Share News

నువ్వు నా రెండో భార్యవన్నారు

ABN , Publish Date - Aug 13 , 2026 | 02:24 AM

సైనికుల ప్రాణాలకు భరోసా ఉండదు. అలాంటప్పుడు తాను లేని లోటును జీర్ణించుకుని, గుండె నిబ్బరంతో జీవితంలో ముందుకు సాగేలా జీవిత భాగస్వామిని సిద్ధం చేయడం అవసరం. కార్గిల్‌...

నువ్వు నా రెండో భార్యవన్నారు

జ్ఞాపకం

సైనికుల ప్రాణాలకు భరోసా ఉండదు. అలాంటప్పుడు తాను లేని లోటును జీర్ణించుకుని, గుండె నిబ్బరంతో జీవితంలో ముందుకు సాగేలా జీవిత భాగస్వామిని సిద్ధం చేయడం అవసరం. కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన స్క్వాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ అహూజా అదే చేశారని అంటున్నారు ఆయన సతీమణి అల్కా అహూజా. కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన అజయ్‌ అహూజా సభ్యుడిగా ఉన్న ‘గోల్డెన్‌ యారోస్‌’ బృందం పోరాటం ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’గా తెరకెక్కింది. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఈ సిరీస్‌లో అజయ్‌ పాత్రను హీరో సిద్ధార్థ్‌ పోషించారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తననొక దృఢమైన మహిళగా మలిచిన భర్త గురించి అల్కా పంచుకుంటున్న ఆసక్తికరమైన వివరాలివి....

‘‘ఆయన చనిపోయే నాటికి మా పెళ్లై పదేళ్లు. పెళ్లవగానే అజయ్‌ నాతో... ‘నువ్వు నా రెండో భార్యవి’ అని అన్నారు. అది విని నేను షాకయ్యాను. అప్పుడాయన నవ్వ్చుతూ తన మొదటి భార్య ఉద్యోగం (ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌) అని అన్నారు. ఆ మాట విన్నప్పుడు అంతటి దేశభక్తి కలిగిన వ్యక్తిని భర్తగా పొందినందుకు ఎంతో గర్వపడ్డాను. ఆ తర్వాత కాలం గడిచేకొద్దీ మాతృదేశం పట్ల ఆయనకున్న భక్తిశ్రద్ధలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను.

విధుల్లో భాగంగా రాత్రివేళల్లో గంటల తరబడి యుద్ధ విమానాలు నడిపేవారు. ఎక్కువ కాలం ఇంటికి దూరంగా గడిపేవారు. అయినా కుటుంబాన్ని కలిసినప్పుడు ఇంటిపట్టునే సమయం గడపడానికి ఇష్టపడేవారు. మా అబ్బాయిని ప్రతి ఆదివారం జూకు తీసుకువెళ్లేవారు. వంట చేసేవారు. పులావ్‌, దోశ లాంటివి వండి స్నేహితులకూ, కుటుంబసభ్యులకూ తినిపించేవారు. నాతో, బాబుతో కలిసి బ్యాడ్మింటన్‌ ఆడేవారు. అయినా ఆయన తొలి ప్రాధాన్యం భారతదేశమే! వృత్తిలో ఎదురయ్యే సవాళ్లు, ముప్పుల గురించి ఆయనకు అవగాహన ఉంది. ఎప్పుడేదైనా జరగవచ్చని ఆయనకు తెలుసు. అందుకే నన్ను అన్నిటికీ సిద్ధం చేయాలనుకున్నారు.


  • చదివించి, తీర్చిదిద్ది...

నేను పూర్తిగా ఆయన మీదే ఆధారపడడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. పెళ్లికి ముందు నేనెంతో అమాయకంగా ఉండేదాన్ని. ఇంటర్‌ వరకే చదివాను. దాంతో పెళ్లయ్యాక నా చేత బిఎస్సీ, బిఇడి చదివించారు. బోధనా వృత్తిలోకి ప్రోత్సహించారు. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో ఉండేవాళ్లం కాబట్టి ఆయన కుటుంబానికి దూరంగా పని చేయవలసి వస్తూ ఉండేది. దాంతో అజయ్‌ నన్ను స్వయంగా బాధ్యతలన్నీ నెరవేర్చగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలా ప్రోత్సహించేవారు. ఆయనెందుకు నన్నలా పోత్రహించారో ఆయన మరణం తర్వాత అర్థమైంది. అప్పటికి మా అబ్బాయికి ఐదేళ్లు. అజయ్‌ తోడ్పాటు లేకుండా వాడిని చదివించి, కెరీర్‌ను తీర్చిదిద్దగలిగానంటే అందుకు కారణం అజయ్‌ అని చెప్పక తప్పదు. నిజానికి ఆయన మరణం నాకొక శరాఘాతం. ఊహించని ప్రమాదాలు పొంచి ఉండే వృత్తి అనే విషయం తెలిసినా, ఆ ప్రమాదం ఆయనకు కూడా ముంచుకు రావచ్చని ఊహించలేకపోయాను. అదంతా ఎంతో వేగంగా జరిగిపోయింది.

