విచారణ లేకుండా ఏడాది జైలు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:55 AM
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్న కారణంతో ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే కొత్త చట్టాన్ని పశ్చిమ బెంగాల్ తీసుకొచ్చింది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజాభద్రత...
కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన పశ్చిమ బెంగాల్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని భావిస్తే చాలు.. అరెస్టు చేయవచ్చు!
ఘర్షణల్లో విధ్వంసానికి పాల్పడే
వారి ఆస్తుల జప్తుకు మరో చట్టం
అసాంఘిక కార్యకలాపాలకు
పాల్పడుతున్న కొన్ని వర్గాలు
వారిని అణచివేస్తాం: సువేందు
కోల్‌కతా, జూన్ 30: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్న కారణంతో ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా ఏడాదిపాటు నిర్బంధించే కొత్త చట్టాన్ని పశ్చిమ బెంగాల్ తీసుకొచ్చింది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజాభద్రత, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు, 2026’కు రాష్ట్ర అసెంబ్లీ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును స్వయంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కొంతకాలంగా సమాజంలోని కొన్ని వర్గాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. దీనివల్ల చట్టబద్ధమైన పౌరుల జీవితాలకు, ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతోంది. ఇటువంటి కార్యకలాపాలకు, కుట్రలకు అంతం పలకటానికే ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని సంకల్పించాం’ అని పేర్కొన్నారు. కాగా, ఈ బిల్లులో ‘అసాంఘిక కార్యకలాపాలు’ అనే పదం నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ప్రజల్లో భయం, అభద్రత కలిగించటం, చట్టబద్ధ కార్యకలాపాలు, వ్యాపారాల్ని అడ్డుకోవటం, ఆస్తుల దురాక్రమణ, వసూళ్లు, అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసం వంటివాటిని దీనికింద చేర్చారు. ‘గూండా’ అనే పదం పరిధిని కూడా పెంచారు. ఈ చట్టం ప్రకారం.. ప్రజాభద్రతకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించిన వ్యక్తులను ముందస్తు అరెస్టు(ప్రివెంటివ్ డిటెన్షన్) చేయవచ్చు. విచారణ లేకుండా ఏడాదిపాటు ఈ నిర్బంధాన్ని పొడిగించవచ్చు. కాగా, ‘పశ్చిమ బెంగాల్ శాంతిభద్రతల (సవరణ) బిల్లు, 2026’ పేరిట మరో బిల్లును కూడా అధికారపక్షం తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఘర్షణలు, హింసాత్మక ఘటనల్లో ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల నుంచి పరిహారం వసూలుకు ఈ కమిషన్ విచారణ జరిపి ఆదేశాలు జారీ చేస్తుంది. విధ్వంసానికి పాల్పడిన వ్యక్తులతోపాటు వారిని రెచ్చగొట్టిన వారు, ఆర్థికంగా, ఇతరత్రా సహకరించినవారి నుంచి పరిహారం వసూలు చేస్తారు. ఇందుకోసం ఆయా వ్యక్తుల ఆస్తుల జప్తు, వేలం వంటి ప్రక్రియలను చేపడతారు.
ఇవి కూడా చదవండి
ధాన్యం ఉత్పత్తి, సేకరణలో దేశంలోనే తెలంగాణ టాప్: తుమ్మల
హీరో అవ్వాలని చూశాడు.. తిలక్ వర్మపై కృష్ణమాచారి సంచలన వ్యాఖ్యలు!