అంతరంగానికి సాక్షిగా
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:56 AM
ప్రతి విషయానికి తక్షణం స్పందించకుండా, ముందుగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. ఇది మన అంతరంగ ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతుంది.
ప్రతి విషయానికి తక్షణం స్పందించకుండా, ముందుగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. ఇది మన అంతరంగ ప్రశాంతతకు ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే బయటి ప్రపంచం పట్ల మనం
వ్యక్తపరిచే ప్రతి ప్రతిస్పందన... మన అంతరంగం మీద ఒక ముద్రను వేస్తుంది.
ఆధ్యాత్మిక సాధనలో సాక్షీభావం ఎంతో ముఖ్యమైనది. సాక్షీభావం అంటే... మనలో కలుగుతున్న ఆలోచనలను, భావాలను, ప్రతిస్పందనలను ప్రేక్షకుడిలా గమనించడం. అంటే మన అంతరంగానికి సాక్షిగా ఉండాలి. కోపం వచ్చినా, అసూయ కలిగినా, బాధ కలిగినా, ఎవరినైనా విమర్శించాలనిపించినా... ఆ ఆలోచనలను ముందుగా గమనించాలి. ప్రతిదానికీ ప్రతిస్పందించే మనస్తత్వం మన అంతరంగ వికాసానికి అవరోధంగా ఎలా మారుతుందో శ్రీమాతాజీ నిర్మలాదేవి వివరించారు. మనస్సు నిరంతరం స్పందిస్తూ, వ్యాఖ్యానిస్తూ, తీర్పులు ఇస్తూ ఉంటే... అంతరంగంలో కలిగే ఆధ్యాత్మిక చైతన్యాన్ని స్వీకరించలేం. అంటే మన అంతరంగానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి మనమే తలుపులు మూసేసినట్టవుతుంది.
కొత్త అలవాటు...
అందుకే ముందుగా విషయాన్ని గమనించాలి. అర్థం చేసుకోవాలి. అవసరమైనప్పుడు మాత్రమే స్పందించాలి. ఈ కొత్త అలవాటును మనలో పెంపొందించుకుంటే... ఆ చిన్న మార్పు మన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు చాలా సమస్యలు సంఘటన వల్ల కాకుండా... దాని పట్ల మనం ప్రతిస్పందించిన తీరు వల్ల పెద్దవి అవుతాయి. ఒక మాట మనల్ని బాధించవచ్చు. కానీ ఆ మాటల గురించి గంటల తరబడి ఆలోచించడం, పదేపదే గుర్తు చేసుకోవడం, బదులివ్వాలని ఆలోచించడం... వీటన్నిటి ద్వారా సమస్యను మనమే పెంచుకుంటాం. ‘‘సరే! అది వారి అభిప్రాయం. దాన్ని నా మనసులోకి తీసుకోను’’ అనుకుంటే... మనశ్శాంతి మన చేతిలోనే ఉంటుంది. ప్రతిస్పందనను తగ్గించుకోవడం అంటే... సమస్యల నుంచి పారిపోవడం కాదు, సమస్యలకు మనపై ఉన్న అధికారాన్ని తగ్గించుకోవడం.
ఒక చిన్న సాధన...
‘ఈ రోజు నేను ఎక్కడ అనవసరంగా స్పందించాను? ఎక్కడ వెంటనే కోపానికి లోనయ్యాను? ఎక్కడ ఎదుటివారి మాటను పూర్తిగా వినకముందే నిర్ణయానికి వచ్చాను? ఎక్కడ అవసరం లేని వాదనలోకి వెళ్ళాను?’ అని ప్రతిరోజూ కాసేపు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. గాఢమైన శ్వాస, కొన్ని క్షణాల మౌనం... ఆ తరువాతే స్పందన. ఈ చిన్న సాధన మన అంతరంగంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ ప్రపంచాన్ని మనం మార్చలేం. ప్రతి వ్యక్తి మనకు నచ్చినట్టే మాట్లాడాలని ఆశించలేం. ప్రతి సంఘటన మన అభిప్రాయానికి అనుగుణంగా జరగదు. కానీ దేనికి ఎలా స్పందించాలి? అనేది మన చేతిలోనే ఉంది. బయటి ప్రపంచాన్ని మనం నియంత్రించలేకపోయినా... మన ఆంతరంగిక స్పందనను క్రమంగా నియంత్రించుకోవచ్చు. అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. మనస్సు ప్రతి విషయానికి స్పందించడం మానేస్తే... ఆంతరంగంలో నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దంలో మనకు మనం స్పష్టంగా కనిపిస్తాం. మనలోని చైతన్యాన్ని అనుభవించగలుగుతాం. మన హృదయం తేలిక పడుతుంది. చిత్తం ప్రశాంతం అవుతుంది. అంతిమంగా అది మన ఉన్నతికి దోహదపడుతుంది.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ
నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలను కూడా చదవండి
మంత్రి లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు