ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!
ABN , Publish Date - Aug 02 , 2026 | 12:22 PM
పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు అయిన ఒక ఉగ్రవాద అనుమానితుడు.. ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవాలని, అలాగే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన సీజేపీ నిరసనలోకి చొరబడాలని ప్రణాళిక వేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బయటపెట్టింది.
ఆంధ్రజ్యోతి, ఆగస్టు 2: పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు ఒక భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే 'జైషే మహమ్మద్' (JeM) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమీమ్ మొండల్ అనే వ్యక్తిని పూర్బా బర్ధమాన్ జిల్లాలో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసింది. అతను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో అశాంతి సృష్టించేందుకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసు యూనిఫామ్‌లో జంతర్ మంతర్ ప్లాన్
ఎస్టీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గౌరవ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల్లోకి పోలీసు యూనిఫామ్‌లో ప్రవేశించి, అక్కడ పెద్ద ఎత్తున అలజడి, అశాంతి సృష్టించాలని పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లు హమీమ్ మొండల్‌ను ఆదేశించారు. అంతేకాదు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కదలికలపై నిఘా పెట్టడం కూడా హమీమ్ లక్ష్యాలలో ఒకటి. ముఖ్యమంత్రి ఎక్కడైనా భద్రత లేకుండా ఉన్న సమయాలను గుర్తించి, ఆ సమాచారాన్ని సేకరించాలని అతనికి ఆదేశాలు అందాయి.
హనీట్రాప్, కిడ్నాప్ కుట్ర వెనుక 'షాజాద్ భట్టి' గ్యాంగ్
విచారణలో భాగంగా హమీమ్ ప్రియురాలు అర్పితా సర్కార్‌ను కూడా జార్ఖండ్‌లో శుక్రవారం అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీట్రాప్ చేసి కిడ్నాప్ చేయడమే కాకుండా, వారి కుటుంబం నుంచి భారీగా డబ్బు వసూలు చేయడానికి వీరిద్దరూ కుట్ర పన్నుతున్నట్లు తేలింది. వీరు పాకిస్తాన్‌లోని 'షాజాద్ భట్టి గ్యాంగ్'కు చెందిన 'రాణా', 'ఉజైర్', 'ఆబిద్ జట్ 333', 'హమ్మద్' వంటి హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ గ్యాంగ్ తీవ్రవాద ప్రచారం, నియామకాలు, నార్కో-టెర్రరిజం కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
వీఐపీలపై హనీట్రాప్: అర్పిత పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను హనీట్రాప్ చేసి సమాచారం సేకరించి హమీమ్‌కు అందించేదని, ఆమె వాట్సాప్ చాట్లలో పాకిస్థాన్‌తో సంబంధాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా చిక్కిన తీరు
హమీమ్, అర్పితా ఇద్దరూ మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారు. గత నాలుగేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. హనీట్రాప్ కేసు విచారణలో భాగంగా ఎస్టీఎఫ్ అధికారులు మొదట అర్పితా సర్కార్ సోషల్ మీడియా ఖాతాను నిశితంగా పరిశీలించగా, ఆ లింక్ ద్వారా హమీమ్ మొండల్ అసలు రూపం వెలుగులోకి వచ్చింది. వీరి వద్ద నుంచి బ్రిటన్ (UK) మెక్సికో దేశాలకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ద్వారా పాకిస్థాన్ హ్యాండ్లర్లు, స్లీపర్ సెల్స్‌తో మాట్లాడేందుకు వీటిని ఉపయోగించినట్లు భావిస్తున్నారు.
కోర్టు.. హమీమ్‌ను 14 రోజుల ఎస్టీఎఫ్ కస్టడీకి పంపింది. సోషల్ మీడియా ద్వారానే హమీమ్ తీవ్రవాద బాట పట్టినట్లు అతని ఫోన్, సోషల్ మీడియా హిస్టరీ ద్వారా తెలుస్తోంది. సరిహద్దుల అవతలి నుండి నడుస్తున్న ఈ ఉగ్ర నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించి ఉందో, ఇందులో ఇంకా ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో తెలుసుకునేందుకు ఎస్టీఎఫ్ విచారణను వేగవంతం చేసింది.