రాజ్యాంగం ఆమె ఆయుధం!
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:55 AM
యువతుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, భారత రాజ్యాంగాన్ని దిక్సూచిగా మార్చి వారి విద్య, సామాజిక హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి యోధురాలు దీపా పవార్.
దళిత.. ఆదివాసీ.. ముస్లిం వర్గాల యువతుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ, భారత రాజ్యాంగాన్ని దిక్సూచిగా మార్చి వారి విద్య, సామాజిక హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తున్న క్షేత్రస్థాయి యోధురాలు దీపా పవార్. ఆ దిశగా ఆమె సాధించిన విజయాలు, అణగారిన వర్గాల బాలికల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న సేవలకు గాను ఈ ఏడాది (2026) ఆమె అత్యంత ప్రభావవంతమైన లీడర్‌గా గుర్తింపు పొందారు.
మహారాష్ట్రకు చెందిన దీపా పవార్ ప్రయాణం ఒక విప్లవాత్మక పాఠం. విముక్త జాతుల విభాగంలోని ‘ఘిసాడి’ అనే సంచార తెగలో ఆమె జన్మించారు. సమాజంలో అత్యంత దిగువన ఉండే ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, ప్రాథమిక వసతుల లేమిని ఆమె చిన్ననాటి నుంచే కళ్లారా చూశారు. సొంతవర్గం పడుతున్న వేదన ఆమెను అప్పుడే ఆలోచనల్లో పడేసింది. కేవలం సానుభూతితో సరిపెట్టకుండా, ఈ వివక్షాపూరిత వ్యవస్థను అధిగమించి మార్పువైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. చదువుకోడమే ఒక అరుదైన విషయంగా ఉన్న ఆ వాతావరణంలో విద్యను పూర్తిచేసి, సామాజిక మార్పు కోసం తనే ఒక శక్తిగా మారారు.
ఆశయం దిశగా అడుగులు
తనలాంటి అణగారిన వర్గాల మహిళలకు, యువతకు ఒక బలమైన వేదిక అవసరమని గుర్తించిన దీపా పవార్.. ‘అనుభూతి ట్రస్ట్’ పేరుతో ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దళిత, ఆదివాసీ, ముస్లిం, సంచార జాతులకు చెందిన యువతుల సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కేవలం పైపైన సంక్షేమ కార్యక్రమాలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయిలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, నాయకులుగా తీర్చిదిద్దడం అనుభూతి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం.
నాయకత్వ శిక్షణ
సాధారణంగా వెనుకబడిన వర్గాల బాలికలు తమ సమస్యలను బయటకు చెప్పుకోవడానికి లేదా హక్కుల కోసం పోరాడటానికి భయపడతారు. ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి దీపా పవార్ ప్రత్యేకమైన నాయకత్వ ‘కోహోర్ట్’లను డిజైన్ చేశారు. వీటి ద్వారా యువతులకు ఉమ్మడి వేదిక కల్పించి, వారిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిర్ణయాధికారం, సామాజిక అవగాహనను పెంచుతారు. విద్యార్థినులు, యువతులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వేధింపులు, వివక్షను ఎలా ప్రశ్నించాలో ఈ శిక్షణ తరగతుల్లో నేర్పిస్తారు.
రాజ్యాంగమే ఆయుధం
దీపా పవార్ విషయంలో అత్యంత కీలకమైన అంశం ‘రాజ్యాంగ అక్షరాస్యత’. భారత రాజ్యాంగం కేవలం న్యాయవాదులకు, పాలకులకు మాత్రమే పరిమితమైన గ్రంథం కాదని, అది సామాన్య పౌరులకు లభించిన రక్షణ కవచమని ఆమె బలంగా నమ్ముతారు. యువతకులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే భావనలను సులభమైన భాషలో బోధిస్తారు. తమ ప్రాథమిక విద్యాహక్కు లేదా సామాజిక న్యాయం నిరాకరణకు గురైనప్పుడు, రాజ్యాంగాన్ని దిక్సూచిగా మార్చుకుని చట్టబద్ధంగా ఎలా పోరాడాలో వారికి నేర్పిస్తూ సిద్ధం చేస్తారు.
‘మెంటల్ జస్టిస్’
మానసిక ఆరోగ్యం అనగానే కేవలం వైద్యపరమైన విధానాలు లేదా కౌన్సెలింగ్ మాత్రమే అనుకుంటారు. కానీ దీపా పవార్ ‘మెంటల్ జస్టిస్’ అనే కొత్త భావనను తెరపైకి తెచ్చారు. అణగారిన వర్గాలు నిరంతరం ఎదుర్కొనే కులవివక్ష, పేదరికం, లింగ వివక్ష వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర వివక్ష చూపుతాయి. ‘ఈ మానసిక ఒత్తిడికి మూలం సామాజిక అసమానతలే. సామాజిక న్యాయం ద్వారానే పూర్తిస్థాయి మానసిక ఆరోగ్యం సాధ్యమవుతుంది’ అంటారు దీపా పవార్.
శానిటేషన్ హక్కులపై సమరం
సంచార, ఆదివాసీ తెగల మహిళలు అనుభవిస్తున్న ఆరోగ్య పరిస్థితులపై దీపా పవార్ క్షేత్రస్థాయి పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం, రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన లోపించడం వారి శారీరక ఆరోగ్యాన్నే కాక ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తోందని ఆమె గుర్తించారు. స్థానిక ప్రభుత్వాలు, యంత్రాంగంతో పోరాడి ఆయ వర్గాలకు సురక్షితమైన నీరు, శానిటేషన్ సౌకర్యాలు అందేందుకు కృషి చేశారు.
తరతరాల మార్పుకు నాంది
దీప కృషి ఒక్కో వ్యక్తిని మార్చడం కాదు, అది ఒక తరం ఆలోచనా విధానం మొత్తాన్ని మారుస్తోంది. ఒక ఆదివాసీ యువతి తన హక్కును ప్రశ్నించడం నేర్చుకుంటే, ఆ ప్రభావం ఆమె కుటుంబం, సమాజం మొత్తంపై ఉంటుంది. రాజ్యాంగ విలువలను నరనరాన నింపుకుని, హక్కుల పోరాటంలో ముందు వరుసలో నిలుస్తున్న ఆ యువతులే రేపటి భారత సమాజానికి దిక్సూచి.
జాతీయ, అంతర్జాతీయ గుర్తింపులు
దీపా పవార్ నిరంతర శ్రమకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బహుజన, ఆదివాసీ, ముస్లిం వర్గాల యువతుల జీవితాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పుకు గాను 2026లో క్షేత్రస్థాయిలో అత్యంత ప్రభావం చూపిన లీడర్‌గా గౌరవాన్ని అందుకున్నారు. గతంలో ‘ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డ్ (2022)’ లాస్ట్ మైల్ ఛాంపియన్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా ‘బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్’ వారి ‘గోల్‌కీపర్స్ యూత్ యాక్షన్ ఆక్సిలరేటర్’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 26 మంది యువ నాయకులలో భారతదేశం తరపున ఒకరిగా నిలిచి దేశ కీర్తిని చాటారు.
ఈ వార్తలనూ చదవండి...