రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..
ABN , Publish Date - May 12 , 2026 | 01:46 PM
నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరాఖండ్‌లో రైలు నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళను బిహార్‌లో గుర్తించారు.
న్యూఢిల్లీ, మే 12: నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరాఖండ్‌లో రైలు నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళను బిహార్‌లో గుర్తించారు. ఆమెను క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. భర్తతో గొడవ కారణంగా ఆమె రైలు దిగి, వేరే రైలు ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన మనీశ్, ప్రగ్యా సింగ్ భార్యాభర్తలు. కొద్దిరోజుల క్రితం వీరు కేదార్‌నాథ్‌కు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలులో ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. రైలు ఉత్తరాఖండ్‌లోని లష్కర్ కోత్వాలీ ఏరియాలో ఉండగా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ తర్వాత మనీశ్ నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన ప్రగ్యా సింగ్ తర్వాతి స్టేషన్‌లో రైలు దిగింది. వేరే రైలు ఎక్కింది. మనీశ్ నిద్రలేచిన తర్వాత భార్య కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రగ్యా సింగ్ రైలు నుంచి మిస్సింగ్ అయిన విషయం సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. ‘మహిళ సడెన్‌గా రన్నింగ్ ట్రైన్ నుంచి కనిపించకుండా పోవటం ఏంటి?’ అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్ కేసు నమోదు అయింది. పోలీసు టీమ్‌లు ఆమె కోసం వెతకటం మొదలెట్టాయి. చివరకు పోలీసుల కష్టం ఫలించింది. ఆమె బిహార్‌లోని బెగుసరయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను క్షేమంగా కాన్పూర్‌లోని కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఇవి కూడా చదవండి
నీట్ పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్
తల్లిదండ్రులకు అలర్ట్.. మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి..