Share News

మరోసారి మహిళా బిల్లు!

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:17 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ప్రధానమంత్రి...

మరోసారి మహిళా బిల్లు!

  • వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు

  • నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కూడా..

  • రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో కీలక మంత్రుల భేటీ

న్యూఢిల్లీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌కు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రు ల మీద నేరారోపణలపై చర్యలకు సంబంఽధించి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు, వందేమాతరం గేయాన్ని పూర్తిగా ఆలపించటాన్ని తప్పనిసరి చేసే బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నివాసంలో శుక్రవారం ఎన్డీఏ కీలక మంత్రుల సమావేశం జరిగింది. దీంట్లో కేంద్రమంత్రులు అమిత్‌షా, అన్నపూర్ణాదేవి, రామ్మోహన్‌ నాయుడు, లల్లన్‌సింగ్‌, జయంత్‌ చౌదరి పాల్గొన్నారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి ఈ భేటీలో చర్చించారు. గత సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి అన్నపూర్ణాదేవి కూడా ఈ వ్యూహరచన సమావేశంలో పాల్గొనడంతో సంబంధిత బిల్లుపై కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఈ దఫా తప్పకుండా ఆమోదం లభిస్తుందని మంత్రులు భరోసా తో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బెంగాల్‌, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలలో ప్రతిపక్షాలు ఓడిపోవడం, తృణమూల్‌ కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌)లలో చీలికతో ఇండియా కూటమి బలహీనపడ టం, డీఎంకే, ఆప్‌ ఇండియా కూటమి నుంచి వేరుపడటం వంటి పరిణామాలతో ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతిన్నదని.. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించేందుకు ఇదే సానుకూల సమయమని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 06:17 AM