Share News

Nutrition Facts Fruits: విదేశీ పండ్లు శ్రేష్ఠమా

ABN , Publish Date - Jan 06 , 2026 | 04:35 AM

కివి, డ్రాగన్‌, స్టార్‌, ప్యాషన్‌ ఫ్రూట్స్‌, బ్లూ బెర్రీ, అవకాడొ... ఒకప్పుడు ఈ పండ్లన్నీ విదేశాలకే పరిమితం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో కూడా విరివిగా పండుతూ, అందరికీ అందుబాటులో...

Nutrition Facts Fruits: విదేశీ పండ్లు శ్రేష్ఠమా

పోషకాలు - వాస్తవాలు

కివి, డ్రాగన్‌, స్టార్‌, ప్యాషన్‌ ఫ్రూట్స్‌, బ్లూ బెర్రీ, అవకాడొ... ఒకప్పుడు ఈ పండ్లన్నీ విదేశాలకే పరిమితం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో కూడా విరివిగా పండుతూ, అందరికీ అందుబాటులోకొచ్చేశాయి. అయితే మన పండ్లలో లేని పోషకాలు ఈ పండ్లలో ఉంటాయా? వీటిని తినడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయా?

చక్కెర మోతాదులు తక్కువగా ఉండడం, కొత్త తరం ఈ విదేశీ వంగడాల పట్ల మక్కువ బరుస్తూ ఉండడం వల్ల, రెస్టారెంట్లలో స్మూదీలు, పండ్ల రసాలు, ఐస్‌క్రీమ్స్‌లో వీటి వాడకం పెరిగింది. దేశీయ పండ్లతో పోలిస్తే, ఈ విదేశీ పండ్ల ఖరీదు కూడా కాస్త ఎక్కువే! అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో వీటి మీద ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ పండ్లు కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే! వీటన్నింట్లో పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే మన పండ్లలో దొరకని పోషకాలు వీటిలో దొరుకుతాయని అనుకోవడం అపోహ మాత్రమే! యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు మన పండ్లలోనూ ఉంటాయి.

ప్రత్యామ్నాయాలున్నాయి

డ్రాగన్‌, లిచిలలో సి విటమిన్‌తో పాటు కాపర్‌, పొటాషియం మొదలైన పోషకాలన్నీ ఉంటాయి. అవకాడొలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. కాబట్టి శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టేవాళ్లు అవకాడొ శాండ్‌విచ్‌, స్ర్పెడ్‌లను ఎంచుకుంటూ ఉంటారు. కీటో డైట్‌ అనుసరించేవారు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. డ్రాగన్‌, రాంబుటాన్‌, స్టార్‌ ఫ్రూట్స్‌లో చక్కెరలు తక్కువ కాబట్టి మధుమేహలు ఈ పండ్లను ఎంచుకుంటూ ఉంటారు. బ్లూబెర్రీ్‌సలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, క్యాన్సర్‌ను నివారించే ఇమ్యూనిటీ బూస్టర్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పండ్లను విరివిగా తింటున్నారు. ప్యాషన్‌ ఫ్రూట్‌లో కూడా రోగనిరోధకశక్తిని పెంచే కారకాలుంటాయి. దీన్లో విటమిన్‌ సి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డిజర్ట్స్‌లో, కాక్‌టెయిల్స్‌లో కలుపుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లన్నిటినీ మన దేశంలోని చల్లని ప్రదేశాల్లో పండించడం మొదలుపెట్టారు.


పోషకాలు సమంగా...

విదేశీ పండ్లను తినాలనుకోవడం తప్పు కాదు. వాటిలోని పోషకాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నది కూడా మంచి ఆలోచనే! అయితే ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి, వాటినే తినవలసిన అవసరం కూడా లేదు. నిజానికి విదేశీ పండ్లలో దొరికే పోషకాలన్నీ మన పండ్లలో కూడా దొరుకుతాయి. ఆ పండ్లకు సాటి రాగలిగే దేశీయ పండ్లన్నీ మనకు ముందు నుంచే ఉన్నాయి. ఆయా రుతువుల్లో పండే పండ్లన్నీ ఆయా కాలాల్లో మన ఆరోగ్యానికి రక్షణ కల్పించే పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు చలి కాలంలో లిచిలతో సమానంగా రేగు పండ్లు కూడా దొరుకుతాయి. డ్రాగన్‌లో కంటే నేల ఉసిరితో విటమిన్‌ సి ఎక్కువగా దొరుకుతుంది. సీమచింతకాయలో ఎక్కువ పీచు, విటమిన్‌ సి ఉంటాయి. స్టార్‌ ఫ్రూట్‌, బ్లూబెర్రీ్‌సకు బదులుగా పసుపు రంగు ఉసిరిలో, వాక్కాయ, జామకాయల్లో విటమిన్‌ సి సమృద్ధిగా దొరుకుతుంది. అవకాడొ బదులు అరటిపండ్లు తినొచ్చు. డ్రాగన్‌ ఫ్రూట్‌కు బదులుగా జామ పండ్లు తినొచ్చు. తాటి ముంజెలకూ రాంబుటాన్‌కూ అంతగా వ్యత్యాసం ఉండదు. రెండింట్లో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణాలుంటాయి. రెండింట్లో నీటి శాతం ఎక్కువ. కాబట్టి వీటిలో ఏ పండును తిన్నా పొందే ఆరోగ్య ప్రయోజనాలు సమానంగానే ఉంటాయి.

దేశీయ పండ్లలో...

జామ, సీతాఫలం, దానిమ్మ, అరటి పండ్లలో దొరికే పోషకాలు విదేశీ పండ్లలో దొరికే పోషకాలకు ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి ఎక్కువ ధర పలికే విదేశీ పండ్లకు బదులుగా అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ దేశీయ పండ్లను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. కొన్ని విదేశీ పండ్లలో కొన్ని పోషకాలు కాస్త ఎక్కువ మోతాదుల్లో ఉండొచ్చు. అంతే సమానమైన పోషకాలను పొందడం కోసం అవే పోషకాలు కలిగిన దేశీయ పండ్ల మోతాదును పెంచుకుంటే సరిపోతుంది.

డాక్టర్‌ సుజాత స్టీఫెన్‌,

క్లినికల్‌ న్యూట్రిషనిస్ట్‌,

యశోద హాస్పిటల్స్‌,

మలక్‌పేట్‌, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 04:35 AM