పండ్ల తొక్కలతో...
ABN , Publish Date - Nov 18 , 2026 | 03:36 AM
శీతాకాలంలో వీచే చలిగాలులకు చర్మం తేమను, సహజకాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంటుంది. అలాంటప్పుడు ఖరీదైన మాయిశ్చరైజర్లు...
శీతాకాలంలో వీచే చలిగాలులకు చర్మం తేమను, సహజకాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంటుంది. అలాంటప్పుడు ఖరీదైన మాయిశ్చరైజర్లు, క్రీమ్‌లు వాడే బదులు సహజ నూనెలతో నిండిన పండ్ల తొక్కలతో చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం...
అరటిపండు : ముందుగా ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అరటిపండు తొక్కలోపల ఉండే తెల్లటి గుజ్జును చెంచాతో గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పావు గంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం బిగుతుగా కోమలంగా మారుతుంది. అరటిపండు తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, బి విటమిన్లు కలిసి చర్మానికి పోషణను అందిస్తాయి.
నారింజ : నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. గిన్నెలో రెండు చెంచాల పొడిని తీసుకుని తగినంత పెరుగు వేసి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి అరగంటసేపు ఆరనిచ్చి ఆపైన గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మృతకణాలు తొలగి చర్మం మృదువుగా నిగనిగలాడుతుంది. నారింజ తొక్కల్లోని సి విటమిన్ చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
దానిమ్మ : గిన్నెలో కొద్దిగా దానిమ్మ తొక్కల పొడిని తీసుకుని గులాబీ నీటిని చిలకరించుకుంటూ పేస్టులా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో కడిగేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. మొటిమలు, ముడుతలు, గీతలు మాయమై చర్మం కాంతివంతంగా మారుతుంది.
యాపిల్ : ఓ గిన్నెలో యాపిల్ తొక్కలు వేసి గ్లాసు నీటిని పోసి బాగా మరిగించి చల్లార్చి స్ర్పే బాటిల్లోకి వడగట్టాలి. ఈ నీటిని స్కిన్ టోనర్‌లా వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
అవకాడో : దీనిలో ఇ విటమిన్ అధికంగా ఉంటుంది. దీని లోపలి భాగంతో ముఖంపై సున్నితంగా మర్దన చేసుకుంటుంటే చర్మం పొరల్లో తేమ నిండుతుంది. దీనిలోని సహజ నూనెలు చర్మం పొడిబారకుండా కాపాడతాయి.
కివీ : దీని లోపలి భాగంతో ముఖంపై నెమ్మదిగా రుద్ది ఆపైన మంచినీటితో కడిగేసుకుంటే మురికి, మృతకణాలు తొలగి చర్మం తాజాగా మెరుస్తుంది.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News