Share News

Fever Awareness: జ్వరం జరభద్రం

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:38 AM

అన్ని రకాల జ్వారాల్లో ఒళ్లు వెచ్చబడినా, జ్వరంతో పాటు తలెత్తే భిన్నమైన లక్షణాల ఆధారంగా జ్వరం రకాన్ని కచ్చితంగా కనిపెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

Fever Awareness: జ్వరం జరభద్రం

అవగాహన

అన్ని రకాల జ్వారాల్లో ఒళ్లు వెచ్చబడినా, జ్వరంతో పాటు తలెత్తే భిన్నమైన లక్షణాల ఆధారంగా జ్వరం రకాన్ని కచ్చితంగా కనిపెట్టవచ్చు. అదెలాగో తెలుసుకుందాం!

జ్వరం వస్తే వైద్యులను కలవాల్సిందేనా?

జ్వరం...లో గ్రేడ్‌ (99.5 డిగ్రీలు) ఉంటే ఫర్వాలేదు. కానీ శరీర ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతూ 101 డిగ్రీలకు మించిపోయి పారాసిటమాల్‌ తీసుకుంటున్నా తగ్గుతూ, పెరుగుతూ, అదే పరిస్థితి రెండు రోజులపాటు కొనసాగితే వైద్యులను తప్పక సంప్రతించాలి. అలాగే జ్వరంతోపాటు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద ఎర్రని మచ్చలు, దగ్గు, జలుబు, తలనొప్పి, చలి మొదలైన లక్షణాలు కూడా ఉన్నా తీవ్రంగా పరిగణించి వైద్య సహాయం తీసుకోవాలి.

వైరల్‌ ఫీవర్‌

విపరీతమైన జ్వరంతోపాటు జలుబు, దగ్గు, తలనొప్పి, ఆయాసం, చమటలు పట్టడం ఉంటే వైరల్‌ ఫీవర్‌గా భావించాలి. ఒళ్లంతా ఎర్రటి మచ్చలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణం ఉంటే వైరల్‌ హెమరేజింగ్‌ ఫీవర్‌ అనుకోవాలి. ఈ జ్వరం తాలూకు వైరస్‌, దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

టైఫాయిడ్‌ ఫీవర్‌

జ్వరంతోపాటు కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు, కామెర్లు, గుండె కొట్టుకునే వేగం తగ్గడం ప్రధానమైన లక్షణాలు.

డెంగ్యూ

విపరీతమైన జ్వరంతోపాటు కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరిలో రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య త్వరితంగా పడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు విరేచరనం, మూత్రంలో రక్తం కనిపిస్తుంది. ముక్కులో నుంచి, లేదా దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తస్రావమవుతుంది. కొందర్లో పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఇది అంతర్గత రక్తస్రావానికి సూచన. తలనొప్పితోపాటు శరీరంలో ఒక వైపు పక్షవాతం లక్షణాలు కనిపిస్తే మెదడులో రక్తస్రావం అవుతున్నందుకు సూచనగా భావించాలి. ఇది ఎంతో తీవ్రమైన పరిస్థితి.


చలికాలం వేధించే జ్వరం

చలికాలంలో ఎక్కువమందిని బాధపెట్టే జ్వరం - ‘సైనసైటిస్‌ ఫీవర్‌’. జ్వరం, తలనొప్పి, జలుబు, ముందుకు వంగినప్పుడు తలనొప్పి ఎక్కువవడం, తల బరువుగా ఉండడం మొదలైన లక్షణాలు సైనసైటిస్‌ ఫీవర్‌లో కనిపిస్తాయి. సైనస్‌లు సున్నితంగా ఉన్నా, నాసికా ద్వారం వంకరగా ఉన్నా (డీవియేషన్‌ ఆఫ్‌ నాసల్‌ సెప్టమ్‌) తరచుగా జలుబు చేస్తూ, క్రమేపీ ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోయి సైనసైటిస్‌ ఫీవర్‌గా మారుతుంది.

మలేరియా

విపరీతమైన జ్వరంతోపాటు మత్తు, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, చూపులో తేడా ఉండడం, పలకరిస్తే స్పందించకపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకరోజు శరీర ఉష్ణోగ్రత చాలా తీవ్రంగా పెరిగిపోయి, మరుసటి రోజు తగ్గిపోవడం... మళ్లీ పెరిగిపోవడం.... ఇలా జ్వరంలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటే దాన్ని మలేరియా జ్వరంగా భావించాలి. మలేరియా ఫాల్సిఫారం లేదా వైవాక్స్‌ అనే రెండు రకాల జ్వరాలుంటాయి. వీటిలో ఫాల్సిఫారం తాలూకు మలేరియా మెదడుకూ పాకి ‘సెరెబ్రల్‌ మలేరియా’నూ కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 04:38 AM