Delcy Rodriguez Venezuela: వెనెజువెలా వ్యూహాల రాణి
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:26 AM
దక్షిణ అమెరికా రాజకీయ యవనికపై ఇప్పుడు కొత్తశకం ప్రారంభమైంది. వెనెజువెలా అధ్యక్ష భవనం ‘మిరాఫ్లోరెస్’ గోడలు ఒక సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి....
న్యూస్‌మేకర్
దక్షిణ అమెరికా రాజకీయ యవనికపై ఇప్పుడు కొత్తశకం ప్రారంభమైంది. వెనెజువెలా అధ్యక్ష భవనం ‘మిరాఫ్లోరెస్’ గోడలు ఒక సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకు తెరవెనక ఉండి చక్రం తిప్పిన డెల్సీ రోడ్రిగ్జ్ ఇప్పుడు దేశ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. వ్యవస్థలపై పట్టు సాధించి, రాజకీయ వ్యూహాలతో అధికార పీఠాన్ని దక్కించుకున్న డెల్సీ ప్రస్థానం ఒక థ్రిల్లర్ సినిమాను తలిపిస్తుంది.
డెల్సీ రోడ్రిగ్జ్.. ఇది ఒక పేరు మాత్రమే కాదు, నిశ్శబ్ద తుపాను. ఆమె తండ్రి జార్జ్ ఆంటోనియో రోడ్రిగ్జ్ వెనిజులాలో పేరున్న విప్లవనాయకుడు. ఆయన హత్యకు గురైనప్పుడు డెల్సీ చిన్నపిల్ల. ఆ చేదు జ్ఞాపకమే ఆమెను రాజకీయాలవైపు నడిపించింది. న్యాయశాస్త్రంలో పట్టాపొంది, పారి్‌సలో ఉన్నత చదువులు చదివిన డెల్సీ చట్టాలను ఎంతబాగా చదివారో, రాజకీయ వ్యూహాలను అంతకంటే బాగా వంటబట్టించుకున్నారు.
మదురోకు రక్షణ కవచం
వెనెజువెలా ఆర్థికంగా చితికిపోయినప్పుడు, ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించినప్పుడు మదురో ప్రభుత్వానికి ఆమె కొండంత అండగా నిలిచారు. విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా, చైనాలతో ఆమె జరిపిన రాయబారాలు దేశాన్ని గట్టెక్కించాయి. తాజాగా మదురోను అమెరికా అరెస్ట్ చేసినప్పుడు దేశంలో కల్లోలం చెలరేగుతుందని అందరూ అనుకున్నారు. కానీ డెల్సీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. సైన్యాన్ని తనవైపు తిప్పుకుని కొన్ని గంటల వ్యవధిలోనే పరిస్థితులను చక్కదిద్ది ‘లీడర్’నని అనిపించుకున్నారు.

ట్రంప్ మద్దతూ ఆమెకే
వెనెజువెలాలోని చమురు నిల్వలు సురక్షితంగా ఉండాలన్నా, దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఉండాలన్నా డెల్సీ వంటి గట్టి నాయకురాలు అవసరమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించారు. ఈ అంతర్జాతీయ మద్దతు డెల్సీకి కొండంత బలాన్ని ఇచ్చింది. దీంతో డెల్సీకే అధ్యక్షపీఠం దక్కింది.
ప్రజల మనిషి మచాడో
వెనెజువెలా కథలో డెల్సీ ఒక ధృవమైతే, మరియా మచాడో మరో ధృవం. ప్రతిపక్ష నేత అయిన మచాడో అధ్యక్షురాలవుతారని భావిస్తున్న తరుణంలో ట్రంప్ డెల్సీ వైపు మొగ్గు చూపడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2012లో పార్లమెంటులో అప్పటి అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను నేరుగా నిలదీసిన మచాడో ధైర్యాన్ని చూసి దేశం అవాక్కయింది. ఆ రోజు మొదలైన ఆమె పోరాటం నేటికీ ఆగలేదు. ప్రభుత్వం ఆమెపై దాడులు చేయించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంది. అయినప్పటికీ ఆమె దేశం విడిచి వెళ్లలేదు. ప్రజల మధ్యనే ఉంటూ పోరాడారు. ఈ అలుపెరుగని పట్టుదలే ఆమెకు 2025 నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టింది. అధికారం డెల్సీ చేతుల్లో ఉంటే మచాడో ప్రజల గుండెల్లో ఉన్నారు. ఒకరికి సైన్యం, అధికారం తోడుంటే, మరొకరికి ప్రజల నైతిక మద్దతు తోడుంది. ఈ ఇద్దరు మహిళల పోరాటం వెనెజువెలా చరిత్రలో ఒక అసాధారణ అధ్యాయం
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి