వినికిడి విలువ తెలుసుకుందాం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:27 AM
పైబడే వయసులో వినికిడి శక్తి తగ్గడం సహజం. అలాగని ఆ సమస్యను అలాగే వదిలేయడం సరి కాదు. అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు, సలహాలు...
హియరింగ్ లాస్
పైబడే వయసులో వినికిడి శక్తి తగ్గడం సహజం. అలాగని ఆ సమస్యను అలాగే వదిలేయడం సరి కాదు. అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకుంటూ వైద్యుల సూచనలు, సలహాలు పాటించగలిగినప్పుడే, నాణ్యమైన జీవితం సాధ్యపడుతుంది.
శరీరంతో పాటు చెవులకు కూడా వయసు పైబడుతుంది. ఈ ప్రభావం 45 నుంచి 60 ఏళ్ల వయస్కుల్లో స్పష్టంగా బయల్పడుతూ ఉంటుంది. ఈ వయసులో నాడులు బలహీనపడి, కంటిచూపు తగ్గుతుంది. దాంతో ఏ పనికైనా చూపు అవసరం కాబట్టి వెంటనే కళ్లజోడు వాడుకోవడం మొదలుపెడతాం. కానీ వినికిడిని కాస్త నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మాటలు గందరగోళంగా ఉండడం, సరిగా వినిపించకపోవడం, వినిపించినా స్పష్టత లోపించడం లాంటి సమస్యలు ఈ వయసులో మొదలవుతాయి.
చెవుల మీద కన్నేసి...
50 ఏళ్లు పైబడినవాళ్లు తప్పనిసరిగా జనరల్ చెక్‌పతో పాటు చెవులు కూడా పరీక్ష చేయించుకోవాలి. మధుమేహులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, మూత్రపిండాల సమస్యలున్నవారు, రేడియో, కీమో థెరపీ తీసుకుంటున్నవారు, ఆటోఇమ్యూన్ వ్యాధులున్నవారు, ఫ్యాక్టరీలో బిగ్గర శబ్దాలకు బహిర్గతమయ్యేవారిలో చెవులు దెబ్బతిని, వినికిడిశక్తి తగ్గే ముప్పు ఉంటుంది కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు తప్పనిసరిగా చెవులు పరీక్ష చేయించుకోవాలి. పెద్ద వయసులో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తపు గడ్డల అవరోధాలు ఏర్పడినట్టే, చెవికి వెళ్లే రక్తనాళాల్లో కూడా రక్తపు గడ్డలు అడ్డుపడి వినికిడి శక్తి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఏడాదికోసారి చెవులు పరీక్షించుకుంటూ ఉండాలి.
అవసరం, సౌకర్యం ఆధారంగా...
వినికిడి లోపం పైబడే వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను సమూలంగా తొలగించే చికిత్స లేకపోయినప్పటికీ, అవసరాన్ని బట్టి వినికిడి మిషన్లను వాడుకోవాలి. బిహైండ్ ది ఇయర్, ఇన్ ది కెనాల్, రిసీవర్ ఇన్ ది కెనాల్, కంప్లీట్లీ ఇన్ ది కెనాల్, ఇన్ ది ఇయర్.. ఈ హియరింగ్ ఎయిడ్స్‌లో ఎవరికి వారు అవసరం, సౌకర్యం ఆధారంగా ఎయిడ్‌ను ఎంచుకోవాలి. కళ్లజోడు పెట్టుకోకపోతే మనకే ఇబ్బంది కాబట్టి తప్పకుండా జోడు పెట్టుకుంటాం. కానీ హియరింగ్ ఎయిడ్ మన కంటే పక్కవాళ్లకే ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి కళ్లజోడుకు ఇచ్చినంత ప్రాముఖ్యం హియరింగ్ ఎయిడ్‌కు ఇవ్వం. వినికిడి మిషన్ వాడుకునే ఎక్కువ మంది, దాన్ని అత్యవసరమైనప్పుడు వాడుకుంటూ మిగతా సమయాల్లో దాచుకుంటూ ఉంటారు. కానీ జీవితమంతా ఎప్పటిలాగే సౌకర్యంగా గడుపుతూ, ప్రతి పనిలో, ప్రతి విషయంలో ప్రమేయం కల్పించుకోవాలంటే వీటిని మన శరీరంలో భాగం చేసుకోవాలి.
