పుణె విప్రోలోనూ ‘నాసిక్’ పర్వం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:55 AM
మతం మారాలని, ఇస్లామ్ పద్ధతులను అనుసరించాలంటూ తనపై ఒత్తిడి చేసేవారంటూ పుణె విప్రో మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. చెప్పినట్టు వినకపోతే...
ఇస్లాంలోకి మారాలని బాస్ ఒత్తిడి
తట్టుకోలేక రాజీనామా చేశా
పుణె విప్రో మాజీ ఉద్యోగిని ఫిర్యాదు
వేధింపులకు తావులేదు: విప్రో
పుణె, జూన్ 5: మతం మారాలని, ఇస్లామ్ పద్ధతులను అనుసరించాలంటూ తనపై ఒత్తిడి చేసేవారంటూ పుణె విప్రో మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. చెప్పినట్టు వినకపోతే ఉద్యోగం తీయించేస్తానంటూ మేనేజర్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపారు. అక్కడి వేధింపులను భరించలేక తాను రాజీనామా చేసినట్టు ఆరోపించారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న బాధితురాలు, తన మహిళా బాస్‌పై పోలీసులతోపాటు మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ‘‘మత విశ్వాసాల కారణంగా నన్ను సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు లక్ష్యంగా చేసుకున్నారు. ఇస్లామ్‌లోకి మారాలని, ఆ మత పద్ధతులకు కట్టుబడాలంటూ ఒత్తిడి చేసేవారు. మతం మార్చుకోకపోతే ప్రతికూల నివేదికలు పై అధికారులకు పంపి నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తానని మా మేనేజర్ బెదిరించేది. అలాంటి వాతావరణంలో మానసిక వేధింపులను తట్టుకోలేక నా ఉద్యోగానికి రాజీనామా చేశాను’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను 2019-2025 మధ్య పుణె క్యాంప్‌సలో పనిచేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదులోని అంశాలను నిశితంగా పరిశీలించడంతోపాటు పుణె విప్రో కంపెనీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించినట్టు పోలీసులు తెలిపారు. ఆమెకు న్యాయం చేయాలంటూ జనజాగృతి సమితి పుణెలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేయడంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. కాగా, తమ కంపెనీలో వివక్ష, వేధింపులకు తావు లేదని విప్రో అధికార ప్రతినిధి తెలిపారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నామని, వారు అడిగిన వివరాలన్నీ అందించామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, నాసిక్ టీసీఎస్ వ్యవహారంలో వివాదాస్పద మత గురువు జకీర్ నాయక్ పేరు తెరపైకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఇస్లామిక్ మత గురువు తారీఖ్ జమీల్, భారత్‌కు చెందిన జకీర్ నాయక్‌ల వీడియోలను చూడాలని తనపై ఒత్తిడి చేసేవారంటూ ఓ బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. ఇస్లామ్‌ను అనుసరిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుందని నిందితులు ఆమెకు చెప్పేవారని పోలీసులు అందులో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్