గోమతి నగర్ రైలులో దారుణం ఘటన.. యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో..
ABN , Publish Date - May 18 , 2026 | 01:20 PM
బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒక యువతిని కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి గోనె సంచిలో చుట్టి ఇనుప పెట్టెలో దాచారు. ఈ ఘటన ప్రయాణికులను, రైల్వే సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లఖ్‌నవూ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బీహార్‌లోని ఛప్రా నుంచి గోరఖ్‌పూర్ మీదుగా లఖ్‌నవూ (గోమతి నగర్) వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు లఖ్‌నవూ స్టేషన్‌కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత రైల్వే సిబ్బంది 'ఎస్-1' (S-1) స్లీపర్ కోచ్‌లో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఇనుప పెట్టె, ఒక సంచిని గమనించారు. ఎంతసేపటికీ ఆ పెట్టెను తీసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
లఖ్‌నవూ కమిషనరేట్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం సమక్షంలో పోలీసులు ఆ ఇనుప పెట్టెను, సంచిని తెరిచి చూడగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా హడలిపోయారు. ఇనుప పెట్టెలోని ఒక ప్లాస్టిక్ కవర్‌లో యువతి మొండెం లభ్యమవగా, పక్కనే ఉన్న వేరొక సంచిలో చేతులు, కాళ్లు విడివిడిగా ప్యాక్ చేసి ఉన్నాయి. అయితే, మృతదేహానికి సంబంధించిన ‘తల’ మాత్రం అక్కడ లభించలేదు. మృతురాలి వయసు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. యువతిని ఎక్కడో దారుణంగా హత్య చేసి, ఆధారాలు లభించకుండా ఉండేందుకే దుండగులు శరీర భాగాలను ముక్కలుగా నరికి.. ఇలా పెట్టెలో, కవర్‌లో ఉంచి రైలులో వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతురాలు ఎవరు, ఆమెను అంత దారుణంగా చంపిన కిరాతకులు ఎవరు అనే విషయాలను కనుగొనేందుకు ఛప్రా, గోరఖ్‌పూర్, లఖ్‌నవూ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మెక్సికోలో మళ్లీ కాల్పులు.. 10 మంది మృతి
ఎయిర్ షో సందర్భంగా అపశృతి.. గాల్లో ఢీకొట్టుకున్న యుద్ధ విమానాల