శిథిలాలు తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలే..
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:19 AM
ఎటు చూసినా శిథిలాలు.. కుప్పగా పడిపోయి ఉన్న భవనాలు.. శిథిలాలను తొలగించినకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు.. తమను కాపాడాలంటూ శిథిలాల కింద నుంచి బాధితుల ఆర్తనాదాలు.. తమవారి జాడ కోసం...
వెనెజువెలాలో 920కి చేరిన మృతుల సంఖ్య
ఆచూకీ లభించని వారి సంఖ్య 50 వేలకుపైనే!
కరాకస్, లా గువైరాల్లో హృదయవిదారక దృశ్యాలు
కాపాడాలంటూ శిథిలాల కిందున్న వారి ఆర్తనాదాలు
కూలిపోయేస్థితిలో వేలాది ఇళ్లు.. వాటిలోకి వెళ్లలేక
పార్కులు, ఖాళీ స్థలాల్లో బాధితుల తిప్పలు
35 టన్నుల వైద్య సామగ్రి, మందుల్ని పంపిన భారత్
కరాక్‌స/న్యూఢిల్లీ, జూన్ 26: ఎటు చూసినా శిథిలాలు.. కుప్పగా పడిపోయి ఉన్న భవనాలు.. శిథిలాలను తొలగించినకొద్దీ బయటపడుతున్న మృతదేహాలు.. తమను కాపాడాలంటూ శిథిలాల కింద నుంచి బాధితుల ఆర్తనాదాలు.. తమవారి జాడ కోసం కుటుంబ సభ్యుల రోదనలు.. ప్రాణాలు నిలబడినా సర్వస్వం కోల్పోయామంటూ వేలాది మంది ఆక్రందనలు.. వెనెజువెలాలోని కరాకస్, లా గువైరా ప్రాంతాల్లో భూకంపం అనంతరం కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలివి. పేకమేడల్లా కుప్పకూలిన భవనాల శిథిలాల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. అందులో ఎందరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు. భారీ భవనాల కాంక్రీట్ శిథిలాలను తొలగించడం చాలా కష్టతరం కావడంతో.. సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోంది. వెనెజువెలా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం నాటికి భూకంప మృతుల సంఖ్య 920కి, క్షతగాత్రుల సంఖ్య 4,300దాటింది. ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ ఈ వివరాలు వెల్లడించారు. అధికారులు చెబుతున్న వివరాల మేరకు సుమారు 40 వేల మంది ఆచూకీ లభించడం లేదు. వారిలో చాలా మంది శిథిలాల కిందే ఉంటారని భావిస్తున్నారు. కరకాస్, లా గువైరా ప్రాంతాల్లో వందలాది భవనాలు కూలిపోయి, కాంక్రీట్ కుప్పలుగా మారిపోయాయి. భారీ యంత్రాలు, తగిన మేర సహాయక సిబ్బంది లేకపోవడంతో.. ఆ శిథిలాలను తొలగించడం కష్టతరంగా మారింది. శిథిలాల నుంచి దుమ్ముకొట్టుకుపోయి, రక్తగాయాలతో ఉన్న పిల్లలు, పెద్దవారిని బయటికి తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కొన్నిచోట్ల లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు వీలవక ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. శిథిలాల్లో ఉన్నవారు, బయట ఉన్న ఇరుగుపొరుగువారు.. శిథిలాల మధ్య నుంచి సొరంగాల్లా తవ్వుకుంటూ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకా క్షణక్షణమూ భయమే!
భూకంపం తర్వాత అనుబంధంగా చిన్నపాటి ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని వివిధ సంస్థలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు కరాకస్, లా గువైరా ప్రాంతాల్లో చాలా భవనాలు, ఇళ్లు బీటలు వారి, ఎప్పుడు కూలిపోతాయో అన్నట్టుగా ఉన్నాయి. దానితో ప్రజలు ఇళ్లలోకి వెళ్లి ఉండేందుకు భయపడుతున్నారు. ధైర్యం చేసి వెళ్లి డబ్బు, నగలు, విలువైన సామగ్రిని మాత్రం బయటికి తెచ్చుకుంటున్నారు. చాలా మంది గురువారం రాత్రి కూడా స్థానికంగా ఉన్న పార్కులు, మైదానాలు, ఖాళీ స్థలాల్లోనే గడిపారు.
సోషల్ మీడియాపై ఆంక్షలు ఎత్తివేత
వెనెజువెలాలో కొన్నేళ్లుగా ఎక్స్, ఇతర సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలకు, ప్రజలు పరస్పరం సమాచారాన్ని అందించుకోవడానికి వీలుగా సామాజిక మాధ్యమాలపై నియంత్రణలు ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి వెనెజువెలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనితో ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేసింది.
ప్రపంచ దేశాల ఆపన్న హస్తం
వెనెజువెలా రాజధాని కరాక్‌సలోని ప్రధాన విమానాశ్రయాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చారు. దీనితో ప్రపంచ దేశాల నుంచి రెస్క్యూ బృందాలు, మందులు, ఇతర సహాయక సామగ్రి వెనెజువెలాకు చేరుకుంటున్నాయి. యూఎ్‌సఏ, ఎల్ సాల్వెడార్, డొమినికన్ రిపబ్లిక్, క్యూబా, మెక్సికో నుంచి బృందాలు గురువారమే చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సాయం కోసం భారత్ ‘ఆపరేషన్ అమిస్తాద్’
వెనెజువెలాకు సాయం అందించేందుకు భారత్ ప్రత్యేకంగా ‘ఆపరేషన్ అమిస్తాద్’ చేపట్టింది. అమిస్తాద్ అంటే స్పానిష్ భాషలో స్నేహం అని అర్థం. ఈ ఆపరేషన్ కింద భారత్ వాయుసేనకు చెందిన రెండు సీ-17 సైనిక రవాణా విమానాల్లో 35 టన్నుల మానవతా సాయాన్ని పంపింది. అందులో మందులు, వైద్య పరికరాలు, సహాయక చర్యలకు అవసరమైన సామగ్రి, రెండు ‘భీష్మ్’ ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్లు ఉన్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారం ఈ వివరాలు వెల్లడించారు. ‘భీష్మ్’ యూనిట్లతో ఘటనా స్థలంలోనే అత్యంత వేగంగా.. అత్యవసర వైద్యం అందించే తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయవచ్చు. సాయంపై భారత్‌కు డెల్సీ రోడ్రిగెజ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..