Share News

హజ్‌ తరువాత..!

ABN , Publish Date - May 29 , 2026 | 01:45 AM

హజ్‌ అనేది కేవలం ఒక యాత్ర కాదు. మనిషి జీవితాన్ని మార్చే పవిత్ర ప్రయాణం. హజ్‌కు వెళ్ళిన విశ్వాసులు తమ పాపాలన్నిటినీ ప్రక్షాళన చేసుకొనే అవకాశాన్ని, జీవితాన్ని కొత్తగా ఆరంభించే..

హజ్‌ తరువాత..!

సందేశం

హజ్‌ అనేది కేవలం ఒక యాత్ర కాదు. మనిషి జీవితాన్ని మార్చే పవిత్ర ప్రయాణం. హజ్‌కు వెళ్ళిన విశ్వాసులు తమ పాపాలన్నిటినీ ప్రక్షాళన చేసుకొనే అవకాశాన్ని, జీవితాన్ని కొత్తగా ఆరంభించే అదృష్టాన్ని పొందుతారు. మక్కా పవిత్ర నేలపై చేసిన తవాఫ్‌, అరాఫత్‌ మైదానంలో కార్చిన కన్నీళ్ళు, మదీనాలో ప్రవక్త సమాధి ముందు చేసిన సలాం... ఇవన్నీ వారి హృదయాల్లో శాశ్వతమైన ముద్రలు వేస్తాయి. కానీ హజ్‌ తరువాత జీవితం ఎలా ఉండాలి? అనేదే అసలు ప్రశ్న.

హజ్‌కు వెళ్ళడానికి ముందు ఎలా ఉన్నామో, ఆ తరువాత కూడా అదే విధంగా ఉంటే... ఆ యాత్ర ప్రభావం మన హృదయాల్లో పూర్తిగా పడలేదని అర్థం. మన మాటలను, నడవడికను, ఆలోచనలను, జీవన శైలిని మార్చడం, దైవంపై విశ్వాసం మరింత పెరగడం... ఇవీ హజ్‌ నుంచి పొందవలసిన ప్రయోజనాలు. ఈ యాత్ర తరువాత హృదయంలో అల్లాహ్‌ పట్ల భయం మరింత పెరగాలి. పాపం చేయాలనే ఆలోచనకే మనస్సు వణికిపోవాలి. అక్రమ సంపాదన, అబద్ధాలు, మోసాలు, వడ్డీల వసూలు, చాడీలు చెప్పడం లాంటి చెడ్డ పనులకు దూరంగా ఉండాలి. హజ్‌ యాత్రలో... తెల్లని వస్త్రాలతో ప్రార్థనకోసం నిలబడినప్పుడు ‘‘ఓ అల్లాహ్‌! నేను మరణించిన రోజున కూడా నిన్ను సంతోషపరిచే స్థితిలో ఉండేలా నన్ను కాపాడు’’ అని హృదయపూర్వకంగా అనుకోవాలి. హజ్‌ తరువాత జీవితం మరింత పవిత్రంగా మారాలి.


హజ్‌ సమయంలో అయిదు వేళల్లో సామూహికంగా నమాజ్‌ చేయడం జరుగుతుంది. మక్కా, మదీనాలలో అజాన్‌ (ప్రార్థనకు పిలుపు) వినగానే వేలాదిమంది మసీదుల దగ్గరకు పరుగులు పెడతారు. హజ్‌ నుంచి తిరిగి వచ్చాక కూడా అదే ఉత్సాహం కొనసాగాలి. ఫజర్‌ నమాజ్‌ కోసం లేచే అలవాటు చేసుకోవాలి. మసీదుతో బంధం బలపడాలి. ఖుర్‌ఆన్‌ పఠనం రోజువారీ అలవాటుగా మారాలి. ‘‘హజ్‌ చేసి వచ్చాం... ఇక అయిపోయింది’’ అనుకోకూడదు. ఆ తరువాత కొత్త జీవితం ఆరంభం కావాలి. నడవడికలో మార్పు చోటు చేసుకోవాలి. ఆ యాత్ర తరువాత కూడా కోపగించుకోవడం, దురుసు మాటలు, కుటుంబ కలహాలు, పొరుగువారితో గొడవలు ఉంటే... హజ్‌ మన హృదయాన్ని పూర్తిగా మార్చలేదని అర్థం.

హజ్‌ చేసిన వ్యక్తి వినయంగా ఉండాలి. చిన్నవారిని ప్రేమించాలి. పెద్దలను గౌరవించాలి. పేదలకు సాయపడాలి. బంధుత్వాలను కలుపుకోవాలి. అతని ముఖంలో వెలుగు, మాటల్లో మాధుర్యం, హృదయంలో కరుణ ఉండాలి. పాపాలకు పూర్తిగా దూరం కావాలి. నిష్టగా యాత్ర చేసిన మన పాపాలను అల్లాహ్‌ క్షమించాక... మళ్ళీ అదే పాపాలలో పడడం అనుచితం. కొందరు హజ్‌ నుంచి వచ్చాక కూడా పాత అలవాట్లను కొనసాగిస్తారు. ప్రలోభాలలో చిక్కుకుంటూనే ఉంటారు. ఇది హజ్‌ ఉద్దేశాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి హజ్‌ యాత్ర ముగించాక... ‘‘ఇప్పటి నుంచి నా జీవితం అల్లాహ్‌ కోసం’’ అనుకోవాలి. అల్లాహ్‌ ముందు అందరూ సమానమే. హజ్‌ యాత్రలో ఇది చాలా స్పష్టంగా కనిపించే అంశం. కాబట్టి ‘నేను ఎక్కువ’ అనే గర్వాన్ని కాకుండా వినయాన్ని పెంచుకోవాలి. ‘‘అల్లాహ్‌! నేను చేసిన హజ్‌ను ఆమోదించు. నా లోపాలను క్షమించు’’ అని వేడుకోవాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 29 , 2026 | 01:45 AM