యమునా ఎక్స్‌ప్రెస్‌వే బస్సు ప్రమాదం.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:43 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ప్రమాదానికి గురై తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదానికి డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసుల ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలుస్తోంది.
నోయిడా: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇవాళ (గురువారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు ప్రమాదానికి గురై తొమ్మిది మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి ఆగ్రాకు వెళ్తుండగా జేవర్ సమీపంలో చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలుస్తోంది.
ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున రాజ్ కల్పనా ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ బస్సు ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి ఆగ్రాకు వెళ్తోంది. ఈ సమయంలో సుమారు 30 నుంచి 35 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు 33 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఏదో కాలిపోతున్న వాసన వస్తోందని డ్రైవర్, కండక్టర్‌కు ప్రయాణికులు తెలిపారు. అయినప్పటికీ వారు వాహనాన్ని వెంటనే ఆపలేదు. కాసేపటికే డ్రైవర్ సీటు సమీపం నుంచి మంటలు రావడం కనిపించిందని ఎఫ్‌ఐఆర్ ద్వారా తెలుస్తోంది. అయితే, మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు కేకలు వేశారు. 'మీరు చనిపోయినా నాకు పర్వాలేదు, నేను బస్సును ఆపను' అని వారితో బస్సు డ్రైవర్ చెప్పినట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదైంది. బస్సు మొత్తం పొగ, మంటలు వ్యాపించడంతో పలువురు ప్రయాణికులు లోపల చిక్కుకుపోయారు. మరికొంతమంది బస్సు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
అయితే, ప్రమాదానికి ముందు డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ బస్సులో సిగరెట్ తాగుతున్నారని ఎఫ్‌ఐఆర్ ప్రకారం తెలుస్తోంది. బస్సులో పొగ తాగవద్దని వారిని ప్రయాణికులు వారించారు. అయినా డ్రైవర్, కండక్టర్ నవ్వుతూ వారిని నిశ్శబ్దంగా ఉండమని బెదిరించారు. కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..