హియరింగ్ ఎయిడ్ వాడకం
వయసు పైబడేకొద్దీ, హియరింగ్ ఎయిడ్ ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకపోయినా వినికిడి శక్తి క్రమేపీ తగ్గిపోతూనే ఉంటుంది. అలాగని ఈ పరికరాన్ని వాడుకోకుండా ఉండకూడదు. దీన్ని ఉపయోగించకపోతే.. కుటుంబసభ్యులతో, స్నేహితులతో కలవలేరు. మాటలు కలపలేరు. దాంతో కుటుంబంలోనే పరాయి వ్యక్తిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో మానసిక కుంగుబాటుకు లోనవుతారు. కంపెనీ యజమాని హోదాలో ఉన్నవారిలో పని సామర్థ్యం సన్నగిల్లుతుంది. అలాగే వినికిడి శక్తి కొంత మేరకు ఉన్నప్పుడే హియరింగ్ ఎయిడ్స్ పని చేస్తాయి. వినికిడి శక్తిని పూర్తిగా పోగొట్టుకుని, ఆ తర్వాత హియరింగ్ ఎయిడ్స్ మీద ఆధారపడాలి అనుకుంటే, అవి ఏ విధంగానూ ఉపయోగపడవు.

సమర్థ చికిత్సలున్నాయి
కొందరికి చెవిలో చీము కారుతూ ఉంటుంది. ఇలాంటప్పుడ వైద్యులను కలిసి కర్ణభేరిని మరమ్మతు చేయించుకుంటే, వినికిడిశక్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొందరికి చెవి లోపలి ఎముకల్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యను సర్జరీతో సరిచేయవచ్చు. దాంతో వినికిడి మెరుగు పడుతుంది. పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయిన వారికి సర్జరీతో కాక్లియర్ ఇంప్లాంట్ అమర్చి వినికిడిని తిరిగి తెప్పించవచ్చు.
నియంత్రణ ఇలా...
మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలి
అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారశైలితో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి
ఫ్యాక్టరీల్లో పెద్ద శబ్దాల మధ్య పని చేసేవారు, ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి
సాఫ్ట్‌వేర్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్, తరచూ చెవులకు విశ్రాంతినిస్తూ ఉండాలి
అవసరం ఉన్నా లేకపోయినా, రోజంతా ఇయర్‌పాడ్స్, ఇయర్‌ఫోన్స్ వాడేవారు త్వరగా వినికిడి శక్తి కోల్పోయే ముప్పు ఉంటుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవాలి
రోజు మొత్తంలో 60 డెసిబుల్స్ కంటే తక్కువ వినడం సురక్షితం. కాబట్టి రోజు మొత్తంలో ఎన్ని అడుగులు నడిచామో లెక్కించుకున్నట్టే రోజు మొత్తంలో ఎన్ని డెసిబుల్స్ విన్నామో లెక్కించుకుంటూ ఉండాలి
హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోకూడదు, చెవులకు విశ్రాంతి ఇవ్వాలి
ఈ పరీక్షలు కీలకం
ప్యూరిటోన్ ఆడియోమెట్రీ: తక్కువ, ఎక్కువ ఫ్రీక్వెన్సీలలో తలెత్తిన వినికిడి లోపాన్ని ఈ పరీక్షతో కనిపెట్టవచ్చు. 50 ఏళ్లు పైబడిన వాళ్లలో అధిక ఫ్రీక్వెన్సీల దగ్గర వినికిడి లోపం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా శబ్దం వినగలుగుతున్నా స్పష్టత లోపిస్తుంది
ఇంపిడెన్స్ ఆడియొమెట్రీ: పైబడే వయసులో కీళ్లు బిగుసుకుపోయినట్టే, మధ్యచెవిలో ఉండే మూడు ఎముకలు, వాటి జాయింట్లు కూడా బిగుసుకుపోతూ ఉంటాయి. ఫలితంగా చెవులు దిబ్బెడ పడినట్టు, వినికిడి తగ్గిపోతుంది. కండక్టివ్ హియరింగ్ లాస్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను సర్జరీతో సరిచేసుకోవచ్చు
స్పీచ్ ఆడియొమెట్రీ: ఈ పరీక్షతో వినికిడి మోతాదును తెలుసుకోవచ్చు
ఓటోఅకోస్టిక్ ఎమిషన్స్: ఈ పరీక్షతో, శబ్దానికి లోపలి చెవి స్పందించే తీరును తెలుసుకోవచ్చు
డాక్టర్ పివిఎల్‌ఎన్ మూర్తి
సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్‌టి,
స్టార్ హాస్పిటల్స్, బంజారా హిల్స్,
హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News