  • పుట్టిన రోజుకు ముందే...

అహూజా, 1999 మే 18న బయల్దేరి వెళ్లారు. తర్వాత నాలుగు రోజులకే ఆయన పుట్టిన రోజు. కాబట్టి మే 22న తిరిగొస్తారని అనుకున్నాను. కానీ పుట్టిన రోజు నాడు ఆయన నాకు కాల్‌ చేసి, ఆ రోజు రాలేకపోతున్నట్టు చెప్పారు. తర్వాత బాబును వెంట బెట్టుకుని శ్రీనగర్‌ రమ్మనీ, అక్కడ మమ్మల్ని కలుస్తాననీ అన్నారు. దాంతో మా అబ్బాయి వాళ్ల నాన్నగారిని చూడబోతున్నందుకు ఎంతో ఎగ్జయిట్‌ అయ్యాడు. కానీ మేం శ్రీనగర్‌ వెళ్లే అవకాశమే లేకుండా పోయింది. మే 23న శ్రీనగర్‌ వెళ్లే విమానాలను రద్దు చేశారు. ఎందుకో నేను వెంటనే అర్థం చేసుకోలేకపోయాను. విమానాలను రద్దు చేయడం నాకు చిత్రంగా అనిపించింది. మరుసటి రోజు సాయంత్రం నాలుగున్నరకు, స్టేషన్‌ కమాండర్‌ యూనిఫామ్‌లో మా ఇంటికొచ్చారు. ఎవరైనా అధికారి యూనిఫామ్‌లో ఇంటికొస్తే కీడును శంకించవచ్చని అంతకు ముందు అజయ్‌ నాకు చెప్పడం గుర్తుంది. ఆయనను చూడగానే నా గుండె బద్దలైపోయింది. జరగరానిది జరిగిపోయిందని అర్థం చేసుకున్నాను. ఏం జరిగిందని ప్రశ్నించే ఽధైర్యం కూడా చేయలేకపోయాను. అజయ్‌ విమానంలో నుంచి ఎజెక్ట్‌ అయ్యారనీ ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ తెలియలేదనీ ఆ అధికారి చెప్పారు. అది విన్న తర్వాత ధైర్యం కోల్పోకూడదని అనుకున్నాను. సాయంత్రం నాలుగున్నరకు ఆయన విమానం నుంచి కిందకు దూకేశారు. అధికారి ఈ విషయాన్ని నాకు చెప్పేటప్పటికి చీకటి పడింది. ఆయన కొండ ప్రాంతంలో కిందకు దూకితే ఎవరైనా ఆయన్నెలా కనిపెట్టగలుగుతారు? ఆయన్నెలా రక్షించగలుగుతారు? ఇలా పలు ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టాయి. సాయంత్రం 7!30కు ఇద్దరు పైలట్లు విమానంలోంచి కిందకు దూకినట్టు, వాళ్లలో ఒకరు మాత్రమే సజీవంగా ఉన్నట్టు తెలిసింది. తర్వాత 8!30 ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి అజయ్‌ అనే విషయం తెలిసింది. ఆ చేదు నిజం తెలిసిన తర్వాత నా జీవితం మారిపోయింది.


1999, మే 27. బటాలిక్‌ సెక్టర్‌ మిషన్‌లో భాగంగా అహూజా, తన తోటి పైలట్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు. అకస్మాత్తుగా తన ముందు ప్రయాణిస్తున్న మిగ్‌ 27 మీద క్షిపణి దాడి జరగడంతో దాన్లో ప్రయాణిస్తున్న లెఫ్టినెంట్‌ కె.నచికెత కిందకు దూకేశాడు. దాంతో అతన్ని వెతకడం కోసం వెనకే ఆగిపోయారు అహూజా. ఆ క్షణమే మరొక క్షిపణి అహూజా నడుపుతున్న మిగ్‌ 21ను ఢీకొట్టింది. దాంతో తప్పనిసరి పరిస్థితిలో విమానం నుంచి కిందకు దూకేసిన అహూజా, పొరపాటున నియంత్రణ రేఖకు అవతలి వైపున ల్యాండ్‌ అయ్యారు. గాయపడిన అహూజాను అదుపులోకి తీసుకున్న శత్రుసైన్యం ఆయన్ను కిరాతకంగా పొట్టన పెట్టుకుంది. ఆయన మరణానంతరం ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది.

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 02:24 AM