జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ కమిటీ సంచలన నివేదిక..
ABN , Publish Date - Aug 12 , 2026 | 06:17 PM
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించిన వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ఇంట్లో లభించిన నగదుకు సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నగదు లభించిన వ్యవహారంపై పార్లమెంటరీ విచారణ కమిటీ కీలక విషయాలు వెల్లడించింది. ఆయన ఇంట్లో లభించిన నగదుకు సంబంధించి తగిన వివరణ ఇవ్వడంలో వర్మ విఫలమయ్యారని కమిటీ పేర్కొంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది (Yashwant Varma Cash Row).
2025 మార్చి 14 రాత్రి జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడి ఒక స్టోర్‌రూమ్‌లో భారీగా కాలిపోయిన రూ.500 నోట్ల కట్టలు కనిపించాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఆ ప్రదేశంలో ఎందుకు ఉందన్న అంశాలపై వర్మ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది (Cash Found At Judge House).
'నగదు నాది కాదు, ఎవరో కుట్రపూరితంగా పెట్టారు' అన్న వర్మ వాదనను విచారణ కమిటీ అంగీకరించలేదు. న్యాయమూర్తుల (విచారణ) చట్టం, 1968 ప్రకారం నమోదైన మూడు ప్రధాన ఆరోపణలూ రుజువయ్యాయని కమిటీ స్పష్టం చేసింది. నగదు ఉన్న స్టోర్‌రూమ్‌పై ఆయనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రణ ఉన్నట్లు గతంలో ఏర్పాటు చేసిన అంతర్గత విచారణ కమిటీ కూడా గుర్తించిన విషయాన్ని తాజా నివేదిక ప్రస్తావించింది (Parliament Inquiry Panel).
నగదు లభించిన తర్వాత సాక్ష్యాలను సక్రమంగా భద్రపరచలేదని పార్లమెంటరీ కమిటీ ఆక్షేపించింది. స్టోర్‌రూమ్‌ను అధికారికంగా సీజ్ చేసి పరిశీలించే ముందే అక్కడి పరిస్థితిని మార్చారని పేర్కొంది. ఈ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత జస్టిస్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి ఆయన మాతృ న్యాయస్థానమైన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు జేపీసీకి.. విపక్షాల నిరసనల మధ్య కీలక పరిణామం..
భారత్‌పై వంద శాతం సుంకాలు.. ట్రంప్, మోదీ పరిష్కరించుకుంటారు: అమెరికా ప్రతినిధి