Share News

ఫేస్‌బుక్కే షోరూమ్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:39 AM

ఒకటికి నాలుగు దుకాణాలు తిరిగి, పలు రకాల చీరలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా చీరల కొనుగోలు సాధ్యపడదు. కానీ కేవలం ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మహిళల నమ్మకాన్ని...

ఫేస్‌బుక్కే షోరూమ్‌

సంకల్పం

ఒకటికి నాలుగు దుకాణాలు తిరిగి, పలు రకాల చీరలను ప్రత్యక్షంగా పరిశీలించకుండా చీరల కొనుగోలు సాధ్యపడదు. కానీ కేవలం ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మహిళల నమ్మకాన్ని చూరగొంటూ, ఇప్పటివరకూ పది లక్షల చీరలను విక్రయించారు హైదరాబాద్‌కు చెందిన సంగీత రాజేష్‌. ఎనిమిదిన్నర లక్షల ఫేస్‌బుక్‌ ఫాలోవర్లను కలిగి ఉన్న సంగీత... ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘చీరల వ్యాపారంలోకి నా ప్రవేశం యాధృచ్చికంగానే జరిగిపోయింది. అంతకంటే ముందు రెమిడియల్‌ టీచర్‌గా పని చేశాను. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధకురాలిగా పని చేయడంతో పాటు సొంత స్కూళ్లను కూడా నెలకొల్పాను. ఆ స్కూళ్లలో స్పీచ్‌, బిహేవియరల్‌ థెరపీలను బోధిస్తూ, ఆ పిల్లలను సాధారణ బడులకు సిద్ధం చేస్తూ ఉండేదాన్ని. అది సేవాధారిత రంగం. పైగా ఫ్రాంచేజీలను నెలకొల్పడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎదుగుదల ఎలా సాధ్యపడుతుంది? అందుకే, నాకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలంటే, వినూత్నమైన ప్రయత్నానికి పూనుకోవాలని అనిపించింది. ఆ క్రమంలో ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను. అలా పదిహేనేళ్ల కిందట చీరల స్టోర్‌ మొదలుపెట్టాను. అప్పట్లో నాలాగే ఎంతోమంది మహిళలు ఈ రంగంలో ఉన్నారనే విషయం ఆలస్యంగా తెలిసింది. అలాంటప్పుడు వాళ్లందర్లో ప్రత్యేకంగా కనిపించడమెలా? అనే ఆలోచన మొదలైంది. దాంతో అవగాహన కోసం నిఫ్ట్‌లో కోర్సు పూర్తి చేశాను. చీరల డిజైనింగ్‌ మొదలుపెట్టాను. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌లో బిజినెస్‌ పేజీ అందుబాటులోకొచ్చింది.


వ్యూహాలు, ఆఫర్లతో ఆకట్టుకుని...

ఫేస్‌బుక్‌ బిజినెస్‌ పేజీని ప్రవేశపెట్టడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. చేనేత కళాకారుల దగ్గరకు వెళ్లి చీరల తయారీ వివరాలు సేకరించి, నేనే మోడల్‌గా మారి ఆ ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసేదాన్ని. క్రమేపీ వినియోగదారులు పెరగడం మొదలుపెట్టారు. అయితే చీరల నాణ్యత పట్ల వినియోగదారులకు నమ్మకం కలిగించడానికి ఎంతో కష్టపడవలసి వచ్చింది. వాళ్లను ఆకట్టుకోవడానికి మొదటి వంద కస్టమర్లకూ బహుమతులను అందించడం లాంటి వినూత్న ప్రయోగాలు ప్రారంభించాను. అలా నిలోఫర్‌ టీ పొడులు మొదలు, హెయిర్‌ క్లిప్పులు, బొట్టు బిళ్లల ప్యాకెట్లు, కుక్కర్లు లాంటి మహిళల మనసులను చూరగొనే ఆఫర్లను అందించాను. ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా చీరలను విక్రయించడంతో పాటు, మచిలీపట్నం, శ్రీకాళహస్తి, సూరత్‌, జైపూర్‌... ఇలా చీరలు తయారయ్యే ప్రాంతాలకు వెళ్లి, అక్కడి నుంచి లైవ్‌ షోలు చేస్తూ, ఆర్డర్లు తీసుకునేదాన్ని. అలా వ్యాపారం క్రమేపీ పుంజుకుంటున్న సమయంలో కొవిడ్‌ వచ్చింది. కొవిడ్‌, ప్రత్యక్ష వ్యాపారాలను దెబ్బతీసి ఉండొచ్చు. కానీ ఆ కాలంలో నా వ్యాపారం మరింత పుంజుకుంది.


00-Navya.jpg

నెలలో 15వేల చీరలు

ఒక లైవ్‌ సెషన్‌ నాలుగు నుంచి ఐదు గంటల పాటు కొనసాగుతుంది. విక్రయించే ప్రతి చీరనూ చూపించి, దాని ప్రత్యేకతలను వివరిస్తూ, వాట్సాప్‌ లింక్‌ ద్వారా అప్పటికప్పుడే విక్రయాలు జరుపుతూ ఉంటాను. ఒక లైవ్‌ షోలో 100 కాంచీపురం చీరలు విక్రయించిన సందర్భాలూ ఉన్నాయి. అలాగే గత నెలలో ఏకంగా ఒకటిన్నర కోట్ల ఖరీదైన 15 వేల చీరలను ఆన్‌లైన్‌లో విక్రయించాను. కొన్నిసార్లు చీరలు మిగిలిపోతూ ఉంటాయి. ఈ డెడ్‌స్టాక్‌ను పండుగ రోజుల్లో కేవలం కొరియర్‌ రుసుము తీసుకుని ఉచితంగా పంపించేస్తూ ఉంటాను. ఇలా వినియోగదారుల నమ్మకంతో పాటు అభిమానాన్ని చూరగొనగలిగాను. అలాగే ఒక చీర మాత్రమే చూపించి, దొంతరలోని ఏదో ఒక చీర కొనుక్కోండి అన్నప్పుడు, మహిళలు ఆసక్తి కనబరిచారు. ఈ ఆలోచన నాకు లబుబు టాయిస్‌ నుంచి వచ్చింది. బయటకు కనిపించే వీల్లేకుండా ప్యాక్‌ చేసి బొమ్మను విదేశాల్లో విక్రయిస్తూ ఉంటారు. ఉత్సుకత అనే సూత్రం ఆధారంగా వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చో గ్రహించాను. క్రమం తప్పకుండా బెంగుళూరు, విశాఖపట్టణం, కొయంబత్తూరు, చెన్నై, బెంగుళూరు, పూణె, ఢిల్లీ, ముంబయిల్లో చీరల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తుంటాను.


సవాళ్లు లేకపోలేదు...

ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆర్డర్లు తీసుకుని చీరలను విక్రయించడం చూడడానికి సులభంగా కనిపించవచ్చు. కానీ తెర వెనక ఎంతో కష్టం దాగి ఉంటుంది. గంటల తరబడి వినియోగదారులను ఎంగేజ్‌ చేయగలగాలి. వాళ్లకు ఓ పక్క వినోదాన్ని పంచుతూ ఆసక్తికరంగా చీరల గురించి వివరించగలగాలి. ఇదంతా ఒక ఎత్తైతే, చీరలను వినియోగదారులకు వీలైనంత త్వరగా అందించడం మరొక ఎత్తు. చీరల వ్యాపారం సులభతరమనీ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి అడుగుపెట్టి దెబ్బతింటూ ఉంటారు. వాళ్లకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎవర్నో చూసి మనం కూడా ఈ వ్యాపారం చేద్దామని అనుకోకూడదు. ఈ రంగంలో ఎదగాలనే బలమైన సంకల్పంతో పాటు టెక్స్‌టైల్స్‌, ఫ్యాబ్రిక్స్‌, మార్కెట్‌ గురించి అవగాహన పెంచుకొని, ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోగలగాలి.’’

గోగుమళ్ల కవిత

ఈ వార్తలు కూడా చదవండి..

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

భార్యను చంపేందుకు కుట్ర..! రెండు సార్లు ఫెయిలై.. మూడో ప్రయత్నంలో..

For More National News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 02:39 AM