ఎయిర్ షో సందర్భంగా అపశృతి.. గాల్లో ఢీకొట్టుకున్న యుద్ధ విమానాలు
ABN , Publish Date - May 18 , 2026 | 07:00 AM
యుద్ధ విమానాల ఎయిర్ షో సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసం అయ్యాయి. ఆదివారం అమెరికా, ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలో యుద్ధ విమానాల ఎయిర్ షో సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొట్టుకుని ధ్వంసం అయ్యాయి. ఆదివారం ఇడాహోలోని మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నావల్ ఎయిర్ ఫోర్సెస్, యూఎస్ పసిఫిక్ ఫ్లీట్ అధికార ప్రతినిధి ఉమయమ్ తెలిపిన వివరాల మేరకు.. ఎయిర్ షో సందర్భంగా యూఎస్ నావీకి చెందిన ఈఏ18- జీ గ్రోలర్ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అవి ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి.
ఆ వెంటనే నేలపై పడి ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ రెండు యుద్ధ విమానాల్లో నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానాలు ఢీకొన్న వెంటనే వారు ప్యారాచూట్‌ల సాయంతో పక్కకు వచ్చేశారు. క్షేమంగా భూమి మీదకు చేరుకున్నారు. నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం నేపథ్యంలో షో నిర్వాహకులు ఎయిర్ షోను రద్దు చేశారు. ఈ సంఘటనపై ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ జెఫ్ గుజ్జేట్టీ మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు యుద్ధ విమానాలు ఢీకొట్టుకున్న వెంటనే ఒకదానితో ఒకటి అతుక్కుపోయాయి’..
‘గాల్లో నుంచి భూమి మీద పడే వరకు అలా అతుక్కునే ఉన్నాయి. అందుకే రెండు విమానాల్లోని నలుగురు సిబ్బంది క్షేమంగా బయటకు రావడానికి అవకాశం దొరికింది. సాధారణంగా గాల్లో విమానాలు ఢీకొన్నపుడు సిబ్బంది ఫ్యారాచూట్‌లను ఓపెన్ చేయడానికి సమయం ఉండదు. పైలట్ల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తోంది. విమానంలో సమస్య తలెత్తటం వల్ల ప్రమాదం జరిగినట్లు కనిపించటం లేదు’ అని అన్నారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా? నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..
టీ-ఎప్‌సెట్‌లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులు