికగా ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా ప్రాజెక్‌’్ట నిలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌ మొత్తం అయిదు దశల్లో ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా అంతరిక్ష సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. దాదాపు 120 గంటలపాటు 21 మాడ్యూల్స్‌లో ఉండే ఈ కోర్సులో శాటిలైట్‌ డిజైన్‌, ప్రొపల్షన్‌ సిస్టమ్స్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ పనితీరు, పేలోడ్‌ ప్రాసెసింగ్‌ లాంటి అంశాల్లో తర్ఫీదు ఉంటుంది. శిక్షణ ముగిసిన తర్వాత విద్యార్థినులు విభాగాల వారీగా తమ ఆలోచనలను పేలోడ్ల రూపంలోకి మారుస్తారు. ఎంపిక చేసిన ప్రతినిధి బృందాలు మన దేశానికి వచ్చి నిపుణుల సమక్షంలో ఉపగ్రహ పేలోడ్లను అసెంబుల్‌, ఇంటిగ్రేట్‌ చేస్తారు. మేము తయారు చేసిన పేలోడ్లను 8యూ క్యూబ్‌శాట్‌ లేదా ఆర్బిటల్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాట్‌ఫామ్‌ మీద అమర్చుతారు. దీనిలో శాటిలైట్‌ దిశను నియంత్రించే యాటిట్యూడ్‌ డిటర్మినేషన్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, రేడియేషన్‌ సెన్సార్లు, కెమెరాలు, డేటా ట్రాన్స్‌మిషన్‌ పరికరాలు ఉంటాయి. ప్రయోగానికి ముందు శాటిలైట్‌ వైబ్రేషన్‌, థర్మల్‌ వాక్యూమ్‌ టెస్టులను కూడా నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో సిద్ధమైన ‘శక్తిశాట్‌’ను ఇస్రోకు చెందిన పీఎ్‌సఎల్‌వీ రోదసీ నౌక ద్వారా అంతరిక్షంలోకి(ఆర్బిట్‌లోకి) ప్రవేశపెడతారు. మా ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత... సమాచారాన్ని సేకరించి, భూమిపై ఉన్న ‘గ్రౌండ్‌ స్టేషన్‌’కు పంపిస్తుంది. ఆ సమాచారాన్ని విద్యార్థినుల పరిశోధనలకు ఉపయోగిస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక సమస్యలపై దృ‌ష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన

అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 25 , 2026 | 01:05 AM