Share News

పదేళ్లుగా పైసా ఖర్చు లేకుండా 'ఫ్రీ గ్యాస్' వాడుతున్న మహిళ.. సీక్రెట్ ఏంటో తెలుసా?

ABN , Publish Date - Mar 20 , 2026 | 06:51 AM

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నడుమ, దేశ వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరుతున్నారు.

పదేళ్లుగా పైసా ఖర్చు లేకుండా 'ఫ్రీ గ్యాస్' వాడుతున్న మహిళ.. సీక్రెట్ ఏంటో తెలుసా?
Kerala Woman Free Gas

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నడుమ, దేశ వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇంతగా గ్యాస్ కొరత ఉన్న తరుణంలో.. కేరళలోని అలప్పుజలో అరట్టువళికి చెందిన రెత్నమ్మ గత పదేళ్లుగా ఎలాంటి గ్యాస్ కొనకుండానే వంట చేసుకుంటున్నారు. అలా అని కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి వాడుతున్నారని అనుకుంటే పొరపాటే.. తన ఇంటి పెరట్లోనే సహజసిద్ధంగా తయారవుతున్న గ్యాస్‌తోనే ఆమె వంటగది వెలుగుతోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, కేరళకు చెందిన రెత్నమ్మ అనే మహిళ విషయంలో ఇది అక్షరాలా నిజం.


రమేశ్, రెత్నమ్మ దంపతులు 2011లో ఇంటి ఆవరణలో బోరు బావి తవ్వించినప్పుడు, నీరు పడకపోవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందారు. అయితే, ప్లంబర్ పైపును మూస్తుండగా, దగ్గరలో నిలబడిన ఓ వ్యక్తి అగ్గిపుల్ల వెలిగించి కిందపడవేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట్లో భయపడినా, తర్వాత ఆ పైపు నుంచి వస్తుంది సహజమైన గ్యాస్ అని గుర్తించి, ఒక ప్లాస్టీక్ పైపు ద్వారా దానిని నేరుగా రెత్నమ్మ వంటింటికి కనెక్షన్ ఇచ్చారు. నెలలు, సంవత్సరాలు గడిచినా కొద్ది రెత్నమ్మలో భయం పోయింది. గత పదేళ్లుగా ఆమె ఎలాంటి టెన్షన్ లేకుండా సహజసిద్ధంగా తయారవుతున్న గ్యాస్‌తోనే వంట వండుతున్నారు.


ఈ విషయం తెలిసిన బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇతర చమురు సంస్థల అధికారులు పరిశీలించిన తర్వాత ఆ బోరు బావి నుంచి వస్తున్నది సాధారణ ఎల్‌పీజీ(LPG) కాదని, అది మీథేన్ అని తెలిపారు. అలప్పుజ వంటి ప్రాంతాల్లో కొన్ని వందల ఏళ్ల నుంచి భూగర్భంలో కూరుకుపోయిన వృక్షసంపద, సేంద్రీయ పదార్థాలు కుళ్లిపోవడం వల్ల సహజంగా ఈ వాయువు ఉత్పన్నమవుతోందని, దీనిని శాస్త్రీయంగా ‘మార్ష్ గ్యాస్’ లేదా ‘బయో గ్యాస్’ అని పిలుస్తారని అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ కొరత ఏ రేంజ్ లో ఉంతో తెలిసిందే. ఈ లెక్కన పదేళ్లుగా ఎలాంటి గ్యాస్ ఇబ్బందులు లేకుండా వంట చేసుకుంటున్న రెత్నమ్మ చాలా అదృష్టవంతురాలని అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

అక్రమవలసదారులకు అమెరికా ఆఫర్.. దేశం నుంచి వెళ్లిపోతే రూ.2.4 లక్షలు..

మీది డేగ చూపు అయితే.. ఈ అడవిలో చిరుతను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Mar 20 , 2026 | 07:38 AM