సర్’లో ఓట్లు గల్లంతైన వారికి మరో చాన్స్
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:06 AM
‘సర్’ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం ఇచ్చింది.
మళ్లీ ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణకు ఈసీ ఏర్పాట్లు
తెలంగాణ, ఏపీ సహా 7 రాష్ట్రాల్లో ప్రక్రియ
న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలో పేర్లు గల్లంతైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మరో అవకాశం ఇచ్చింది. ఎన్యుమరేషన్ ఫారాలు అందక ‘గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం, డూప్లికేట్ (ఏఎఎస్‌డీడీ)’ కేటగిరీ కింద నమోదై.. ముసాయిదాలో పేర్లు లేని ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫారాలను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సదరు ఓటర్లకు వాట్సాప్, ఈ-మెయిల్‌తోపాటు బీఎల్‌వోల ద్వారా నేరుగా ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయనుంది. ఓటర్లు ఆ ఫారాలను నింపి ‘ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్‌వో), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్‌వో)’లకు సమర్పించవచ్చు. అయితే ఈ ఓటర్లు అదే చిరునామాలో ఉంటే.. ఇంతకు ముందు ఎన్యుమరేషన్ ఫారాలు ఎందుకు ఇవ్వలేదో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చిరునామా మారిన, వలస వెళ్లినవారు సంబంధిత చిరునామాకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలి. ‘ఏఎ్‌సడీడీ’ కేటగిరీలోని ఓటర్లు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, జార్ఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల(సీఈవోల)కు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ఓటర్లు తుది జాబితాలో పేరు చేర్చుకునేలా ప్రచారం కల్పించాలని, పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
గల్లంతైన ఓటర్లను చేర్చే ప్రక్రియ ఇదీ..
ఏఎ్‌సడీడీ కేటగిరీలో నమోదైన ఓటర్ల వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా మళ్లీ ప్రదర్శిస్తారు. సీఈవో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా సదరు ఓటర్లకు సంబంధించి.. పేరు చేర్చకపోవడానికి కారణాలను పేర్కొంటూ వివరాలను అందుబాటులో ఉంచుతారు. జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు ఈసీఐ నెట్ డ్యాష్ బోర్డ్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను కొత్తగా జనరేట్ చేస్తారు. బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌వోలు) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో సమన్వయం చేసుకుంటూ.. సదరు ఓటర్లను సంప్రదించి, ఇంటింటి విచారణ చేపడతారు. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అనుసంధానమై ఉన్నవారికి వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఫారాలను పంపుతారు. ఓటర్లు కూడా తమ పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఈసీఐ వెబ్‌సైట్, ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చు. ఓటర్లు సమర్పించిన ఫారాలను ఈఆర్‌వోలు నిబంధనల ప్రకారం నిశితంగా పరిశీలిస్తారు. అర్హత కలిగిన ఓటర్లకు గతంలో ఉన్న ఎపిక్ నంబర్‌నే తిరిగి కేటాయించి, ‘సర్’ తుది ఓటర్ల జాబితాలో చేరుస్తారు. ‘సర్’ ప్రక్రియలో ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వాల్సిన పనిలేదు.
చిరునామా మారకుంటే డిక్లరేషన్!
ఇప్పటివరకు చిరునామా మారని ఓటర్లకు, అదే రాష్ట్రంలో వేరే ప్రాంతానికి మారిన ఓటర్లకు ఈసీ వేర్వేరు విధానాలను నిర్దేశించింది. ఒకే చిరునామాలో నివసిస్తున్న ఓటర్లు తాము నింపిన ఎన్యుమరేషన్ ఫారంతోపాటు గతంలో ఎందుకు ఫారం ఇవ్వలేకపోయామో వివరిస్తూ డిక్లరేషన్‌ను జత చేయాలి. దీన్ని ఈఆర్‌వో, ఏఈఆర్‌వో లేదా బీఎల్‌వోకు నేరుగా, కుటుంబసభ్యుల ద్వారా ఇవ్వవచ్చు. ఈసీఐనెట్‌లో ఈ-సైన్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చు. అదే రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు మారిన ఓటర్లు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదు. వారు ఫారంతోపాటు కొత్త చిరునామా ఆధారాలను కొత్త నియోజకవర్గ ఈఆర్‌వో, ఏఈఆర్‌వో లేదా స్థానిక బీఎల్‌వోకు సమర్పించాలి. ఎటువంటి చిరునామా ఆధారాలు లేని నిరాశ్రయుల విషయంలో బీఎల్‌వో క్షేత్రస్థాయి ధ్రువీకరణ నివేదికనే నివాస రుజువుగా పరిగణించనున్నారు. కాగా, ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. జాబితాల్లో పేర్లు లేని ఓటర్లు ఎన్నికల అధికారులకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలని సూచించారు. ఈనెల 21 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
ఇవి కూాడా చదవండి...
శాటిలైట్లకు చిక్కకుండా పంట వ్యర్థాల దహనం.. ‘ఫైర్ వాచ్’తో సమస్యకు చెక్
ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీంకోర్టు కీలక స్పష్టత.