Share News

రామదూత... అభయదాత

ABN , Publish Date - May 08 , 2026 | 12:53 AM

శ్రీరాముని కథలో హనుమంతుడిది చాలా విశిష్టమైన పాత్ర. రాముని దాసుడైన హనుమంతుడు భక్తికి, శక్తికి ప్రతీకగా నిలుస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం... భగవంతుడికి, భక్తుడికి...

రామదూత...  అభయదాత

సహజయోగ

శ్రీరాముని కథలో హనుమంతుడిది చాలా విశిష్టమైన పాత్ర. రాముని దాసుడైన హనుమంతుడు భక్తికి, శక్తికి ప్రతీకగా నిలుస్తాడు. వారిద్దరి మధ్య ఉన్న బంధం... భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది. శ్రీరాముడికోసం కొండనైనా ఎత్తి తీసుకురాగలిగే శక్తి హనుమంతుడిది. హనుమంతుడికి ఇచ్చిన వరం కోసం... అతను చిటికెలు వేస్తున్నంతసేపు ఆవలింతలు తీసేంత ప్రేమ శ్రీరాముడిది. ఈ బంధం మన దేశ పౌరాణిక గాథలలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

వినయశీలి...

శ్రీరాముడి పట్ల హనుమంతుడి భక్తి ఎంత గొప్పదంటే... ఒకసారి సీతాదేవి ఒక ముత్యాలహారాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇచ్చింది. ఆ హారంలో ఉన్న ముత్యాలను ఒక్కటొక్కటిగా బయటకు తీసి చూసి ‘‘ఇందులో రాముడు లేడు. దీన్ని నేనేం చేసుకుంటాను?’’ అన్నాడు హనుమంతుడు. ‘‘మరి రాముడు ఎక్కడ ఉన్నాడు?’’ అని అడిగింది సీతాదేవి. ‘‘ఇదిగో... రాముడు ఇక్కడ ఉన్నాడు’’ అంటూ తన గుండెను చీల్చి చూపించాడు హనుమంతుడు. మన సూక్ష్మ శరీరంలో శ్రీరాముడి స్థానం కుడివైపు హృదయ చక్రంలో ఉంటుంది. ఎవరైతే శ్రీరాముని గుణాలను తమ దైనందిన జీవితంలో ఆచరిస్తూ, ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తారో... వారి హృదయ చక్రంలో శ్రీరాముడు కొలువై ఉంటాడు. అహంకారాన్ని వారి దరి చేరనివ్వడు. దీనికి ఉదాహరణ హనుమంతుడే. ఆయన ఎంత క్రియాశీలత కలిగి చురుగ్గా పనులు చేస్తూ ఉంటాడో... అంతటి వినయ విధేయతలు కూడా కలిగి ఉంటాడు. మనం కూడా పనులు ఎక్కువగా చేసేకొద్దీ... వినయవిధేయతలు కలిగి ఉంటేనే సమతుల్యతతో ఉండడం సాధ్యమని తెలుసుకుంటాం. ఎప్పుడైతే మన ద్వారా జరుగుతున్న పనులన్నీ మనమే చేసేస్తున్నామనే భ్రమలో చిక్కుకుంటామో.... అప్పుడు అహంకారం బారిన పడతాం. మన ద్వారా జరుగుతున్న పనులన్నిటినీ ఆ భగవంతుని శక్తే జరిపిస్తున్నదనే విషయం తెలుసుకొని, వినమ్రతను కలిగి ఉంటే... భగవంతుడి శక్తికి చక్కని వాహకాలుగా మారుతాం. మరిన్ని మంచి పనులు చేయగలుగుతాం.


భజే వాయువేగం...

హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... ఆయన ఏ పనినైనా చాలా వేగంగా చేస్తాడు. ఆయనది వాయువేగం. రాముడు తన సందేశాన్ని సీతాదేవికి పంపాలనుకున్నప్పుడు... తన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చి పంపిస్తాడు. ఎందుకంటే ఆ పనిని హనుమంతుడు చేయగలిగేంత వేగంగా శ్రీరాముడు చేయలేడు. అలాగే, సంజీవనీ మూలిక అవసరమైనప్పుడు.... అది ఒక ప్రత్యేకమైన పర్వతం మీద ఉంటుందని చెప్పి, దాన్ని తీసుకురావాలని హనుమంతుణ్ణి పంపించాడు శ్రీరాముడు. అక్కడికి వెళ్ళిన హనుమంతుడు ఆ మూలికకోసం వెతుకుతూ సమయం వృధా చేయడం ఎందుకని... మొత్తం పర్వతాన్నే తీసుకువచ్చేశాడు. ఏ పని చేసినా వెంటనే చేయడం, వేగంగా చేయడం, సమయాన్ని వృధా కానివ్వకపోవడం హనుమంతుడి లక్షణం. హనుమంతుడి ఆశీస్సులు పొందినవారికి ‘సత్‌-అసత్‌ వివేక బుద్ధి’ లభిస్తుంది. అంటే ‘ఏది సత్యం? ఏది అసత్యం?’ అని తెలుసుకోగలిగే వివేకం కలుగుతుంది. ‘ఏది మంచి? ఏది చెడు?’ అనే విచక్షణ కలిగిన మనిషి చెడు నుంచి దూరంగా ఉంటాడు, తనను తాను రక్షించుకోగలుగుతాడు. సన్మార్గంలో నడిచి ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతాడు. హనుమంతుడి గుణాలైన వినయ విధేయతలను, భక్తితో కూడిన శక్తిని దైనందిన జీవితంలో మనం కూడా అలవరచుకుంటే ఆయన అనుగ్రహాన్ని, శ్రీరాముడి కృపా కటాక్షాలను నిరంతరం పొందగలం.

మానవుల సూక్ష్మ శరీరంలోని పింగళా నాడి మొత్తాన్ని హనుమంతుడు ప్రభావితం చేస్తాడు. పింగళా నాడికే ‘సూర్య నాడి’ అనే మరో పేరు ఉంది. ఇది మానవులకు క్రియాశక్తిని ప్రసాదిస్తుంది. అంటే మానవులకు పనులు చేయడానికి కావలసిన శక్తి ఈ నాడి నుంచే లభిస్తుంది. కానీ పనులు ఎక్కువగా చేస్తూ, విశ్రాంతి తీసుకోవడం మరచిపోయినప్పుడు... ఆ నాడిలో వేడి ఎక్కువై అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుంది. మానవుల పింగళా నాడి మీద తాను పనిచేసి, అక్కడ అధికంగా ఉండే సూర్యతాపం నుంచి వారిని రక్షించి, చల్లదనాన్ని ప్రసాదించడం తన బాధ్యత అని హనుమంతుడికి ఆయన జన్మించే సమయానికే తెలుసు. అందుకే బాల్యంలోనే సూర్యుణ్ణి మింగెయ్యడానికి ప్రయత్నించాడు. దేవతలు ప్రార్థించడంతో... సూర్యుణ్ణి విడిచిపెట్టాడు.

డాక్టర్‌ పి. రాకేష్‌, 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ

నిర్మలాదేవి, సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 44 మందికి తీవ్ర అస్వస్థత

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

Read Latest National News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:53 AM